Turkapalem: కలుషిత సెలైన్ కాటేసిందా
ABN , Publish Date - Sep 11 , 2025 | 03:53 AM
రాష్ట్ర వైద్య రంగానికి, అధికార యంత్రాంగానికి కంటిమీద కునుకు లేకుండా చేసిన గుంటూరు జిల్లా తురకపాలెం వరుస మరణాలకు స్థానిక ఆర్‌ఎంపీ చేసిన నిర్వాకమే కారణమా...
తురకపాలెంలో దాని ద్వారానే ప్రబలిన ఇన్‌ఫెక్షన్లు!
జ్వర బాధితులకు తొలుత ఆర్‌ఎంపీ దగ్గరే చికిత్స
అనంతరం రోగం ముదిరి ఆస్పత్రుల పాలై మృతి
ఆర్‌ఎంపీ క్లినిక్‌లో భారీగా యాంటిబయాటిక్‌లు
క్లినిక్‌ను సీజ్ చేసిన వైద్య ఆరోగ్యశాఖ అధికారులు
ఇటీవల చెన్నైలో కలుషిత సెలైన్‌తో ఇదే తరహా ఇన్‌ఫెక్షన్లు
మిస్టరీ మరణాలకు ఇదే కారణం కావొచ్చనే అనుమానం
గుంటూరు మెడికల్, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వైద్య రంగానికి, అధికార యంత్రాంగానికి కంటిమీద కునుకు లేకుండా చేసిన గుంటూరు జిల్లా తురకపాలెం వరుస మరణాలకు స్థానిక ఆర్‌ఎంపీ చేసిన నిర్వాకమే కారణమా? కలుషిత సెలైన్ వినియోగం వల్లే భారీగా ఇన్‌ఫెక్షన్లు ప్రబలాయా? జిల్లా వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు అదే అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. తురకపాలెంలో సంభవించిన మిస్టరీ మరణాలపై లోతుగా అధ్యయనం చేస్తున్న జాతీయ, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ దర్యాప్తు బృందాలు.. ఆర్‌ఎంపీ క్లినిక్‌ను పరిశీలించడంతో కీలక సమాచారం వెలుగుచూసింది. గ్రామంలో జ్వర బాధితులందరూ మొదట ఆ ఆర్‌ఎంపీ దగ్గరే చికిత్స పొందినట్టు అధికారులు గుర్తించారు. వీరికి సదరు ఆర్‌ఎంపీ కలుషిత సెలైన్లు ఎక్కించడంతో పాటు శక్తివంతమైన యాంటీబయాటిక్ మందులు వాడినట్లు విచారణలో తేలింది. ఆర్‌ఎంపీ దగ్గర చికిత్స పొందిన తర్వాతే రోగుల ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించి ఆస్పత్రుల్లో చేరినట్లు పలు బాధిత కుటుంబ సభ్యులు వైద్య నిపుణులకు తెలిపారు. బాధితుల్లో పలువురు మృతిచెందడంతో ఆర్‌ఎంపీ క్లినిక్‌లో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కే విజయలక్ష్మి బుధవారం తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో పలు శక్తివంతమైన యాంటీబయాటిక్ మందులు స్వాధీనం చేసుకుని క్లినిక్‌ను సీజ్ చేశారు. దీనిపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తామని ఆమె ప్రకటించారు. ఆర్‌ఎంపీలు తమ పరిధికి మించి చికిత్సలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ప్రస్తుతం ఆర్‌ఎంపీని అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు. 2023 మేలో చెన్నైలోని ఓ దంత వైద్యుడి క్లినిక్‌లోనూ ఇదే తరహాలో కలుషిత సెలైన్ ద్రావణంతో పలువురు ఇన్‌ఫెక్షన్లు బారిన పడగా.. వారిలో ఎనిమిది మంది మృతి చెందారని వైద్యులు తెలిపారు. వెల్లూరులోని క్రిస్టియన్ మెడికల్ కాలేజీ నిపుణుల బృందం చేసిన దర్యాప్తులో ఆ ఎనిమిది మంది న్యూరో మెలియోయిడోసిస్ (మెదడుకు సోకే ఇన్‌ఫెక్షన్)తో మృతిచెందినట్లు నిర్ధారించారు. పంటి నుంచి మెదడుకు ఇన్‌ఫెక్షన్ త్వరగా సోకడమే ఇందుకు కారణమని గుర్తించారు. దీంతో తురకపాలెం మరణాలకు కలుషిత సెలైన్ కారణం కావొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కొనసాగుతున్న వైద్య శిబిరాలు..
తురకపాలెంలో వైద్యశిబిరాలు కొనసాగుతున్నాయి. ఢిల్లీ నుంచి వచ్చిన నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్‌సీడీసీ) వైద్య బృందం మంగళవారం స్థానిక పరిస్థితులను పరిశీలించింది. అనంతరం ఈ బృందం గుంటూరు ప్రభుత్వ సమగ్రాస్పత్రి, వైద్య కళాశాల మైక్రోబయాలజీ విభాగంతోపాటు తొలుత గుంటూరులో మెలియోయిడోసిస్ ఇన్‌ఫెక్షన్లను గుర్తించిన ప్రైవేటు వైద్యుడు కల్యాణ్ చక్రవర్తిని కలిసి వివరాలు సేకరించారు. ఈ బృందంలో ఎన్‌సీడీసీకి చెందిన డాక్టర్ హేమలత, ఆరోగ్య శాఖ జేడీ డాక్టర్ మల్లీశ్వరి, స్టేట్ నోడల్ ఆఫీసర్ ప్రవీణ్‌కుమార్ ఉన్నారు.