Share News

During Jagan Regime: మలినాలతో మందు

ABN , Publish Date - Aug 13 , 2025 | 04:14 AM

గత జగన్‌ ప్రభుత్వానికి ముందు కూడా చీప్‌ లిక్కర్లు అమ్మేవారు. కానీ ఎన్నడూ జే బ్రాండ్ల తరహాలో ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపలేదు. కానీ గత ప్రభుత్వంలో తయారు చేసిన నాసిరకం జే బ్రాండ్లు తాగి ఎందరో చనిపోయారు.

During Jagan Regime: మలినాలతో మందు

  • నాడు జగన్‌ ప్రభుత్వంలో నిర్వాకం

  • శుద్ధిచేయని స్పిరిట్‌తోనే జేబ్రాండ్లు

  • కాసుల కక్కుర్తితో హడావుడిగా ఉత్పత్తి

  • 68శాతం ఓవర్‌ ప్రూఫ్‌ లేకుండానే తయారీ

  • 24 గంటలు నిల్వ కూడా చేయలేదు

  • డైమితోక్సినా మిక్‌ యాసిడ్‌, పైరోగలాల్‌,వొల్కెనిన్‌ లాంటి ప్రమాదకర రసాయనాలు

  • ఫార్మా స్పిరిట్‌తోనూ చీప్‌ లిక్కర్‌ తయారీ!

  • ఆయింట్‌మెంట్‌, టించర్‌లో వాడే రసాయనాలూ కలిసినట్టు అనుమానాలు

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

గత జగన్‌ ప్రభుత్వానికి ముందు కూడా చీప్‌ లిక్కర్లు అమ్మేవారు. కానీ ఎన్నడూ జే బ్రాండ్ల తరహాలో ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపలేదు. కానీ గత ప్రభుత్వంలో తయారు చేసిన నాసిరకం జే బ్రాండ్లు తాగి ఎందరో చనిపోయారు. చాలామంది తీవ్ర అనారోగ్యం బారినపడి మంచాలకు పరిమితమయ్యారు. కాసులకు కక్కుర్తిపడి ప్రమాణాలు పాటించకుండా, తక్కువ ఖర్చుతో ఎక్కువ మద్యం లక్ష్యంగా తయారుచేయడమే ఇందుకు కారణం. నిపుణులు, అధికారవర్గాల సమాచారం మేరకు జగన్‌ ప్రభుత్వంలో మద్యం తయారీలో నిబంధనలు పాటించలేదు. జే బ్రాండ్లలో కంటికి కనిపించని లెక్కలేనన్ని ప్రమాదకర రసాయనాలు కలిశాయి. ఆ బ్రాండ్ల మద్యాన్ని నిర్దేశిత స్థాయిలో శుద్ధి చేయకుండానే హడావిడిగా ప్రజల్లోకి వదిలేశారు. ‘శుద్ధి చేస్తే ఖర్చు పెరుగుతుంది, సమయం వృథా అవుతుంది’ అనే కోణంలో ఆలోచించిన అప్పటి మద్యం కంపెనీలు నిబంధనలు తుంగలో తొక్కి మద్యాన్ని తయారు చేశాయి. మన రాష్ట్రంలో ఎక్కువ మంది తాగే మద్యాన్ని గ్రెయిన్‌(నూకలు, మొక్కజొన్న)తో తయారు చేస్తారు. గ్రెయిన్‌ను పిండి చేసి ఆ తర్వాత ద్రవ పదార్థంగా మార్చి ఫర్మంటేషన్‌ (పులిసేలా చేయడం) ప్రక్రియ ప్రారంభిస్తారు. ఆ తర్వాత అందులో ఒక రకమైన బ్యాక్టీరియా ఈస్ట్‌ను కలుపుతారు. దాని నుంచి క్రమంగా రెక్టిఫైడ్‌ స్పిరిట్‌ వస్తుంది. ఆ స్పిరిట్‌ను ఎక్స్‌ట్రా న్యూట్రల్‌ ఆల్కహాల్‌(ఈఎన్‌ఏ)గా మార్చడం మరో ప్రక్రియ. మొదట తయారు చేసిన స్పిరిట్‌ కూడా ఆల్కహాలే అయినా అందులో చాలా మలినాలు మిగిలిపోయి ఉంటాయి.


అందుకే మద్యం తయారు చేయడం కోసం దానిని ఇంకా శుద్ధిచేసి 68 శాతం ఓవర్‌ ప్రూఫ్‌ వరకూ తీసుకొస్తారు. అప్పటినుంచి దానిని 24 గంటల పాటు నిల్వ చేయాలి. ఆ తర్వాత ఆ ఈఎన్‌ఏను లేబొరేటరీలకు పంపి, నిర్దేశిత స్థాయిలో శుద్ధి చేసినట్లు నిర్ధారిస్తే మద్యం ఉత్పత్తి ప్రారంభించాలి. కానీ వైసీపీ ప్రభుత్వంలో అనేక బ్రాండ్లు ఈ నిబంధనలను పాటించలేదు.ఎప్పటి నుంచో మార్కెట్‌లో ఉన్న బ్రాండ్లు ప్రమాణాలు సక్రమంగానే పాటించాయి. కానీ కొత్తగా వచ్చిన జే బ్రాండ్లు ఈ నిబంధనలను గాలికొదిలేశాయి. నిబంధనల ప్రకారం శుద్ధి చేస్తే ఖర్చు పెరుగుతుంది. ఉదాహరణకు ఒక లీటరు ఈఎన్‌ఏతో 12 క్వార్టర్‌ సీసాలు తయారు చేయొచ్చు. అదే ఈఎన్‌ఏ స్థాయి వరకూ శుద్ధి చేయకుండా రెక్టిఫైడ్‌ స్పిరిట్‌తోనే మద్యం ఉత్పత్తి చేస్తే 15 బాటిళ్లకు పైగా తయారవుతుంది. కానీ అలా శుద్ధి చేయకుండా తయారు చేస్తే అది తాగినవారిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఎవరెలా పోతే తమకేంటి అనుకున్న మద్యం కంపెనీలు అలా ప్యూరిఫికేషన్‌ను గాలి కొదిలేసి స్పిరిట్‌తోనే మద్యం తయారు చేశాయి. అలాగే ఈఎన్‌ఏ 24 గంటలు నిల్వ ఉంచాలనే నిబంధనను కూడా పాటించలేదు. వీలైనంత ఎక్కువ మద్యాన్ని తయారు చేసి అమ్మడం ద్వారా ఎక్కువ లాభాలు పొందాలనే అత్యాశతో ఈఎన్‌ఏను ఒక్క రోజు కూడా నిల్వ ఉంచకుండా మద్యం తయారు చేసి మార్కెట్‌లోకి వదిలారు.

జే బ్రాండ్లను అప్పట్లో చెన్నైలోని ఎస్‌జీఎస్‌ ల్యాబ్‌లో పరిశీలించగా అనేక ప్రమాదకర రసాయనాలు వాటిలో ఉన్నట్లు గుర్తించారు. బెంజోక్వినోన్‌, స్కోపారోన్‌, డైమితోక్సినా మిక్‌ యాసిడ్‌, పైరోగలాల్‌, వొల్కెనిన్‌, కాప్రొనల్యాక్టమ్‌ లాంటి రసాయనాలున్నాయని తేలింది. వాటివల్ల శ్వాసక్రియ పెరగడం, నాడీ వ్యవస్థ పనితీరు అకస్మాత్తుగా వేగవంతం కావడం, తల తిరగడం, కడుపు నొప్పి, తలనొప్పి, వాంతులు, అతిసారం, మానసిక గందరగోళం, బీపీ పడిపోవడం, చర్మంపై దురద లాంటి అనారోగ్య సమస్యలు వస్తాయని ల్యాబ్‌ వెల్లడించింది.


ఎక్కువ మోతాదులో విష రసాయనాలు

మద్యం స్కాంలో కమీషన్లు తీసుకోవడం ఒకెత్తు అయితే, ప్రజల ప్రాణాలను ఫణంగా పెట్టి మరీ వ్యాపారం చేయడం ఇంకా దిగ్ర్భాంతిని కలిగిస్తోంది. మెడిసిన్‌ ఉత్పత్తిచేసేందుకు ఫార్మా కంపెనీలు ఉపయోగించే రెక్టిఫైడ్‌ స్పిరిట్‌నూ (ఇథైల్‌ ఆల్కహాల్‌) మద్యం తయారీకి వాడినట్లు తెలుస్తోంది. ఇది అనేక రకాలుగా ఉంటుంది. కొన్ని రకాల మందులు తయారుచేసేందుకు వంద శాతం స్ర్టెంథ్‌ ఉండే స్పిరిట్‌ వినియోగిస్తారు. దీనిని ఫార్మా పరిశ్రమలు విదేశాల నుంచి కూడా దిగుమతి చేసుకుంటున్నాయి. కొన్ని రకాల మందుల కోసం మద్యం తయారీకి వినియోగించే ఎక్స్‌ట్రా న్యూట్రల్‌ ఆల్కాహాల్‌(ఈఎన్‌ఏ)ను వాడతారు. మరికొన్ని చోట్ల మద్యం తయారీ స్థాయి వరకూ శుద్ధి చేయని స్పిరిట్‌(ఇంప్యూరిటీ స్పిరిట్‌)ను మెడిసిన్‌ తయారీ ప్రక్రియలో వాడతారు. ఫార్మా కంపెనీలకు కూడా డిస్టిలరీల్లో ఈఎన్‌ఏ తయారుచేసే ప్రైమరీ యూనిట్లే స్పిరిట్‌ను సరఫరా చేస్తాయి. ఇందులో ప్యూరిటీ స్థాయి చాలా తక్కువగా ఉంటుంది. నిర్దేశిత ప్రమాణాలతో ఉన్న ఈఎన్‌ఏతో పోలిస్తే ఈ ఇంప్యూరిటీ స్పిరిట్‌ తక్కువ రేటుకు దొరకడంతో దానితోనే మద్యం తయారుచేసినట్లు సమాచారం. సాధారణంగా మద్యంలో శరీరంపై ప్రతికూల ప్రభావం చూపే రసాయనాలుంటాయి. అందుకే మందు తాగడం ప్రమాదకరం అని మద్యం సీసాలపైనే ఉంటుంది. అయితే ఒకస్థాయి వరకూ అలాంటి ప్రతికూల ప్రభావం చూపే రసాయనాలు ఉంటే కొంతవరకు ఫరవాలేదు. అయితే జే బ్రాండ్లలో పరిమితికి మించి ఉండటంతో స్లో పాయిజన్‌గా మారి ప్రమాదాన్ని పెంచింది. ఆయింట్‌మెంట్‌, టించర్‌లో వాడే రసాయనాలు కూడా మద్యంలో కనిపించాయని మరొక వాదన వినిపిస్తోంది.


తాగినా ఎక్కనిది అందుకే....

నాసిరకం స్పిరిట్‌తో మద్యం తయారుచేయడం ద్వారా ప్రజల ప్రాణాలతో ఆడుకుంటే... నీళ్ల తరహా మద్యం అమ్మి మరొక రూపంలో దోపిడీ చేశారు. ఎక్సైజ్‌ నిబంధనల ప్రకారం నాలుగు లీటర్ల ఈఎన్‌ఏతో ఒక కేసు మద్యం ఉత్పత్తి చేయాలి. కానీ జే బ్రాండ్లలో కొన్ని ఆ నిబంధనలు పాటించకుండా రెండున్నర, మూడు లీటర్ల ఈఎన్‌తోనే కేసు మద్యం తయారుచేశారు. అలాంటి మద్యం ఎంత తాగినా మత్తు ఎక్కదు. దీంతో ఒక సీసా తాగేవారు రెండు సీసాలు కొనుక్కుని తాగాల్సి వచ్చింది. దీనివల్ల అనారోగ్య సమస్యలు లేకపోయినా ప్రజల జేబుకు చిల్లు పెట్టారు. వైసీపీ హయాంలో ఈఎన్‌ఏ లీటరు రూ.50గా ఉంది. ఒక కేసు మద్యం తయారీకి నాలుగు లీటర్లు అంటే రూ.200 వెచ్చించాలి. కానీ అంత వెచ్చించకుండా తక్కువ ఈఎన్‌ఏతోనే మద్యం తయారుచేసి మార్కెట్‌లోకి వదిలారు.


3, 4 నెలల్లోనే దుష్పరిణామాలు

ఈ మధ్యకాలంలో మద్యం కారణంగా అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. ఎక్కువ మంది కాలేయం సమస్యలతో ఆస్పత్రులకు వస్తున్నారు. మద్యంలో ఆల్కాహాల్‌ శాతం నిర్దేశిత స్థాయిలో లేకపోతేనే ఈ సమస్యలు వస్తాయి. ఇలాంటి మద్యాన్ని తాగితే మూడు నాలుగు నెలల్లో కాలేయం, కిడ్నీ, నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రతికూలత ఏర్పడుతుంది. శరీరంలో కాలేయం చాలా కీలకం. ఇది దెబ్బతింటే విటమిన్స్‌, మినరల్స్‌, ఐరన్‌, రక్తంలో ప్లేట్‌లెట్ల పునరుత్పత్తి తగ్గిపోతుంది. ఇది కొన్నిసార్లు ప్రాణాపాయ స్థితికి దారితీస్తుంది. కాలేయాన్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకొస్తేనే వారి ఆరోగ్యం బాగుపడుతుంది.

- డాక్టర్‌ వాసుదేవ్‌, జనరల్‌ మెడిసిన్‌,

అసోసియేట్‌ ప్రొఫెసర్‌, విమ్స్‌, విశాఖపట్నం


కాలేయం, పాంక్రియాసి్‌సకు ముప్పు

గత రెండు మూడేళ్లుగా యువకులు ఎక్కువగా మద్యం సంబంధిత వ్యాధులతో ఆస్పత్రికి వస్తున్నారు. కాలేయం, పాంక్రియాసిస్‌ అవయవాలు దెబ్బతింటున్నాయి. నాసిరకం మద్యం ఎక్కువ మోతాదులో తాగడం వల్ల ఈ రెండు అవయవాలు ప్రభావితం అవుతున్నాయి. పాంక్రియాసిస్‌ దెబ్బతినడం వల్ల చిన్న వయసులోనే షుగర్‌ వ్యాధిన పడుతున్నారు. ఇలాంటి రోగులతో మాట్లాడినప్పుడు తక్కువ ధరకు దొరికే మద్యం తాగుతున్నట్టు చెబుతున్నారు. గత మూడేళ్లలో కొత్తగా మద్యానికి అలవాటైన వారిలో ఈ తరహా రోగాలు పెరిగాయి.

- డాక్టర్‌ సీహెచ్‌ అభినవ్‌, గ్యాస్ర్టో

ఎంట్రాలజిస్ట్‌, సెంటిని హాస్పిటల్‌, విజయవాడ

Updated Date - Aug 13 , 2025 | 04:16 AM