Share News

Caste Classification: ఎస్సీ వర్గీకరణపై సీఎంకు చేరిన నివేదిక

ABN , Publish Date - Mar 12 , 2025 | 04:33 AM

ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్‌ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. అదే సమయంలో... కమిషన్‌ కాల పరిమితిని మరో నెల...

Caste Classification: ఎస్సీ వర్గీకరణపై సీఎంకు చేరిన నివేదిక

  • శరవేగంగా ముగిసిన ప్రక్రియ

  • తుది నిర్ణయం ముఖ్యమంత్రిదే!

  • తొలుత ఎస్సీ ప్రతినిధులతో భేటీ

  • కేబినెట్‌లోనూ చర్చ జరిగే చాన్స్‌

అమరావతి, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్‌ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. అదే సమయంలో... కమిషన్‌ కాల పరిమితిని మరో నెల రోజుల పాటు పొడిగిస్తూ మంగళవారంనాడు సాంఘిక సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్సీ వర్గీకరణపై అధ్యయనం కోసం గత ఏడాది నవంబరు 15న రిటైర్డ్‌ ఐఏఎస్‌ రాజీవ్‌ రంజన్‌ మిశ్రా నేతృత్వంలో ప్రభుత్వం కమిషన్‌ను నియమించింది. వీలైనంత త్వరగా అధ్యయనం పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని అందులో కోరింది. గత ఏడాది నవంబరు 27న కమిషన్‌ తన విధులు ప్రారంభించింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పర్యటించి ఎస్సీ రిజర్వేషన్ల అమలులో వర్గీకరణపై సంబంధిత వర్గాల అభిప్రాయాలను సేకరించింది. శరవేగంగా ఈ ప్రక్రియను ముగించింది. తన సిఫారసులతో నివేదికను సిద్ధం చేసి... దానిని సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌కు అందజేసింది. దీనిని సీఎస్‌ మంగళవారం సీల్డ్‌ కవర్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలన కోసం పంపించారు. దీనిపై సీఎం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈలోపే ఆయన మాల, మాదిగ, ఇతర ఎస్సీ ఉపకులాల ప్రతినిధులతో సమావేశమై... వర్గీకరణపై చర్చిస్తారని తెలుస్తోంది. ఈ నెల 18వ తేదీన జరగనున్న కేబినెట్‌ ప్రత్యేక భేటీలో వర్గీకరణ అమలుపై తీర్మానం చేసే అవకాశముందని కూడా సమాచారం.

Updated Date - Mar 12 , 2025 | 04:34 AM