Higher Education Department: ప్రైవేటు కోచింగ్ సెంటర్లపై కమిటీ
ABN , Publish Date - Oct 15 , 2025 | 05:58 AM
రాష్ట్రంలోని ప్రైవేటు కోచింగ్ సెంటర్లలో పాటించాల్సిన నిబంధనల రూపకల్పనకు ఉన్నత విద్యాశాఖ కమిటీని నియమించింది.
నిబంధనల రూపకల్పనకు 13 మందితో ఏర్పాటు
అమరావతి, అక్టోబరు 14(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ప్రైవేటు కోచింగ్ సెంటర్లలో పాటించాల్సిన నిబంధనల రూపకల్పనకు ఉన్నత విద్యాశాఖ కమిటీని నియమించింది. ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి నేతృత్వంలో 13 మందితో కమిటీని ఏర్పాటుచేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. ఇందులో జాతీయ మెంటల్ హెల్త్ టాస్క్‌ఫోర్స్ అధికారులు, సైకాలజిస్ట్, సైక్రియాటిస్ట్, ఎన్‌జీవోలు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉన్నత విద్యామండలి చైర్మన్, సాంకేతిక విద్యాశాఖ డైరెక్టర్, ఇంటర్ విద్యాశాఖ డైరెక్టర్, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్, వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ సభ్యులుగా ఉన్నారు. ప్రైవేటు కోచింగ్ సెంటర్లలో విద్యార్థుల నమోదు, వారి పరిరక్షణ, సమస్యల పరిష్కార వేదిక ఉండాలని సుప్రీంకోర్టు ఈ ఏడాది జూలైలో తీర్పు ఇచ్చింది. అన్ని రాష్ర్టాలు ప్రైవేటు కోచింగ్ సెంటర్లపై నిబంధనలు రూపొందించాలని, అవి విద్యార్థుల మానసిక ఆరోగ్యాన్ని రక్షించేలా ఉండాలని స్పష్టంచేసింది. అందుకు అనుగుణంగా ఇప్పుడు రాష్ట్రంలో నిబంధనల రూపకల్పనకు కమిటీని నియమించారు. పదిహేను రోజుల్లో కమిటీ సిఫారసులతో నివేదికను ప్రభుత్వానికి పంపుతుంది.