Congress Leaders: ఫిబ్రవరి 2న నరేగా సభకు బండ్లపల్లి రండి
ABN , Publish Date - Dec 28 , 2025 | 04:35 AM
ఆంధ్రప్రదేశ్‌లోని బండ్లపల్లిలో ఫిబ్రవరి 2న నరేగా బహిరంగ సభకు రావాలని కాంగ్రెస్ అగ్రనేతలను కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) సభ్యులు రఘువీరా రెడ్డి, గిడుగు రుద్రరాజు కోరారు.
కాంగ్రెస్ అగ్రనేతలకు రఘువీరా, గిడుగు విజ్ఞప్తి
న్యూఢిల్లీ, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లోని బండ్లపల్లిలో ఫిబ్రవరి 2న నరేగా బహిరంగ సభకు రావాలని కాంగ్రెస్ అగ్రనేతలను కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) సభ్యులు రఘువీరా రెడ్డి, గిడుగు రుద్రరాజు కోరారు. శనివారం ఇందిరా భవన్‌లో జరిగిన సీడబ్ల్యూసీ సమావేశాల్లో పాల్గొని, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకురాలు సోనియా గాంధీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేలను ఆహ్వానించారు. సమావేశం అనంతరం మల్లికార్జున ఖర్గేను రఘువీరా రెడ్డి, గిడుగు రుద్రరాజు ప్రత్యేకంగా కలిశారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి కొంతసేపు ముచ్చటించారు. అనంతరం గిడుగు రుద్రరాజు మీడియాతో మాట్లాడారు. కేంద్రం ఉపాధి హామీ పథకం పేరు, చట్టంలో మార్పులు చేయడం సరికాదన్నారు. 2006 ఫిబ్రవరి 2న బండ్లపల్లిలో ఈ పథకాన్ని ప్రారంభించారని తెలిపారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 2వ తేదీకి 20 సంవత్సరాలు పూర్తవుతుందని, ఈ సందర్భంగా మళ్లీ బండ్లపల్లిలో సభ నిర్వహించే బహిరంగ సభకు రావాలని సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జును ఖర్గేలను ఆహ్వానించామని చెప్పారు.