MLC Bhumi Reddy: టీడీఆర్ అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలి
ABN , Publish Date - Aug 30 , 2025 | 06:31 AM
వైసీపీ హయాంలో 2019-24 మధ్య కాలంలో రూ.వందల కోట్ల టీడీఆర్ బాండ్ల కుంభకోణం జరిగింది. దానిపై సమగ్ర విచారణ జరపాలి’ అని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి డిమాండ్ చేశారు.
కరుణాకర్‌రెడ్డి అక్రమాలను నిగ్గు తేల్చాలి
కీలక అధికారిణి పాత్రపైనా దర్యాప్తు జరపాలి
ముఖ్యమంత్రికి ఎమ్మెల్సీ రాంగోపాల్‌రెడ్డి లేఖ
అమరావతి, ఆగస్టు 29(ఆంధ్రజ్యోతి): ‘వైసీపీ హయాంలో 2019-24 మధ్య కాలంలో రూ.వందల కోట్ల టీడీఆర్ బాండ్ల కుంభకోణం జరిగింది. దానిపై సమగ్ర విచారణ జరపాలి’ అని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈమేరకు ఆయన సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. ఆ లేఖ ప్రతిని శుక్రవారం విలేకరులకు విడుదల చేశారు. ‘‘తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి ఇటీవల మాట్లాడుతూ, ‘టీడీఆర్ బాండ్ల జారీలో రాష్ట్ర స్థాయి అధికారిణి ఆధ్వర్యంలో తిరుపతిలోనే రూ.వందల కోట్ల అక్రమాలు జరిగాయి. ఆ డబ్బంతా ఆ అధికారిణికే చేరింది. నేను వ్యక్తిగతంగా ఎలాంటి అవినీతికి పాల్పడలేదు’ అంటూ సెల్ఫ్ సర్టిఫికేట్ ఇచ్చుకున్నారు. తిరుపతిలో టీడీఆర్ బాండ్ల జారీలో అక్రమాలు చోటుచేసుకున్నాయని అప్పటి అధికార పార్టీ శాసనసభ్యుడు, అప్పుడు కీలక పదవిలో ఉన్న అధికారిణిపైనే ఆరోపణలు చేస్తున్నందున దీనిపై సమగ్ర విచారణ జరపాల్సిన అవసరం ఉంది. దీనికోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలి. వైసీపీ నేత, తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఏ స్థాయిలో అక్రమాలకు పాల్పడ్డాడు, అయన ఆరోపించిన కీలక అధికారిణి ఎవరు? ఆమె పాత్ర ఎంత? తదితర అంశాలపై సమగ్ర దర్యాప్తు జరిపించాలి. జరిగిన ఆర్థిక నష్టాన్ని వారి నుంచే రాబట్టే విధంగా చర్యలు తీసుకోవాలి’ అని రాంగోపాల్ రెడ్డి ఆ లేఖలో సీఎంని కోరారు.