గందరగోళం!
ABN , Publish Date - May 14 , 2025 | 01:26 AM
జిల్లాలో బియ్యం కార్డుల జారీలో గందరగోళం నెలకొంది. స్పష్టమైన విధి విధానాలు లేకపోవడంతో ఈ ప్రక్రియ సక్రమంగా ముందుకు సాగడంలేదు. దీనికి తోడు అధికశాతం సచివాలయాల్లో కంప్యూటర్‌లు మొరాయిస్తున్నాయి. సచివాలయ సిబ్బంది కార్డుదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించి కంప్యూటర్‌లు బాగుపడితే వివరాలు నమోదు చేస్తామని, ఎలాంటి మార్పులు చేయాలో వివరాలు రాసి ఇచ్చి వెళ్లమని చెబుతున్నారు. బియ్యం కార్డుల జారీలో ప్రభుత్వం విధించిన నిబంధనలకు, క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులకు పొంతన లేకపోవడంతో పేదలు, సచివాలయ సిబ్బంది, పౌరసరఫరాలశాఖ అధికారులు అయోమయానికి గురవుతున్నారు. వెంటనే నిబంధనలు సడలించాలని ప్రజలు కోరుతున్నారు.
- బియ్యం కార్డుల జారీలో గజిబిజి
- వితంతువులకు ప్రత్యేక కార్డు కుదరదట!
- చిన్న కుటుంబానికి కొత్త కార్డు జారీపై ఆంక్షలు
- కార్డు నుంచి ఉద్యోగులు, వ్యాపారులైన బిడ్డల పేర్లు తొలగింపులో ఇక్కట్లు
- సచివాలయాల్లో మొరాయిస్తున్న కంప్యూటర్లు
- ఈ నెలాఖరులోగా బియ్యం కార్డుల జారీ పూర్తయ్యేనా!
జిల్లాలో బియ్యం కార్డుల జారీలో గందరగోళం నెలకొంది. స్పష్టమైన విధి విధానాలు లేకపోవడంతో ఈ ప్రక్రియ సక్రమంగా ముందుకు సాగడంలేదు. దీనికి తోడు అధికశాతం సచివాలయాల్లో కంప్యూటర్‌లు మొరాయిస్తున్నాయి. సచివాలయ సిబ్బంది కార్డుదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించి కంప్యూటర్‌లు బాగుపడితే వివరాలు నమోదు చేస్తామని, ఎలాంటి మార్పులు చేయాలో వివరాలు రాసి ఇచ్చి వెళ్లమని చెబుతున్నారు. బియ్యం కార్డుల జారీలో ప్రభుత్వం విధించిన నిబంధనలకు, క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులకు పొంతన లేకపోవడంతో పేదలు, సచివాలయ సిబ్బంది, పౌరసరఫరాలశాఖ అధికారులు అయోమయానికి గురవుతున్నారు. వెంటనే నిబంధనలు సడలించాలని ప్రజలు కోరుతున్నారు.
ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం :
జిల్లాలో 5.22 లక్షల బియ్యం కార్డులున్నాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో వలంటీర్ల ద్వారా 2020లో గ్రామాల్లో, వార్డుల్లో ఇంటింటికీ తిరిగి హౌస్‌హోల్డ్ మ్యాపింగ్ చేయించారు. ఒక కుటుంబంలో ఎంత మంది ఉంటున్నారు, వారి ఇంటి నెంబరు, నివాసం, కుటుంబసభ్యుల సంఖ్య, వారి బియ్యం కార్డులు, ఆధార్‌కార్డుల నెంబర్లు తదితర వివరాలన్నీ నమోదుచేశారు. ఈ ఐదేళ్లలో వివాహాలు చేసుకున్న వారు వేరు కాపురం ఉంటూ మరో చోట నివసిస్తున్నారు. వీరు కొత్తకార్డు కోసం సచివాలయానికి వెళితే గతంలో జరిగిన హౌస్‌హోల్డ్ మ్యాపింగ్‌లో ఆధార్ కార్డు నెంబర్‌ను ఆన్‌లైన్‌లో నమోదు చేసిన వివరాలు మొత్తం వస్తున్నాయి. మీకు కొత్తకార్డు ఇవ్వాల్సి వస్తే మీ తల్లిదండ్రులలో ఎవరైనా ఒకరు ఉంటే వారి పేరును కూడా మీ పేరున ఇచ్చే కార్డులోనే చేరుస్తామని చెబుతున్నారు
- నాలుగైదేళ్ల క్రితం వివాహం చేసుకుని, ఒకరు లేదా ఇద్దరు సంతానం ఉన్న వారు నూతన బియ్యం కార్డు కావాలని అడుగుతున్నారు. గతంలో ఉన్న కార్డులోనే ఇంటికి కోడలిగా వచ్చిన మహిళ పేరును, వారిపిల్లల పేర్లను చేరుస్తామని చెబుతున్నారు. ఇందు కోసం వివాహం జరిగినట్లుగా వివాహ రిజిస్ర్టేషన్ సర్టిఫికెట్, పెళ్లి పొటోలు, శుభలేఖ తదితరాలను ఇవ్వాలని షరతులు పెడుతున్నారు. దీంతో పాటు వేరే గ్రామానికి చెందిన మహిళ వివాహం చేసుకుని, తన పుట్టింటి వద్ద తల్లిదండ్రులతోపాటు బియ్యం కార్డులో పేరు ఉంటే అక్కడి పేరును తీసివేసేందుకు దరఖాస్తు చేసుకోవాలని, కొత్తదంపతులు ఇద్దరూ సచివాలయానికి వచ్చి వేలిముద్రలు వేయాలని కూడా పేర్కొంటున్నారు.
- ఒక కుటుంబంలో తల్లిదండ్రులు, ఇద్దరు కుమారుల పేరుతో ఇప్పటికే కార్డు ఉంది. కానీ ఇద్దరు కుమారులు వివాహాల అనంతరం వేర్వేరుగా కాపురం ఉంటున్నారు. ఇటీవల కాలంలో కుటుంబ పెద్ద చనిపోయాడు. వితంతువుగా మారిన తల్లి తన కుమారులు వివాహాలు చేసుకుని వేర్వేరుగా ఉంటున్నారని, తన ఒక్కరి పేరుతోనే బియ్యం కార్డు ఇవ్వాలని కోరితే అలా ఇవ్వడం కుదరదని, ఆన్‌లైన్‌లో ఇందుకు అవకాశం లేదని సచివాలయ సిబ్బంది చెబుతున్నారు. ఇద్దరి కుమారుల్లో ఎవరో ఒకరికి ఇచ్చే కార్డులో మీ పేరును కూడా చేర్చేందుకే అనుమతులు ఉన్నాయని స్పష్టం చేస్తున్నారు. ఒక్కరి పేరుతో అసలు బియ్యంకార్డు ఇచ్చేందుకు అనుమతులు లేవని చెప్పడం గమనార్హం.
- వివాహం చేసుకున్న అనంతరం అనారోగ్య కారణాలతో కుటుంబంలోని భార్య మరణిస్తే, ఆ తర్వాత సదరు వ్యక్తి వేరే మహిళను వివాహం చేసుకుంటే బియ్యం కార్డులో మార్పులు చేసేందుకు అనేక ఆంక్షలు పెడుతున్నారు. మొదటి భార్య చనిపోతే అందుకు సంబంధించిన మరణ ధ్రువీకరణ పత్రం ఇవ్వాలని, పునర్వివాహం చేసుకున్న మహిళ తన మొదటి భర్త నుంచి విడాకులు తీసుకున్నట్లుగా కోర్టు ఇచ్చిన పత్రాలను సమర్పించాలని చెబుతున్నారు. అధికారుల మాటలకు రెండో వివాహం చేసుకున్న వారు ఖంగుతింటున్నారు.
- కుటుంబంలో గొడవలు జరిగి, విడిపోయిన వారు కులకట్టుబాట్లను ఆధారంగా చేసుకుని పెద్దమనుషుల సమక్షంలో తెల్లకాగితాలపై రాసిన విడాకుల పత్రాలపై సంతకాలు చేసి విడిపోయిన వారు కొద్దిశాతం మంది ఉన్నారు. పెద్దల సమక్షంలో విడాకులు తీసుకుని వేరే వ్యక్తిని వివాహం చేసుకున్న వారు బియ్యం కార్డులో తమపేరు చేర్చాలని కోరితే, కులపెద్దలు ఇచ్చిన విడాకుల పత్రాలు చెల్లుబాటు కావని సచివాలయ సిబ్బంది చెప్పడం గమనార్హం.
- హౌస్‌హోల్డ్ మ్యాపింగ్ జరిగిన సమయంలో చదువుతూ, ఆ తర్వాత విద్యాభ్యాసం పూర్తి చేసుకుని వేరే ప్రాంతాల్లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు లేదా ఇతరత్రా వ్యాపారాలు చేస్తున్న వారు అధికశాతం మంది ఉన్నారు. గతంలో చేసిన హౌస్‌హోల్డ్ మ్యాపింగ్‌లో నుంచి వీరి పేర్లను తొలగించలేదు. వీరిలో అధికశాతం మంది పన్ను చెల్లింపుదారులుగా ఉన్నారు. తమ బిడ్డలు వివాహాలు జరిగి వేరే ప్రాంతంలో ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకుంటున్నారని, వారి పేర్లను కార్డు నుంచి తొలగించాలని సచివాలయానికి తల్లిదండ్రులు వెళితే సచివాలయ సిబ్బంది ప్రస్తుతం తొలగించలేమని, హౌస్‌హోల్డ్ మ్యాపింగ్‌ను మార్చడానికి అవకాశం ఇవ్వలేదని చెప్పడం గమనార్హం. ఇన్ని ఇబ్బందుల మధ్య కొత్తకార్డులను ఎప్పటికి ఇస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది.
పనిచేయని కంప్యూటర్‌లు
ఒక్కో సచివాలయంలో రెండు కంప్యూటర్‌లు ఉన్నాయి. జిల్లాలోని అధికశాతం సచివాలయాల్లో ఇవి పనిచేయడంలేదు. వీటికి మరమ్మతులు చేయించాలని మునిసిపల్ కమిషనర్‌లు, ఎంపీడీవోలకు సచివాలయ అడ్మిన్‌లు లేఖలు రాశారు. కానీ వాటికి మరమ్మతులు చేయనేలేదు. ఇలాంటి స్థితిలో బియ్యంకార్డుల జారీ ప్రక్రియ ఎంతమేర ముందుకు సాగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది.