Controversial Flexi: ఏ నా కొడుక్కీ భయపడాల్సిన పనిలేదు..
ABN , Publish Date - Dec 23 , 2025 | 04:54 AM
వైసీపీ నేతలు, కార్యకర్తల ‘రప్పా.. రప్పా’, ‘నరుకుడు..’ బాష పది, ఇంటర్ చదివే పిల్లల్లోనూ నేర ప్రవృత్తిని రెచ్చగొడుతోంది..!
వివాదాస్పద ఫ్లెక్సీ పెట్టిన పది, ఇంటర్ విద్యార్థులు
బుద్దిగా ఉండాలని కౌన్సెలింగ్ ఇచ్చిన న్యాయాధికారి
తోట్లవల్లూరు, డిసెంబరు 22(ఆంధ్రజ్యోతి): వైసీపీ నేతలు, కార్యకర్తల ‘రప్పా.. రప్పా’, ‘నరుకుడు..’ బాష పది, ఇంటర్ చదివే పిల్లల్లోనూ నేర ప్రవృత్తిని రెచ్చగొడుతోంది..! ‘రప్పా.. రప్పా..’ అంటూ రెచ్చగొడుతున్న వారిని గుడ్డిగా ఫాలో అవుతూ.. ‘‘ఉంటే ఉంటాం పోతే పోతాం... ఏ నా కొడుక్కీ భయపడాల్సిన అవసరం మాకు లేదు’ అంటూ జగన్ పుట్టినరోజు సందర్భంగా వివాదాస్పద ఫ్లెక్సీని ఏర్పాటుచేసిన ఇద్దరిని పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. జగన్ జన్మదినం సందర్భంగా ఆదివారం కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలం గరికపర్రు సెంటర్లో ఇంటర్, టెన్త్ చదువుతున్న వీరంకి ఈశ్వర్, పామర్తి నాగ వెంకట బాపూజీ ఈ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. దానిపై అభ్యంతరం వ్యక్తం చేసిన టీడీపీ కార్యకర్త వీరంకి చిరంజీవి.. ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ ఇద్దరిపై కేసు నమోదు చేసిన ఎస్సై సీహెచ్ అవినాశ్ సోమవారం వారిని ఉయ్యూరు కోర్టులో హాజరు పర్చారు. టెన్త్, ఇంటర్ చదువుతున్న విద్యార్థులు కావడంతో న్యాయాధికారి వారికి కౌన్సెలింగ్ ఇచ్చి... మీకు రాజకీయాలతో పనేంటని, ఇకనైనా బుద్దిగా ఉండాలని సూచించినట్టు తెలిసింది.