Visakhapatnam: కనెక్టింగ్ సిఫీ
ABN , Publish Date - Oct 11 , 2025 | 05:51 AM
ఆసియాలోనే అతి పెద్ద డేటా కేంద్రంగా అవతరిస్తున్న విశాఖపట్నం.. అమెరికాతో అనుసంధానం కాబోతోంది. అమిత వేగంతో డేటా బదిలీ చేయడానికి అవసరమైన సముద్రగర్భ...
అమెరికా నుంచి విశాఖకు డేటా కేబుళ్లు
గూగుల్, మెటా సంస్థలతో భాగస్వామ్యం
సిఫీకి రేపు లోకేశ్ చేతుల మీదుగా భూమి పూజ
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
ఆసియాలోనే అతి పెద్ద డేటా కేంద్రంగా అవతరిస్తున్న విశాఖపట్నం.. అమెరికాతో అనుసంధానం కాబోతోంది. అమిత వేగంతో డేటా బదిలీ చేయడానికి అవసరమైన సముద్రగర్భ (సబ్‌మెరైన్) కేబుల్ పనులు ఊపందుకుంటున్నాయి. ఇక్కడ ఏర్పాటవుతున్న డేటా సెంటర్లతో ఆ కేబుళ్లను అనుసంధానించడానికి సిఫీ టెక్నాలజీస్ సిద్ధమైంది. గూగుల్ సంస్థ బ్లూరామన్ పేరుతో సబ్‌మెరైన్ కేబుళ్లను విశాఖపట్నం తీసుకువస్తోంది. వీటిని డేటా సెంటర్‌తో అనుసంధానం చేయడానికి సిఫీ ఒప్పందం చేసుకుంది. అదేవిధంగా మెటా సంస్థ కూడా అమెరికా నుంచి బ్రెజిల్, భారత్, దక్షిణాఫ్రికా తదితర దేశాలకు 50 వేల కి.మీ. పొడవున సబ్‌మెరైన్ కేబుల్ వేయడానికి ఒప్పందాలు చేసుకుంది. భారత్‌లో ముంబై, విశాఖ నగరాలను ల్యాండింగ్ సెంటర్లుగా ఎంపిక చేసింది. మెటా సంస్థ విశాఖకు తీసుకువచ్చే సబ్‌మెరైన్ కేబుల్‌ను డేటా సెంటర్లకు అనుసంధానం చేసే బాధ్యతను కూడా సిఫీనే తీసుకుంది. విశాఖలో అతి పెద్ద డేటా సెంటర్లను కేబుల్‌తో అనుసంధానం చేసే సిఫీ టెక్నాలజీస్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖకు సమీపాన ఓజోన్ వ్యాలీలో 25 ఎకరాలు కేటాయించింది. అందులో ఆదివారం భూమి పూజ చేయడానికి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి లోకేశ్ విశాఖకు వస్తున్నారు.
ఆ మూడూ అత్యంత ప్రధానం
డేటా సెంటర్ల నిర్వహణలో విద్యుత్, నీరు, కేబుళ్లు కీలకపాత్ర వహిస్తాయి. వీటికి వేల మెగావాట్ల విద్యుత్ అవసరం. విశాఖలో ఏర్పాటయ్యే ఒక్క గూగుల్ డేటా సెంటర్‌కే 2,500 మెగావాట్ల విద్యుత్ అవసరమని అధికారులు అంచనాకు వచ్చారు. దీనికి తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. అదేవిధంగా డేటా సెంటర్ల కూలింగ్‌కు మిలియన్ గ్యాలన్ల నీరు కావాలి. అవసరమైన నీటిని పోలవరం ఎడమ కాలువ నుంచి వచ్చే 24 టీఎంసీల నుంచి ఉపయోగించుకోవడానికి ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఇక మూడో ముఖ్యమైన అంశమైన సముద్రగర్భ (అండర్ సీ) కేబుల్‌ను అమెరికా నుంచి వేసుకుంటూ రావడానికి అడుగులు పడ్డాయి.
డేటా సెంటర్ల సిటీగా విశాఖ
విశాఖలో డేటాసెంటర్లు ఏర్పాటుకు దిగ్గజ సంస్థలు ముందుకొస్తున్నాయి. వాటికి భూములను రాష్ట్రప్రభుత్వం సమకూర్చుతోంది. డేటా సెంటర్ ఏర్పాటుకు విశాఖలో గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్‌కు ప్రభుత్వం భూమి కేటాయించింది. విశాఖలో అదానీ డేటాసెంటర్ ఏర్పాటుకు గతంలోనే అనుమతులు లభించాయి. కాగా, పెద్ద మొత్తంలో ఉన్న సమాచారాన్ని క్షణాల్లో తెలుసుకోవడానికి డేటా సెంటర్లకు ఏఐని అనుసంధానం చేస్తారు. ఒక్క కమాండ్ ఇవ్వగానే డేటాను ఏఐ మైనింగ్ చేసి, దాన్ని విశ్లేషించి అందిస్తుంది. ఇదంతా సూపర్‌ఫాస్ట్ కంప్యూటర్ల ద్వారా క్షణాల్లో జరిగిపోతుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న డేటాను శోధించి, సమాచారం ఇవ్వాలంటే అత్యంత వేగవంతమైన నెట్‌వర్క్ కావాలి. దాని కోసమే సబ్‌మెరైన్ కేబుళ్లను ఏర్పాటు చేస్తున్నారు.