Share News

Demise Conspiracy: కోటంరెడ్డిని లేపేస్తే డబ్బేడబ్బు

ABN , Publish Date - Aug 30 , 2025 | 04:21 AM

నెల్లూరు రూరల్‌ నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి హత్యకు రౌడీ షీటర్లు కుట్ర పన్నారా?. ఆయనను హతమార్చే విషయంపై చర్చించుకున్నారా?. అంటే.. తాజాగా ఎమ్మెల్యేను ఉద్దేశించి రౌడీషీటర్లు...

Demise Conspiracy: కోటంరెడ్డిని లేపేస్తే డబ్బేడబ్బు

  • నెల్లూరు రూరల్‌ టీడీపీ ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి హత్యకు రౌడీషీటర్ల కుట్ర?

  • సంభాషణల వీడియా వెలుగులోకి

  • వీడియాలో కనిపించిన రౌడీషీటర్‌ శ్రీకాంత్‌ అనుచరుడు జగదీశ్‌

నెల్లూరు, ఆగస్టు 29(ఆంధ్రజ్యోతి): నెల్లూరు రూరల్‌ నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి హత్యకు రౌడీ షీటర్లు కుట్ర పన్నారా?. ఆయనను హతమార్చే విషయంపై చర్చించుకున్నారా?. అంటే.. తాజాగా ఎమ్మెల్యేను ఉద్దేశించి రౌడీషీటర్లు మాట్లాడుకున్న వీడియో వెలుగులోకి రావడంతో ఔననే సమాధానమే వినిపిస్తోంది. ‘‘రూరల్‌ ఎమ్మెల్యేను లేపేస్తే డబ్బే డబ్బు..’’ అంటూ ఓ రౌడీషీటర్‌ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. గత నెలలో నెల్లూరులోని ఓ హోటల్‌లో రౌడీషీటర్లు మద్యం తాగుతూ మాట్లాడుకుంటున్న వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ వీడియోలో రౌడీషీటర్‌ అవిలేలి శ్రీకాంత్‌ ప్రధాన అనుచరుడైన మరో రౌడీషీటర్‌ జగదీశ్‌ ఉండటం మరింత చర్చనీయాంశంగా మారింది. ఈ వీడియో సారాంశం ప్రకారం.. రౌడీషీటర్‌ జగదీశ్‌తోపాటు పలు కేసుల్లో నిందితులుగా ఉన్న జకీర్‌, మహేశ్‌, వినీత్‌, రాజశేఖర్‌రెడ్డిలు ఓ హోటల్‌ రూంలో మద్యం తాగుతూ మాట్లాడుకుంటున్నారు. మహేశ్‌ అనే వ్యక్తి.. ‘‘డబ్బు పెద్ద సమస్యా..?’’ అని మాట్లాడగా, వెంటనే పక్కనే ఉన్న మరో వ్యక్తి.. ‘‘రూరల్‌ ఎమ్మెల్యేను లేపేస్తే డబ్బే డబ్బు..’’ అంటూ వ్యాఖ్యానించాడు. వెంటనే మహేశ్‌.. ‘చంపేస్తార్రా..’ అని సమాధానమిచ్చాడు. 30 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియో రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. ఎమ్మెల్యే కోటంరెడ్డి హత్యకు రౌడీషీటర్లు కుట్ర పన్నారన్న ప్రచారం జరుగుతోంది. ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.


ఈ వీడియో ముందుగా పోలీసుల దృష్టికి రాగా.. వెంటనే స్పందించిన అధికారులు విచారణ చేపట్టారు. ఎస్పీ కృష్ణకాంత్‌ ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ.. రౌడీషీటర్లు మాట్లాడుకుంటున్న వీడియో రెండు రోజుల క్రితమే తమ దృష్టికి వచ్చిందని, దానిపై లోతుగా విచారిస్తున్నట్లు చెప్పారు. కాగా, వీడియో బయటకు రావడంతో ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి శుక్రవారం సన్నిహితులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. తన ప్రాణానికి సంబంధించిన వ్యవహారం పోలీసుల దృష్టికి వచ్చినా..అధికారులు తనకు సమాచారం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. నిరసనగా గన్‌మెన్లను ఎస్పీకి సరెండర్‌ చేస్తానన్నట్టు సమాచారం.

కూపీ లాగుతున్న పోలీసులు

కోటంరెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేసిన రౌడీషీటర్ల వ్యవహారాన్ని పోలీసులు సీరియ్‌సగా తీసుకున్నారు. వీడియాలో ఉన్న రౌడీషీటర్‌ జగదీశ్‌ ఇప్పటికే జైల్లో ఉండగా, మిగిలిన వారిని బాలాజీనగర్‌ పోలీసులు అదుపులోకి తీసుకుని లోతుగా విచారిస్తున్నారు.

Updated Date - Aug 30 , 2025 | 04:25 AM