AP Transco: ఆ నిర్ణయం ఖరీదు 300 కోట్ల
ABN , Publish Date - Oct 12 , 2025 | 04:37 AM
ఏపీ ట్రాన్స్‌కో అధికారులు తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమవుతోంది. కాంట్రాక్టర్లకు లబ్ధికలిగేలా, ప్రభుత్వంపై భారం పడేలా 2013 నాటి కాంట్రాక్టర్స్ ఓవర్‌హెడ్స్ అండ్ ప్రాఫిట్స్ (సీవోపీ) ఉత్తర్వులను...
ట్రాన్స్‌కో నిర్వాకంతో ఏటా ప్రభుత్వంపై భారం
కాంట్రాక్టర్లకు లబ్ధి కలిగించేలా నిర్ణయం
దుమ్ముదులిపి మరీ 2013 నాటి సీవోపీ ఉత్తర్వులు అమలు
ఈ నిర్ణయంతో కాంట్రాక్టర్లకు అదనంగా 14శాతం లబ్ధి
ఎస్‌ఎస్ఆర్ ఆధారంగానే టెండర్ల మొత్తం నిర్ణయం
మళ్లీ దానిపై అదనంగా చెల్లింపులపై విమర్శలు
రాజధాని పరిధిలోనే 2 వేల కోట్ల విద్యుత్తు పనులు
త్వరలో ప్రకాశంలో 1,382 కోట్ల పనులకు టెండర్లు
ఈ కాంట్రాక్టర్లకు ‘మేలు’ చేసేందుకేనని ఆరోపణలు
విద్యుత్తు వినియోగదారులపై భారం తగ్గించాలని, ఈ దిశగా నిర్ణయాలు అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్నారు. మరోవైపు ఏపీ ట్రాన్స్‌కో ఏమో సీఎం సూచనలను బేఖాతరు చేస్తూ కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చేలా నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం ఖరీదు దాదాపు 300 కోట్ల రూపాయలు! విద్యుత్తు శాఖ అధికారుల నిర్వాకం వల్ల అది కూడా ఒకసారి కాదు.. రాష్ట్ర ప్రభుత్వంపై ఏటా ఈ మేరకు అదనపు భారం పడనుంది.
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
ఏపీ ట్రాన్స్‌కో అధికారులు తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమవుతోంది. కాంట్రాక్టర్లకు లబ్ధికలిగేలా, ప్రభుత్వంపై భారం పడేలా 2013 నాటి కాంట్రాక్టర్స్ ఓవర్‌హెడ్స్ అండ్ ప్రాఫిట్స్ (సీవోపీ) ఉత్తర్వులను మళ్లీ అమలు చేయాలని నిర్ణయించారు. దీనిప్రకారం.. కాంట్రాక్టర్లకు అదనంగా 14 శాతం వరకు లబ్ధి చేకూరనుంది. ట్రాన్స్‌కో ఆధ్వర్యంలో ఏటా సుమారు రూ.3 వేల కోట్ల పనులకు టెండర్లు పిలుస్తుంటారు. ప్రస్తుతం రాజధాని పరిధిలోనే రూ.2 వేల కోట్ల వరకు విద్యుత్తు పనులు జరుగుతున్నాయి. ప్రకాశం జిల్లాలో త్వరలో 1382 కోట్ల పనులకు టెండర్లు పిలవనున్నారు. ఈ పనుల్లో కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చేందుకే అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారనే విమర్శలు వస్తున్నాయి.
ఇదీ అధికారుల నిర్వాకం...
ట్రాన్స్‌కో ఆధ్వర్యంలో ఏటా పలు నిర్మాణ పనులు జరుగుతుంటాయి. ఎల్‌టీ, హెచ్‌టీ, ఈహెచ్‌టీ లైన్ల ఏర్పాటు, టవర్ల నిర్మాణం, ఎర్త్ ఫ్లాట్స్ , సబ్ స్టేషన్ల నిర్మాణం వంటి పనులకు ఏటా టెండర్లు పిలుస్తుంటారు. నిర్దేశిత పనికి ఎంత మొత్తం ఖర్చవుతుందో లెక్కలు వేసి టెండరు మొత్తాన్ని అధికారులు నిర్ణయిస్తారు. టెండరులో పేర్కొన్న నిర్ణీత మొత్తానికి కాస్త ఎక్సె్‌సకు కానీ లెస్‌కు కానీ కాంట్రాక్టర్లు టెండర్లు వేస్తుంటారు. ఒకసారి టెండరు పాడుకున్న తర్వాత అందులో పేర్కొన్న మొత్తాన్ని మాత్రమే కాంట్రాక్టర్లకు చెల్లించాల్సి ఉంటుంది. కానీ కాంట్రాక్టర్లకు అదనపు లబ్ధి చేకూర్చేందుకు 2013లో ఉమ్మడి ఏపీలో ట్రాన్స్‌కో అధికారులు కాంట్రాక్టర్స్ ఓవర్‌హెడ్స్ అండ్ ప్రాఫిట్స్ (సీవోపీ) అనే కొత్త విధానాన్ని తెరపైకి తెస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ ఉత్తర్వుల మేరకు కాంట్రాక్టరు ఒప్పందం చేసుకున్న మొత్తానికి అదనంగా సుమారు 14 శాతం వరకు చెల్లించే వెసులుబాటు ఉంటుంది. ఈ మొత్తాన్ని టెండరులోని మెటీరియల్ కాంపొనెంట్‌ను లెక్కించి దానిపై 14 శాతం అదనంగా చెల్లిస్తారు. దీనికి ట్రాన్స్‌కో అధికారులు అప్పట్లో చెప్పిన కారణమే చిత్రంగా ఉంది. టెండరులో పాల్గొనే కాంట్రాక్టర్ల మధ్య ఆరోగ్యకర పోటీకి, ప్రాజెక్టు నిర్మాణ పనులు సజావుగా సాగేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. 2020లో అప్పటి వైసీపీ ప్రభుత్వం ఈ ఉత్తర్వులు కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చేలా ఉన్నాయని పేర్కొంటూ వాటి అమలును నిలిపివేసింది. నిధులను స్వాహా చేయడం, పక్కదారి పట్టించడంలో ఆరితేరిన వైసీపీ సర్కారే పక్కన పెట్టిన ఈ ఉత్తర్వులను.. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో అధికారులు దుమ్ముదులిపి బయటకు తీశారు. 2013 నాటి సీవోపీ ఉత్తర్వులను మళ్లీ అమలు చేయాలని నిర్ణయించారు. ఈ నెల 7న ట్రాన్స్‌కో అధికారులు ఈ మేరకు ట్రాన్స్‌మిషన్ ఆఫీసు ఆర్డర్(టీవోవో) 3775ని జారీ చేశారు.
కాంట్రాక్టర్లు అడిగారని ఇచ్చేశారట!
కాంట్రాక్టర్స్ ఓవర్‌హెడ్స్ అండ్ ప్రాఫిట్స్(సీవోపీ) ఉత్తర్వులను మళ్లీ తెరపైకి తీసుకురావడానికి ఇప్పుడు ట్రాన్స్‌కో అధికారులు చెప్పిన కారణం మరీ చిత్రంగా ఉంది. ఏపీ ట్రాన్స్‌కో కాంట్రాక్టర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి మేరకు 2013 నాటి సీవోపీ ఉత్తర్వులను పునరుద్ధరించాలని బోర్డులో నిర్ణయం తీసుకున్నామని ట్రాన్స్‌కో తన ఉత్తర్వులో పేర్కొనడం గమనార్హం. తమ నిర్ణయాన్ని సమర్థించుకుంటూ మరో అడ్డగోలు వాదనకూ ట్రాన్స్‌కో తెరదీసింది. తమ నిర్ణయం వల్ల టెండర్లలో ఎక్సెస్ కోట్ చేయడం తగ్గుతుందని పేర్కొంది. కానీ వాస్తవానికి ఈ ఉత్తర్వులు అమల్లో ఉన్న సమయంలోనే కాంట్రాక్టర్లు టెండర్లలో భారీ మొత్తంలో ఎక్సెస్ కోట్ చేశారు. ఉత్తర్వులు రద్దయిన సమయంలో పిలిచిన టెండర్లలో ఒకటి రెండు టెండర్లు మినహా ఎక్కడా ఎక్సెస్ కోట్ చేసిన దాఖలాల్లేవు.
ప్రభుత్వానికి నష్టమెంత..?
ట్రాన్స్‌కో ఆధ్వర్యంలో లైన్లు, ఎర్త్ ఫ్లాట్స్, సబ్‌స్టేషన్ నిర్మాణ పనులు చేస్తుంటారు. ఏటా సుమారు రూ.3 వేల కోట్ల వరకు పనులకు టెండర్లు పిలుస్తుంటారు. ఈ పనుల్లో 70 శాతం వరకు అంటే... సుమారు రూ.2100 కోట్ల వరకు మెటీరియల్ కాంపోనెంట్ ఉంటుంది. సీవోపీ ఉత్తర్వులను ట్రాన్స్‌కో పునరుద్ధరించడం వల్ల.. దీనిపై 14 శాతం అంటే రూ.290 కోట్లు, దానిపై జీఎస్టీ కలిపితే మొత్తం రూ.300 కోట్ల పైచిలుకు కాంట్రాక్టర్లకు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఇదంతా ప్రభుత్వంపై భారమే. ఒకసారి కామన్ స్టాండర్డ్ షెడ్యూల్ రేట్స్ (సీఎ్‌సఎ్‌సఆర్)లో నిర్ణయించిన ధరల ఆధారంగా పిలిచిన టెండర్లకు అదనంగా 14 శాతం చెల్లిస్తామని పేర్కొంటూ ఉత్తర్వులు ఇవ్వడం ఏమిటనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం రాజధాని పరిధిలోనే సుమారు రూ.2 వేల కోట్ల వరకు విద్యుత్తు పనులు జరుగుతున్నాయి. కొద్ది రోజుల్లో ప్రకాశం జిల్లాలో ఓ ప్రైవేటు కంపెనీ ఏర్పాటు చేస్తున్న సోలార్ పవర్ ప్లాంట్‌కు 900 మెగావోల్ట్ యాంపియర్స్(ఎంవీఏ) ఎక్స్‌ట్రా హైటెన్షన్ విద్యుత్తు లైన్లు వేసేందుకు రూ.1382.97 కోట్లకు టెండర్లు పిలవనున్నారు. దీనికి ఇప్పటికే పరిపాలనా ఆమోదం ఇచ్చారు. విద్యుత్తు పనుల్లో టెండర్లు దక్కించుకున్న.. త్వరలో టెండర్లలో పాల్గొనే కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చేందుకే ట్రాన్స్‌కో హడావిడిగా సీవోపీ ఉత్తర్వులను మళ్లీ తెరపైకి తెచ్చి ఆమోదం తెలిపిందనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వానికి వందల కోట్ల రూపాయల నష్టాన్ని కలిగించే ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వెనుక ‘ఉన్నత’ స్థాయి మంత్రాంగమే పనిచేసిందని సమాచారం. ఉన్నత స్థాయి ఒత్తిళ్ల కారణంగానే ఆగమేఘాలపై ఈ ఉత్తర్వులకు ట్రాన్స్‌కో బోర్డు ఆమోదం తెలిపిందని చెబుతున్నారు.