Share News

Regularization Scam: ఇంటర్‌లో క్రమబద్ధీకరణ స్కామ్‌

ABN , Publish Date - Oct 17 , 2025 | 03:59 AM

ఇంటర్మీడియట్‌ విద్యలో మరో భారీ స్కామ్‌కు తెరలేచింది. ఎప్పుడో వైసీపీ ప్రభుత్వ హయాంలో మధ్యలోనే ఆగిపోయిన కాంట్రాక్టు జూనియర్‌ లెక్చరర్ల క్రమబద్ధీకరణ పేరుతో కొందరు అక్రమార్కులు కోట్లలో వసూళ్లకు దిగారు.

Regularization Scam: ఇంటర్‌లో క్రమబద్ధీకరణ స్కామ్‌

  • కాంట్రాక్టు జేఎల్స్‌ రెగ్యులరైజేషన్‌ పేరుతో వసూళ్లు

  • ఒక్కో జూనియర్‌ లెక్చరర్‌ నుంచి రూ.లక్షన్నర

  • వసూళ్లలో కీలకంగా ఇద్దరు జూనియర్‌ లెక్చరర్లు

  • వారిలో ఒకరు ఓ మంత్రికి సన్నిహితుడు

  • క్రమబద్ధీకరణకు మరో మంత్రి మాటిచ్చారని ప్రచారం

  • ఇప్పటికే దాదాపు రూ.20 కోట్లు వసూలు

కాంట్రాక్టు జూనియర్‌ లెక్చరర్ల క్రమబద్ధీకరణ పేరిట కొందరు అక్రమాలకు తెరలేపారు..! ప్రభుత్వంలో పలుకుబడి.. మంత్రుల అండదండలు ఉన్నాయని ప్రచారం చేసుకుంటూ వసూళ్లు మొదలుపెట్టారు..! కచ్చితంగా రెగ్యులరైజ్‌ చేయిస్తామని.. ప్రభుత్వ ఉద్యోగం ఖాయమని చెబుతూ.. ఒక్కో కాంట్రాక్టు జూనియర్‌ లెక్చరర్‌ నుంచి రూ.1.5లక్షలు వసూలు చేసినట్టు సమాచారం. శ్రీకాకుళానికి చెందిన ఓ కాంట్రాక్టు జేఎల్‌, చిత్తూరుకు చెందిన ఓ కాంట్రాక్టు జేఎల్‌ దీనిలో కీలకంగా వ్యవహరిస్తున్నారని, వారికి మరో ముగ్గురు జేఎల్స్‌ సహకరిస్తున్నట్టు తెలిసింది.

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

ఇంటర్మీడియట్‌ విద్యలో మరో భారీ స్కామ్‌కు తెరలేచింది. ఎప్పుడో వైసీపీ ప్రభుత్వ హయాంలో మధ్యలోనే ఆగిపోయిన కాంట్రాక్టు జూనియర్‌ లెక్చరర్ల క్రమబద్ధీకరణ పేరుతో కొందరు అక్రమార్కులు కోట్లలో వసూళ్లకు దిగారు. తమకు ప్రభుత్వంలో పలుకుబడి ఉందని.. ఓ మంత్రి కచ్చితంగా పనిచేయిస్తానని మాటిచ్చారని ప్రచారం చేసుకుంటూ ఒక్కో జూనియర్‌ లెక్చరర్‌ నుంచి రూ.1.5 లక్షలు చొప్పున ఇప్పటికే దాదాపు రూ.20 కోట్లు వసూలు చేసినట్టు తెలిసింది. ఈ వ్యవహారం ఇప్పుడు ఇంటర్‌ విద్యాశాఖలో చర్చనీయాంశంగా మారింది.


ఆ ఇద్దరు జూనియర్‌ లెక్చరర్లే

శ్రీకాకుళానికి చెందిన ఓ కాంట్రాక్టు జేఎల్‌, చిత్తూరుకు చెందిన ఓ కాంట్రాక్టు జేఎల్‌ ఇందులో కీలకంగా వ్యవహరిస్తున్నారు. వారికి తూర్పుగోదావరి, గుంటూరు, నెల్లూరులో ముగ్గురు జేఎల్స్‌ సహకరిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రారంభమై మధ్యలో ఆగిపోయిన కాంట్రాక్టు జేఎల్స్‌ క్రమబద్ధీకరణ ప్రస్తుతం ఆర్థిక శాఖ వద్ద పెండింగ్‌లో ఉంది. కొంతకాలంగా ఈ ఇద్దరు జేఎల్స్‌ మాత్రం త్వరలోనే క్రమబద్ధీకరణ జరుగుతుందని ప్రచారం చేస్తూ వస్తున్నారు. దీని గురించి ఓ మంత్రితో మాట్లాడామని, క్రమబద్ధీకరణ చేయిస్తానని ఆయన హామీ ఇచ్చారని చెబుతున్నారు. క్రమబద్ధీకరణ కావాలంటే ఒక్కొక్కరూ లక్షన్నర ఇవ్వాల్సి ఉంటుందని.. అదికూడా అపాయింట్‌మెంట్‌ ఆర్డర్‌ వచ్చాకే ఇవ్వాలని మొదట చెప్పారు. కానీ.. నెల రోజుల నుంచి అడ్వాన్స్‌గానే ఇవ్వాలంటూ వసూళ్ల పర్వానికి తెరలేపారు. రాష్ట్రంలో 3,572 మంది కాంట్రాక్టు జేఎల్స్‌ ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో పనిచేస్తుండగా.. వారిలో ఇప్పటికే సగం మందికిపైగా ముడుపులు సమర్పించారని తెలిసింది.

కాలేజీల వారీగా సమీకరణ

మొదట కాలేజీల వారీగా ఆ కాలేజీలోని అందరు కాంట్రాక్టు జేఎల్స్‌ తరఫున ఒకరు వసూలు చేశారు. వాటిని జిల్లా స్థాయిలో ఒక ప్రతినిధికి చేరవేశారు. ఇలా ఇప్పటివరకు వసూలు చేసిన సుమారు రూ.20 కోట్లలో.. ఓ మంత్రికి ఇవ్వాలంటూ.. రూ.10 కోట్లు విజయవాడలో పెట్టినట్లు తెలిసింది. అయితే ఆ నగదును నిజంగా మంత్రికి ఇచ్చారా? లేక మంత్రి పేరుతో మధ్యవర్తులుగా ఉన్న జేఎల్స్‌ కాజేశారా..? అనేది తేలాలి. శ్రీకాకుళానికి చెందిన జేఎల్‌ ఓ మంత్రికి అత్యంత సన్నిహితుడు. బంధువు అనే ప్రచారం కూడా ఉంది. దీంతో క్రమబద్ధీకరణ జరిగిపోతుందని నమ్మిన వారు అడిగిన మేరకు ముడుపులు ఇచ్చేశారు.


ఆర్థిక శాఖ వద్దే ఫైలు

గత వైసీపీ ప్రభుత్వం కాంట్రాక్టు ఉద్యోగులందరినీ క్రమబద్ధీకరిస్తామని హామీ ఇచ్చింది. ఎన్నికలకు ముందు హడావిడిగా క్రమబద్ధీకరణ ప్రక్రియ ప్రారంభించింది. మిగిలిన శాఖల్లో ఈ ప్రక్రియ ముందుకెళ్లినా ఇంటర్‌ విద్యలో మాత్రం మధ్యలోనే ఆగిపోయింది. కాంట్రాక్టు జేఎల్స్‌ క్రమబద్ధీకరణలో రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ అమలు, కాంట్రాక్టు జేఎల్‌గా చేరినప్పుడు అక్కడ మంజూరైన పోస్టు ఉందా?, వయస్సు, విద్యార్హత, ఒకేషనల్‌ కాంట్రాక్టు జేఎల్స్‌ ఏ పోస్టుల కింద విధుల్లో చేరారు? ఇలా.. ఐదు కారణాలతో దీన్ని నిలిపివేసిన అప్పటి ప్రభుత్వం న్యాయ సలహా కోరింది. సుమారు 1,600 మంది క్రమబద్ధీకరణకు అర్హులు కారని అప్పట్లో అంచనా వేశారు. వారి క్రమబద్ధీకరణపై న్యాయ సలహా కూడా ప్రతికూలంగానే వచ్చినట్లు తెలిసింది. ప్రస్తుతం ఆర్థిక శాఖ వద్ద పెండింగ్‌లో ఉన్న ఆ ఫైలును సీఎం వద్దకు తీసుకెళ్లేలా చేస్తామంటూ ముడుపులు వసూళ్లు చేస్తున్నవారు చెబుతున్నారు.

డబ్బులివ్వకపోతే కష్టమని బ్లాక్‌మెయిల్‌

మధ్యవర్తుల మాటలపై నమ్మకం లేక కొందరు ముడుపులు ఇవ్వట్లేదు. కొందరు అసలు తాము లంచాల జోలికే రాబోమని తేల్చేశారు. అలాంటి వారు రెగ్యులరైజ్‌ కారని, డబ్బులిచ్చిన వారు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలు పొందుతారని మధ్యవర్తులు బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నారు. గత ప్రభుత్వంలో క్రమబద్ధీకరణ ప్రక్రియ ప్రారంభమైనప్పుడు కొందరు కాంట్రాక్టు జేఎల్స్‌ నుంచి రూ.50వేలు చొప్పున వసూలు చేశారు. ఆ డబ్బు తిరిగి ఇవ్వలేదు. మళ్లీ ఇప్పుడు రూ.లక్షన్నర అంటే తామెక్కడి నుంచి తేవాలని కాంట్రాక్టు జేఎల్స్‌ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా... అనేక మంది ప్రభుత్వ ఉద్యోగం వస్తుందన్న ఆశతో అప్పులు చేసైనా ముడుపులు చెల్లిస్తున్నారు.

Updated Date - Oct 17 , 2025 | 04:02 AM