‘నకిలీ’ల్లో కలవరం!
ABN , Publish Date - May 07 , 2025 | 01:13 AM
వాణిజ్య పన్నుల శాఖలో నకిలీ ధ్రువీకరణపత్రాల వ్యవహారం కలకలం రేపుతోంది. వివిధ విద్యార్హతలతో ఉద్యోగాలు చేస్తున్న వారు నకిలీ ధ్రువీకరణపత్రాలు సమర్పించి కొలువులు పొందారని కొన్నాళ్లుగా ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా అటెండర్, వాచ్‌మన్ ఉద్యోగాల్లో ఈ వ్యవహారం నడిచినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఈ నకిలీ ధ్రువీకరణపత్రాలతో ఉద్యోగాలు చేస్తున్న వారు ఆ శాఖలోని ఉద్యోగ సంఘాల నాయకుల ద్వారా రాయబారాలు నడుపుకుని ఉద్యోగాల్లో కొనసాగుతున్నారు. వీరిలో కొంతమంది ఇప్పటికే రికార్డు అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతులు పొందినట్టు తెలుస్తోంది. తాజాగా ఒక మహిళా అటెండర్ ఉద్యోగంలో చేరినప్పుడు ఎలాంటి విద్యార్హత లేకపోయినా ఎనిమిదో తరగతి వరకు చదువుకున్నట్టు ధ్రువీకరణపత్రాన్ని అధికారులకు సమర్పించింది. ఈ ధ్రువీకరణపత్రం నకిలీదని తెలియడంతో ఆమెపై అధికారులు వేటు వేశారు. దీనితో నకిలీ ధ్రువీకరణపత్రాలతో కొలువుల్లో కొనసాగుతున్న వారిలో కలవరం మొదలైంది.
వాణిజ్య పన్నుల శాఖలో దొంగ ధ్రువీకరణ పత్రాలతో ఉద్యోగాలు
ఒక మహిళా అటెండర్‌ను గుర్తించిన అధికారులు
ఉద్యోగం నుంచి తొలగింపు.. మరికొంతమంది ఉన్నట్టు ఆరోపణలు
వాణిజ్య పన్నుల శాఖలో నకిలీ ధ్రువీకరణపత్రాల వ్యవహారం కలకలం రేపుతోంది. వివిధ విద్యార్హతలతో ఉద్యోగాలు చేస్తున్న వారు నకిలీ ధ్రువీకరణపత్రాలు సమర్పించి కొలువులు పొందారని కొన్నాళ్లుగా ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా అటెండర్, వాచ్‌మన్ ఉద్యోగాల్లో ఈ వ్యవహారం నడిచినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఈ నకిలీ ధ్రువీకరణపత్రాలతో ఉద్యోగాలు చేస్తున్న వారు ఆ శాఖలోని ఉద్యోగ సంఘాల నాయకుల ద్వారా రాయబారాలు నడుపుకుని ఉద్యోగాల్లో కొనసాగుతున్నారు. వీరిలో కొంతమంది ఇప్పటికే రికార్డు అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతులు పొందినట్టు తెలుస్తోంది. తాజాగా ఒక మహిళా అటెండర్ ఉద్యోగంలో చేరినప్పుడు ఎలాంటి విద్యార్హత లేకపోయినా ఎనిమిదో తరగతి వరకు చదువుకున్నట్టు ధ్రువీకరణపత్రాన్ని అధికారులకు సమర్పించింది. ఈ ధ్రువీకరణపత్రం నకిలీదని తెలియడంతో ఆమెపై అధికారులు వేటు వేశారు. దీనితో నకిలీ ధ్రువీకరణపత్రాలతో కొలువుల్లో కొనసాగుతున్న వారిలో కలవరం మొదలైంది.
(ఆంధ్రజ్యోతి, విజయవాడ)
విజయవాడ కేదారేశ్వరిపేటకు చెందిన జ్యోతి అనే మహిళ కారుణ్య నియామకం ద్వారా వాణిజ్య పన్నుల శాఖలో ఉద్యోగిగా చేరింది. జ్యోతికి ఇద్దరు అన్నయ్యలు ఉండేవారు. ఆమె తల్లి ప్రభుత్వాసుపత్రిలో ఉద్యోగి. ఆమె చనిపోయిన తర్వాత ఆ ఉద్యోగాన్ని పెద్దన్నయ్యకు ఇచ్చారు. తర్వాత కొన్నాళ్లకు అతడు మరణించడంతో రెండో అన్నయ్యకు ఆ ఉద్యోగం వచ్చింది. కారుణ్య నియామకాన్ని పొందే సమయంలో అతడు తనకు ఆరోగ్యశాఖలో ఉద్యోగం వద్దని, మరో శాఖలో ఇప్పించాలని అప్పటి కలెక్టర్‌కు విన్నవించుకున్నాడు. దీన్ని పరిశీలించిన జిల్లా అధికారులు అతడికి వాణిజ్య పన్నుల శాఖలో ఉద్యోగం ఇచ్చారు. తర్వాత కొన్నాళ్లకు అతడు కిడ్నీ సంబంధిత వ్యాధితో మరణించాడు. అనంతరం ఈ ఉద్యోగాన్ని జ్యోతికి ఇచ్చారు. ఉద్యోగం పొందే సమయంలో పదో తరగతి లోపు చదువుకున్నట్టు తెలియజేసింది. దీనికి ఆధారంగా ఎనిమిదో తరగతి వరకు చదువుకున్నట్టు ఒక ధ్రువీకరణపత్రాన్ని అధికారులకు సమర్పించింది. ఈ ధ్రువీకరణపత్రం అసలైనదేనని అధికారులు భావించారు. కొన్నాళ్ల తర్వాత జ్యోతి కుటుంబంలో వివాదాలు మొదలయ్యాయి. ఆమెకు మేనమామ వరసయ్యే వ్యక్తి జ్యోతి విద్యార్హతకు సంబంధించి నకిలీ ధ్రువీకరణపత్రంతో ఉద్యోగం చేస్తోందని వాణిజ్య పన్నుల శాఖ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం జ్యోతి పార్కు రోడ్డు డివిజన్ కార్యాలయంలో అటెండర్‌గా పనిచేస్తుంది. ఈ ఫిర్యాదు అందిన తర్వాత అధికారులు విచారణ చేసి, సంజాయిషి ఇవ్వాలని నోటీసులు ఇచ్చారు. దీనికి స్పందించకపోవడంతో ఆమెను మూడు నెలల క్రితం విధుల నుంచి తప్పించారు. తర్వాత ఉద్యోగ సంఘాల నాయకుల ద్వారా మళ్లీ ఆమె కార్యాలయంలోకి అడుగుపెట్టింది. కొద్దిరోజుల క్రితం పూర్తిస్థాయిలో విచారణ చేసిన అధికారులు జ్యోతికి ఉద్వాసన పలికారు. ఈ విషయాన్ని అత్యంతగోప్యంగా ఉంచారు.