Excise Department: కన్సల్టెన్సీ కలరింగ్
ABN , Publish Date - Aug 23 , 2025 | 05:37 AM
ఎక్సైజ్ శాఖలో పాలసీలు రూపొందిస్తోంది ఎవరో తెలుసా..? ఇంకెవరు... ఉన్నతాధికారులు లేదంటే ఆ శాఖ సీనియర్ అధికారులే కదా.. అనుకుంటే పొరపడినట్టే..! ఎందుకంటే... ఎర్నెస్ట్ అండ్ యంగ్..
ముగ్గురు ఉద్యోగులకు 3.5 కోట్ల జీతం
ఎక్సైజ్ శాఖలో వారిదే హడావుడి
ప్రతి పాలసీ తామే చేస్తున్నట్టు బిల్డప్
అధ్యయనం చేసేది శాఖ అధికారులు
ఆ తర్వాత పీపీటీలతో కన్సల్టెన్సీ షో..
కీలక సమావేశాలకు అధికారులు దూరం
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
ఎక్సైజ్ శాఖలో పాలసీలు రూపొందిస్తోంది ఎవరో తెలుసా..? ఇంకెవరు... ఉన్నతాధికారులు లేదంటే ఆ శాఖ సీనియర్ అధికారులే కదా.. అనుకుంటే పొరపడినట్టే..! ఎందుకంటే... ఎర్నెస్ట్ అండ్ యంగ్ (ఈవై) అనే కన్సల్టెన్సీనే మొత్తం పాలసీలు రూపొందిస్తోంది! అందుకుగానూ ఆ సంస్థకు ఎక్సైజ్ శాఖ ఏడాదికి రూ.3.5 కోట్లు చెల్లిస్తోంది. అంటే నెలకు అక్షరాలా రూ.29 లక్షలన్నమాట...! అయితే... అంత భారీ మొత్తం తీసుకుంటూ, పెద్ద పాలసీలు రూపొందిస్తున్న ఆ కన్సల్టెన్సీలో పనిచేస్తున్నది ఎంతమంది ఉద్యోగులో తెలుసా..? ముగ్గురంటే ముగ్గురే...! వారి సగటు జీతం నెలకు దాదాపు రూ.10లక్షలు. ఎక్సైజ్ శాఖలోనే కాదు... మొత్తం ప్రభుత్వంలో అయినా అందులో సగం జీతం తీసుకునే ఉన్నతాధికారి ఒక్కరు కూడా లేరు. కేవలం ముగ్గురు ఉద్యోగులతో ఉచిత సలహాలిస్తూ... మొత్తం తామే చేస్తున్నట్లుగా ఆ కన్సల్టెన్సీ బిల్డప్ ఇస్తోంది..! దానికి ఉన్నతాధికారులు సంపూర్ణ సహకారం అందిస్తున్నారు. చివరికి శాఖలోని సీనియర్ అధికారులను సైతం కీలకమైన షాపులు, బార్ పాలసీలకూ దూరం చేస్తున్నారు. ఫలితంగా ఇప్పుడు బార్ పాలసీపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. గతంలో ఎప్పుడూలేనట్టుగా... పట్టుమని నలుగురు ఉద్యోగులు కూడా లేని కంపెనీకి బాధ్యతలు అప్పగించడంపై విమర్శలు వస్తున్నాయి. ఇతర రాష్ర్టాల్లో అధ్యయనానికి శాఖ అధికారులను పంపి, ఆ సమాచారాన్ని కన్సల్టెన్సీ ద్వారా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ (పీపీటీ)లు రూపొందించి షో చేయడం చూసి ఆ శాఖ అధికారులే విస్మయానికి గురవుతున్నారు.
ఆయన బలహీనతే వీరి బలం
ముఖ్యమంత్రి చంద్రబాబుకు పీపీటీలు అంటే చాలా ఇష్టం. మాటల్లో చెప్పేదాని కంటే స్ర్కీన్‌పై ప్రజెంటేషన్ వేసి చూపిస్తే ఆయన ఎక్కువ ఆసక్తి చూపుతారు. ఈ బలహీనతనే కొందరు అధికారులు తమ బలంగా మార్చుకున్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక కన్సల్టెన్సీని తీసుకొచ్చారు. గతంలోనూ పాలసీల రూపకల్పన సమయంలో ఎక్సైజ్ శాఖ కన్సల్టెన్సీలను ఉపయోగించుకునేది. అయితే కేవలం తాత్కాలికంగా కొన్ని బాధ్యతలు మాత్రమే అప్పగించేది. కానీ ఇప్పుడు ఈవై సంస్థకు కమిషనరేట్‌లోనే స్థానం కల్పించారు. ఎక్సైజ్‌పై ఎలాంటి పట్టులేని ఆ సంస్థకు చెందిన ఓ ఉద్యోగి... శాఖ సీనియర్ అధికారులకే సలహాలిస్తున్నారు. సీఎంవోకు వెళ్లి ప్రైవేటు మద్యం షాపుల పాలసీ మొత్తం తానే తయారు చేశానని కలరింగ్ ఇచ్చారు.
బార్ పాలసీపై వ్యతిరేకత
సెప్టెంబరు నుంచి కొత్త బార్ పాలసీ అమల్లోకి రానుంది. దీనిపై బుధవారం ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఇటీవల బార్ పాలసీపై సీఎం వద్ద జరిగిన సమీక్షలోనూ ఈవై కన్సల్టెన్సీ రూపొందించిన పీపీటీనే ప్రదర్శించారు. దాని ఆధారంగా పలు నిర్ణయాలు తీసుకున్నారు. ప్రతి బార్‌కు నాలుగు దరఖాస్తులు కచ్చితంగా రావాలనే నిబంధన పెట్టారు. దీంతో మద్యం వ్యాపారులు సమావేశాలు పెట్టుకుని ఎవరూ దరఖాస్తులు సమర్పించవద్దని నిర్ణయం తీసుకునే పరిస్థితి వచ్చింది. ఇతరత్రా కారణాలతో ఈసారి బార్ పాలసీ విఫలమవ్వొచ్చనే వాదన వినిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం... అసలు బార్ పాలసీ రూపకల్పనలో ఆ శాఖ అధికారులను భాగస్వామ్యం చేయకపోవడమే.
షాపుల పాలసీలో 200 కోట్లు నష్టం
శాఖలో అనుభవం ఉన్న అధికారుల అభిప్రాయాలను వదిలేసి, కన్సల్టెన్సీని నమ్ముకున్న ఫలితంగా ప్రైవేటు షాపుల పాలసీలో దాదాపు రూ.200 కోట్ల ఆదాయ నష్టం వచ్చింది. మద్యం షాపుల పక్కనే గతంలో పర్మిట్ రూమ్‌లు ఉండేవి. వైసీపీ ప్రభుత్వం వాటిని తొలగించింది. అయితే ప్రైవేటు షాపుల పాలసీలో అవి ఉండాలని శాఖ అధికారులు అభిప్రాయపడ్డారు. వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా పర్మిట్ రూమ్‌లకు అనుమతి నిరాకరించారు. దీంతో ఆ రూమ్‌ల ద్వారా వచ్చే ఫీజులు రూ.200 కోట్లు రాలేదు. తీరా ఏడాది తర్వాత పర్మిట్ రూమ్‌లు ఉండటం చాలా అవసరం అంటూ వాటి అనుమతికి ఎక్సైజ్ శాఖ ఇటీవల ఉత్తర్వులిచ్చింది. ఇదే విషయాన్ని గతేడాది శాఖ అధికారులు చెప్పినా ఉన్నతాధికారులు పెడచెవిన పెట్టడంతో నష్టం మిగిలింది.