Dearness Allowance Conspiracy: డీఏపై కుట్రలు
ABN , Publish Date - Oct 12 , 2025 | 04:18 AM
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో వైసీపీ విష రాజకీయాలకు తెరదీసింది. కొన్నాళ్లుగా కరువు భత్యం(డీఏ) కోసం ఎదురు చూస్తున్న వారిని రెచ్చగొట్టే చర్యలకు దిగుతోంది.
కరువు భత్యంపై సోషల్ మీడియాలో జగన్ బ్యాచ్ తప్పుడు ప్రచారాలు
ఉద్యోగ సంఘాల ముసుగులో వేతన జీవుల ఉద్వేగంతో ఆట
ప్రతి క్యాబినెట్ భేటీ ముందు ‘డీఏ’ ఇస్తున్నారని పోస్టులు
సమావేశం తర్వాత విమర్శలు
ఉద్యోగులకు, సర్కారుకు మధ్య అగాథం సృష్టించడమే లక్ష్యం
ఉద్యోగులను రెచ్చగొట్టడమే టార్గెట్
గత ప్రభుత్వ డీఏ బకాయి 7,500 కోట్లు చెల్లించిన కూటమి
చేసింది చెప్పుకోని కూటమి నేతలు
కరువు భత్యం(డీఏ)పై వైసీపీ కుట్ర రాజకీయాలు చేస్తోంది. ప్రభుత్వానికి-ఉద్యోగులకు మధ్య అగాథం సృష్టించడమే లక్ష్యంగా కొన్ని ఉద్యోగ సంఘాల నేతల ముసుగులో సోషల్ మీడియాలో విషం చిమ్ముతోంది. ప్రతి మంత్రివర్గ సమావేశానికి ముందు ‘డీఏ’ ఇచ్చేస్తారని హడావుడి చేసి ఆశలు రేకెత్తిస్తోంది. భేటీ అనంతరం సర్కారు ఉసూరుమనిపించింది.. ఉద్యోగులను పట్టించుకోలేదంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం పరిపాటిగా మారింది. ఈ కుటిల పోస్టుల వెనుక ఉద్యోగులకు-ప్రభుత్వానికి మధ్య చిచ్చు పెట్టి రచ్చ చేయాలన్న వ్యూహం స్పష్టంగా కనిపిస్తోంది.
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో వైసీపీ విష రాజకీయాలకు తెరదీసింది. కొన్నాళ్లుగా కరువు భత్యం(డీఏ) కోసం ఎదురు చూస్తున్న వారిని రెచ్చగొట్టే చర్యలకు దిగుతోంది. వాస్తవానికి వైసీపీ పాలనలో నానా తిప్పలు పడిన ఉద్యోగులు.. గత ఎన్నికల్లో తమకు అనుకూలమైన ప్రభుత్వం వచ్చిందని, సకాలంలో అన్ని ప్రయోజనాలు నెరవేరుతాయన్న ఉద్దేశంతో ఉన్నారు. అయితే.. వీరిని ఏదో ఒకరకంగా రెచ్చగొట్టి సర్కారుకు-ఉద్యోగులకు మధ్య అగాథం సృష్టించేందుకు వైసీపీ కుటిల ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం డీఏపై ఉద్యోగుల్లో చర్చ జరుగుతోంది. కొత్త ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు అయినా డీఏ ఇవ్వలేదన్న ఆవేదన వారిలో ఉంది. ఇదే అదునుగా ఉద్యోగ సంఘ నాయకుల ముసుగులో జగన్ బ్యాచ్ డీఏలపై కుట్రకు తెరతీసింది. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు మొదలుపెట్టి ఉద్యోగుల ఉద్వేగాలతో ఆడుకుంటోంది. సీఎం చంద్రబాబు నేతృత్వంలోని మంత్రివర్గం నెలకు రెండుసార్లు భేటీ అవుతోంది.
అయితే, ప్రతి క్యాబినెట్ సమావేశం ముందు ఉద్యోగుల వాట్సాప్ గ్రూపులు, సోషల్ మీడియాలో డీఏ ఇస్తున్నారంటూ తప్పుడు పోస్టులు పెడుతున్నారు. దాన్ని చిలవలుపలవలుగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. క్యాబినెట్ సమావేశం అవగానే ‘ఈ సమావేశంలోనూ డీఏ ఇవ్వలేదు.’ అంటూ ఉద్యోగులను రెచ్చగొట్టి.. చిచ్చు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు.. ఉద్యోగులకు న్యాయం చేస్తామని సీఎం చంద్రబాబు చెబుతూనే ఉన్నారు. అయినా వైసీపీ బ్యాచ్ తన కుట్ర రాజకీయాలను కొనసాగిస్తూనే ఉంది.
ఉద్యోగుల పొట్టగొట్టిన వైసీపీ
గత వైసీపీ ప్రభుత్వం రూ.25 వేల కోట్లను ఉద్యోగులకు చెల్లించకుండా బకాయిలు పెట్టిపోయింది. కనీసం ఉద్యోగులకు, పెన్షనర్లకు జీతాలు, పెన్షన్లు సకాలంలో చెల్లించలేదు. డీఏలను సకాలంలో చెల్లించకుండా కొన్ని డీఏలను పీఆర్సీలో కలిపేసింది. అంతేకాదు, గత ఎన్నికలకు ముందు హడావుడిగా పోస్ట్ డేటెడ్ చెక్కుల మాదిరిగా 2 జీవోలను విడుదల చేసింది. 1-1-2023కు సంబంధించిన డీఏను 2024, మే నెల జీతంలో ఇచ్చేలా, ఇంకో జీవో 1-7-2023 జూలైలో చెల్లించాల్సిన డీఏను ఆగస్టు, 2024 నుంచి చెల్లించేలా జీవోలు జారీ చేసి, అమలు చేయకుండా చేతులు దులుపుకొంది. అయితే.. ఈ జీవోలను కూటమి ప్రభుత్వం అమలు చేసింది. అంటే కూటమి ప్రభుత్వమే ఆ రెండు డీఏలను ఉద్యోగులకు చెల్లించింది. దీని వల్ల 300 కోట్లభారం పడింది. సీపీఎస్ ఉద్యోగులకు 7 నెలల మ్యాచింగ్ గ్రాంట్ రూ.1,600 కోట్లను జగన్ ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టింది. వీటితోపాటు ఉద్యోగులకు రూ.వేల కోట్లు బకాయి పెట్టి, రివర్స్ పీఆర్సీ ఇచ్చింది. ఎవరైనా నొరెత్తితే వారిపై కేసులు పెట్టి భయబ్రాంతులకు గురి చేసింది. జీతాలు, పెన్షన్లు ఎప్పుడు వస్తాయో కూడా తెలియని దుస్థితిలోకి ఉద్యోగులను నెట్టింది.
చేసింది.. చెప్పుకొనుంటే..
గత వైసీపీ ప్రభుత్వం ఉద్యోగులకు పెట్టిన రూ.వేల కోట్ల బకాయిలను చెల్లించినా.. చేసింది చెప్పుకోవడంలో కూటమి ప్రజా ప్రతినిధులు విఫలమవుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఉద్యోగులను డీఏల పేరుతో జగన్ బ్యాచ్ రెచ్చగొడుతుంటే.. కనీసం కింది స్థాయిలో ఉద్యోగులకైనా రాష్ట్ర పరిస్థితిని వివరిస్తూ చెల్లించిన బకాయిలను చెపాల్సిన నేతలు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. గత జగన్ ప్రభుత్వం చేయనివాటిని సైతం చేసినట్టు ఊదరగొడితే.. ప్రస్తుత నేతలు చేసినవి కూడా చెప్పుకోవడం లేదు. కూటమి ప్రభుత్వం ఉద్యోగ పక్షపాతి అని సీఎం చంద్రబాబు చెబుతున్నా.. ఆ భరోసాను కింది స్థాయి వరకు తీసుకెళ్లేలా అధికార పార్టీల నేతలు చేయకపోవడం గమనార్హం. దీంతో వైసీపీ విష ప్రచారంతో ఉద్యోగులు ప్రస్తుత ప్రభుత్వంపై ఆగ్రహం వెళ్లగక్కుతున్నారు.
రెండు డీఏలు, ఒక పీఆర్సీ!
ఉద్యోగులు 2 డీఏలు, ఒక పీఆర్సీ కోసం వేచి చూస్తున్నారన్నది వాస్తవం. అలాగని వారేమీ రెచ్చిపోవడం లేదు. గత జగన్ పాలనతో విధ్వంసమైన ఆర్థిక వ్యవస్థను సీఎం చంద్రబాబు గాడిలో పెడుతున్నారని, త్వరలోనే తమ ఆశలు నెరవేరుతాయని వేచి చూస్తున్నారు. కానీ.. వారి ఆశలను తమ రాజకీయ అస్త్రంగా మలుచుకున్న వైసీపీ నేతలు తెరవెనుక ఉండి.. ఉద్యోగ సంఘాలతో సర్కారుపై తప్పుడు ప్రచారం చేయిస్తున్నారు. వాస్తవానికి గత ప్రభుత్వం ఇచ్చిన రివర్స్ పీఆర్సీ, డీఏలు పీఆర్సీలో కలిపేయడం, కొన్ని డీఏలకు జీవోలు ఇచ్చి నగదు చెల్లించకుండా పోవడం వంటి చర్యలపై ఉద్యోగుల్లో ఆవేదన, ఆగ్రహం ఇప్పటికీ ఉంది. అందుకే, వైసీపీ నేతలు నేరుగా జోక్యం చేసుకోకుండా తమ అనుకూల సంఘాల నేతలతో రెచ్చగొట్టే రాజకీయాలకు తెరదీస్తున్నారు.
ఇలా ఇచ్చారు!
కూటమి ప్రభుత్వం రాగానే ఉద్యోగుల సమస్యలపై దృష్టి సారించింది.
ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రతి నెలా 1, లేదా 2 తేదీల్లోనే జీతాలు, పెన్షన్లు ఇస్తోంది.
గత ప్రభుత్వం బకాయి పెట్టిన సుమారు రూ.7,500 కోట్లను చెల్లించింది.
ఈ గత ఏడాది జనవరి 11న ఉద్యోగులకు వివిధ బకాయిల కింద రూ.1,033 కోట్లను జమ చేసింది.
సీపీఎస్, జీపీఎఫ్, ఏపీజీఎల్‌ఐ తదితర చెల్లింపులకు మరో రూ.6,200 కోట్లు వెచ్చించింది.
ఇటీవల సచివాలయ సీపీఎస్ ఉద్యోగుల బకాయిలను కూడా ఇచ్చేసింది.