Share News

Contractors Protest: బిల్లుల కోసం రోడ్డెక్కిన కాంట్రాక్టర్లు

ABN , Publish Date - Oct 23 , 2025 | 05:04 AM

బిల్లుల కోసం కాంట్రాక్టర్లు ఆందోళన బాట పట్టారు. బుధవారం విజయవాడలోని అర్‌ఆండ్‌బీ, ఆర్‌డబ్ల్యూఎస్‌ కార్యాలయాల..

Contractors Protest: బిల్లుల కోసం రోడ్డెక్కిన కాంట్రాక్టర్లు

  • ఆర్‌అండ్‌బీ చీఫ్‌ ఇంజనీర్‌ చాంబర్‌లో బైఠాయింపు

  • ఆర్‌డబ్ల్యూఎస్‌ ఈఎన్‌సీ కార్యాలయం ఎదుట 26 జిల్లాల కాంట్రాక్టర్ల మౌన నిరాహార దీక్ష

విజయవాడ సిటీ/విజయవాడ, అక్టోబరు 22(ఆంధ్రజ్యోతి): బిల్లుల కోసం కాంట్రాక్టర్లు ఆందోళన బాట పట్టారు. బుధవారం విజయవాడలోని అర్‌ఆండ్‌బీ, ఆర్‌డబ్ల్యూఎస్‌ కార్యాలయాల వద్ద నిరసన వ్యక్తం చేశారు. కొవిడ్‌ సమయంలో రాష్ట్రవ్యాప్తంగా పలు గ్రామాల్లో 170 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు(పీహెచ్‌సీ) నిర్మించిన కాంట్రాక్టర్లు ఆర్‌అండ్‌బీ చీఫ్‌ ఇంజనీర్‌ ఎన్‌.మాధవి సుకన్య చాంబర్‌ ముందు కొద్దిసేపు ప్లకార్డులు ప్రదర్శించారు. సీఈ చాంబర్‌లోకి ప్రవేశించి ఆమెకు వినతిపత్రాలు అందజేశారు. అనంతరం అక్కడే నేలపై కూర్చుని బిల్లులు చెల్లించాలని, లేదంటే ఆత్మహత్యలు చేసుకుంటామని ప్లకార్డులు ప్రదర్శించారు. స్టేట్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ బిల్డింగ్‌ కాంట్రాక్టర్స్‌ అసోసియేషన్‌ (ఎస్‌ఏబీసీఏ) పిలుపు మేరకు 26 జిల్లాల నుంచి 74 మంది కాంట్రాక్టర్లు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. పోలీసుల రంగప్రవేశంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. రవాణా, రోడ్లు, భవనాల ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు దగ్గరకు తమను తీసుకెళ్లాలని వారు సీఈని కోరడంతో ఐదుగురు కాంట్రాక్టర్లను ఆమె సచివాలయానికి తీసుకెళ్లారు. నెల రోజుల్లో బిల్లుల చెల్లింపునకు కృష్ణబాబు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

కాంట్రాక్టర్ల పొట్ట కొడతారా?

జల్‌ జీవన్‌ మిషన్‌(జేజేఎం) పనుల బిల్లుల చెల్లింపుల్లో కార్పొరేట్‌ కంపెనీలపై వల్లమాలిన ప్రేమతో చిన్న కాంట్రాక్టర్ల పొట్ట కొడతారా అంటూ గ్రామీణ నీటి సరఫరా (ఆర్‌డబ్ల్యూఎస్‌) కాంట్రాక్టర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. నవ్యాంధ్ర ఆర్‌డ బ్ల్యూఎస్‌ కాంట్రాక్టర్ల అసోసియేషన్‌ నేతృత్వంలో 26 జిల్లాల నుంచి పెద్దసంఖ్యలో తరలివచ్చిన కాంట్రాక్టర్లు గొల్లపూడి ఎన్‌టీఆర్‌ సెంటర్‌కు చేరుకున్నారు. తమ సమస్యలపై ఎన్టీఆర్‌ విగ్రహానికి మెమోరాండం ఇచ్చి, కొద్దిసేపు ధర్నా నిర్వహించారు. ఆ తర్వాత ర్యాలీగా ఈఎన్‌సీ కార్యాలయానికి చేరుకొని, మౌన నిరాహారదీక్ష చేపట్టారు. బిల్లులు చెల్లిస్తామని హామీ ఇచ్చే వరకు దీక్షను కొనసాగించాలని నిర్ణయించారు. గత రెండు పర్యాయాలు ప్రభుత్వం విడుదల చేసిన నిధులను బడా కాంట్రాక్టర్లకే చెల్లించారు. రెండో దఫా 15శాతం మాత్రమే చిన్న కాంట్రాక్టర్లకు చెల్లించారు. గత నెలలో ప్రభుత్వం రూ.150 కోట్ల చెల్లింపులకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. వాటిని కూడా రెండు పెద్ద సంస్థలకు చెల్లించేందుకు లోపాయికారీగా అధికారులు ప్రయత్నిస్తున్నారన్న సమాచారంతో చిన్న కాంట్రాక్టర్లలో ఆందోళన నెలకొంది. దీంతో ప్రత్యక్ష ఆందోళనకు సిద్ధమయ్యారు. జేజేఎం బిల్లుల చెల్లింపు విషయంలో పనులు చేపట్టిన తేదీల ప్రకారం కాకుండా ఉన్నతాధికారులు ఇష్టానుసారం చెల్లిస్తున్నారని నవ్యాంధ్ర ఆర్‌డబ్ల్యూఎస్‌ కాంట్రాక్టర్ల అసోసియేషన్‌ అగ్ర నాయకుడు వీబీ శ్రీనివాస్‌ ఆరోపించారు.

Updated Date - Oct 23 , 2025 | 05:04 AM