Share News

Transport Department: అడుగడుగునా నిబంధనల ఉల్లంఘన

ABN , Publish Date - Nov 01 , 2025 | 04:16 AM

కర్నూలు జిల్లాలో ఇటీవల జరిగిన బస్సు దుర్ఘటనను రాష్ట్ర ప్రభుత్వం సీరియ్‌సగా తీసుకుంది. ఈ ప్రమాదంపై నలుగురు రవాణాశాఖ అధికారులతో నియమించిన...

Transport Department: అడుగడుగునా నిబంధనల ఉల్లంఘన

  • కర్నూలు ‘వి.కావేరి’ బస్సు దుర్ఘటనపై రవాణా అధికారుల కమిటీ సమగ్ర విచారణ

  • నిబంధనలు ఉల్లంఘిస్తూ స్లీపర్‌గా మార్పు

  • బస్సులో లేని అగ్నిమాపక యంత్రాలు

  • యథేచ్ఛగా కార్గో సరుకుల రవాణా

  • నేడు కేసు దర్యాప్తు అధికారులకు నివేదిక!

కర్నూలు/విజయవాడ సిటీ, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి): కర్నూలు జిల్లాలో ఇటీవల జరిగిన బస్సు దుర్ఘటనను రాష్ట్ర ప్రభుత్వం సీరియ్‌సగా తీసుకుంది. ఈ ప్రమాదంపై నలుగురు రవాణాశాఖ అధికారులతో నియమించిన కమిటీ ఇప్పటికే సమగ్ర విచారణ చేపట్టింది. బస్సు కొనుగోలు నుంచి రిజిస్ట్రేషన్‌, ఆలేట్ర్‌షన్‌ ప్రమాదానికి కారణాలు, బస్సు డ్రైవర్‌ మానసిక పరిస్థితి..? వరకు ఇలా అన్ని సమగ్ర వివరాలు సేకరించింది. రోడ్డు రవాణా శాఖ అధికారులు శనివారం సమగ్ర వివరాలతో కేసు దర్యాప్తు అధికారులకు నివేదిక ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నివేదిక పోలీసు దర్యాప్తునకు ఎంతో కీలకమని భావిస్తున్నారు. తెలంగాణ, డామన్‌ డయ్యు, ఒడిశా రవాణా శాఖ అధికారులు, బస్సు తయారు చేసిన స్కానియా కంపెనీ ప్రతినిధుల నుంచి వివరాలు తీసుకున్న వివరాల ఆధారంగా.. ప్రమాదానికి కారణమైన వి.కావేరి ట్రావెల్‌ బస్సు ఆలే్ట్రషన్‌ చేసి నిబంధనలు అతిక్రమించినట్లు రవాణా శాఖ అధికారుల కమిటీ గుర్తించింది. వి.కావేరి ట్రావెల్‌కు చెందిన డీడీ01 ఎన్‌9490 నంబరు గల మల్లీ యాక్సిల్‌ స్కానియా ఏసీ స్లీపర్‌ బస్సును 2018లో తెలంగాణలో రిజిస్ట్రేషన్‌ చేయించారు. 53 ఏసీ సీటర్‌ బస్సుగా అనుమతి ఇచ్చారు. ఆ తర్వాత సీటర్‌ బస్సును 43 సీప్లర్‌ బెర్తులుగా ఆలే్ట్రషన్‌ చేయించి 2023లో కేంద్ర పాలిత ప్రాంతమైన డామన్‌ డయ్యులో, ఆ తర్వాత ఈ ఏడాది ఏప్రిల్‌లో ఒడిశాలో రిజిస్ట్రేషన్‌ చేయించినట్లు సమాచారం. అయితే 43 సీట్ల బస్సుగానే రిజిస్ట్రేషన్‌ చేయించినట్లు తెలుస్తోంది. ఏసీ సీటింగ్‌ బస్సుగా రిజిస్ట్రేషన్‌ చేయించిన యాజమాన్యం ఏసీ స్లీపర్‌ బస్‌గా రోడ్డుపై తిప్పుతున్నారని, రవాణా శాఖ నిబంధనలు ఉల్లంఘించినట్లు కమిటీ గుర్తించింది. అలాగే బస్సులో అగ్నిమాపక పరికరాలు లేవని గుర్తించారు. నిబంధనలు అతిక్రమించి యథేచ్ఛగా కార్గో సరుకుల రవాణా చేస్తున్నట్లు గుర్తించింది. విచారణలో వెలుగు చూసిన లోపాలు, బస్సు ఆలే్ట్రషన్‌తో నిబంధనలు ఉల్లంఘన తదితర వివరాలతో సమగ్ర నివేదికను శనివారం దర్యాప్తు అధికారులకు, రోడ్డు రవాణా శాఖ రాష్ట్ర కమిషనర్‌కు అందజేయనున్నట్లు తెలిసింది. నివేదిక అందగానే దర్యాప్తు పూర్తి చేసి న్యాయస్థానానికి అందజేస్తామని, పరారీలో ఉన్న బస్సు యజమానిని అరెస్టు చేసే అవకాశం లేకపోలేదని పోలీసు అధికారులు పేర్కొన్నారు.


ఫోరెన్సిక్‌ బృందాల పనితీరు భేష్‌: డీజీపీ

కర్నూలు బస్సు దహనం ఘటనలో మృతదేహాలను శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానంతో అనతి కాలంలోనే గుర్తించిన ఏపీ ఫోరెన్సిక్‌ బృందాలను డీజీపీ హరీష్ కుమార్‌ గుప్తా అభినందించారు. శుక్రవారం తన కార్యాలయంలో వారికి ప్రశంసా పత్రాలు అందజేశారు. బస్సు ప్రమాదంలో మృతదేహాలు గుర్తు పట్టలేనంతగా కాలిపోయిన విషయం తెలిసిందే. డీజీపీ ఆదేశాల మేరకు ఏపీ ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌ డైరెక్టర్‌ పాలరాజు డీఎన్‌ఏ, భౌతిక, రసాయన విశ్లేషణలతో కూడిన 16 ఫోరెన్సిక్‌ బృందాలతో ఘటనా స్థలాన్ని పరిశీలించారు. భౌతిక, రసాయన విశ్లేషణ బృందాల నివేదికలు ప్రమాదానికి కారణాలపై స్పష్టత ఇవ్వడంలో కీలకంగా మారాయి. డీఎన్‌ఏ బృందాలు మృతదేహాల అవశేషాలను జాగ్రత్తగా సేకరించడంలో, బాధిత కుటుంబసభ్యుల రక్తనమూనాలు సేకరించి డీఎన్‌ఏ పరీక్షల కోసం ఏపీఎఫ్ఎస్ఎల్‌కు తరలించే ప్రక్రియను ఫోరెన్సిక్‌ అధికారులు సమన్వయం చేశారు. కేవలం 13 గంటలల్లోనే 19 మృతదేహాల డీఎన్‌ఏ ప్రొఫైల్స్‌ అభివృద్ధి చేసి, వాటిని వారి బంధువులకు నమూనాలతో సరిపోల్చి నివేదికలను వేగవంతంగా అందించారు.

Updated Date - Nov 01 , 2025 | 04:18 AM