Agriculture Department: పోస్టింగులపై గందరగోళం..
ABN , Publish Date - Jun 13 , 2025 | 05:00 AM
వ్యవసాయ అనుబంధ శాఖల్లో ఉద్యోగుల బదిలీలు, పోస్టింగులు గందరగోళంగా మారాయి. ఒకే స్థానంలో ఐదేళ్లకు మించి పనిచేస్తున్న వారిని, ఎక్కడైనా రెండేళ్లు పనిచేసిన వారిని, ఆరోగ్య కారణాలతో బదిలీ కోరుకున్న వారిని....
వ్యవసాయ అనుబంధ శాఖల్లో వివాదాస్పదంగా ఉద్యోగుల బదిలీలు
అమరావతి, జూన్ 12(ఆంధ్రజ్యోతి): వ్యవసాయ అనుబంధ శాఖల్లో ఉద్యోగుల బదిలీలు, పోస్టింగులు గందరగోళంగా మారాయి. ఒకే స్థానంలో ఐదేళ్లకు మించి పనిచేస్తున్న వారిని, ఎక్కడైనా రెండేళ్లు పనిచేసిన వారిని, ఆరోగ్య కారణాలతో బదిలీ కోరుకున్న వారిని బదిలీ చేయాలని ప్రభుత్వం మార్గదర్శకాలిస్తే.. కొందరు ఉద్యోగుల విషయంలో ఇందుకు విరుద్ధంగా జరిగింది. సిఫారసులతో బదిలీలు చేసేసిన ఉన్నధికారులు.. కొందరిని అడ్మినిస్ర్టేటివ్ గ్రౌండ్స్ పేరుతో ఇష్టారాజ్యంగా బదిలీలు చేసి, పలువురికి పోస్టింగ్‌లు చూపలేదు. వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల్లో దశాబ్ద కాలంగా ఒకే కార్యాలయంలో పనిచేస్తున్న పలువురు ఉద్యోగులను కదిలించకుండా, జిల్లాల్లో ఐదేళ్లు దాటని ఉద్యోగులను మార్చడం వివాదస్పదమైంది. బదిలీల కౌన్సెలింగ్ జాబితాలో తమ స్థానాలను ఖాళీ పోస్టులుగా చూపకుండానే మరొకరికి పోస్టింగ్‌లు ఇచ్చి, తమకు మాత్రం పోస్టింగ్‌లే ఇవ్వలేదని పలు శాఖల ఉద్యోగులు వాపోతున్నారు. ఓవైపు మంత్రులు, ఎమ్మెల్యేల సిఫారసులతో బదిలీలు, పోస్టింగ్‌లు ఇచ్చిన ఉన్నతాధికారులు.. బదిలీల జీవోకు విరుద్ధంగా వ్యవహరించారన్న విమర్శలు వస్తున్నాయి. వ్యవసాయశాఖలో కొన్ని పోస్టుల విషయంలో అధికార పార్టీ నేతల సిఫారసులను పక్కన పెట్టేసి, ఓ యూనియన్ నేత ఒత్తిళ్లతో పోస్టింగ్‌లు మార్చేసినట్లు తేలింది. మంగళగిరి నియోజకవర్గంలో మంత్రి లోకేశ్‌కు తెలియకుండానే బదిలీలు, పోస్టింగ్‌లు ఇచ్చినట్లు తెలిసింది. దీనిపై మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో మళ్లీ మార్పులు చేసినట్లు సమాచారం. వ్యవసాయ శాఖ డైరెక్టరేట్‌లో ఐదేళ్లు దాటి పనిచేస్తున్న ఉద్యోగిని ఇప్పుడు కూడా మార్చకుండా, అక్కడే కొనసాగించడంతో ఉద్యోగులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పశుసంవర్థక శాఖలో ఐదేళ్లు దాటని తమను మార్చారని ఉత్తరాంధ్రకు చెందిన పశువైద్య దంపతులు.. మంత్రి అచ్చెన్నాయుడు దృష్టికి తీసుకొచ్చారు. మంత్రి జోక్యంతో ఒకరి సమస్యకు పరిష్కారం చూపారు.