AP Government: రీసర్వే పర్యవేక్షణకు కమాండ్ కంట్రోల్
ABN , Publish Date - Oct 08 , 2025 | 03:49 AM
భూముల రీసర్వే 2.0 ప్రక్రియను పరిశీలించి, పర్యవేక్షించేందుకు రాష్ట్ర స్థాయి కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మంగళగిరిలోని సర్వే డైరెక్టరేట్ కార్యాలయం కేంద్రంగా ఇది పనిచేయనుంది.
2,096 గ్రామాల్లో జనవరి నుంచి రీసర్వే 2.0
మొదటి దశలో 628.. రెండో దశలో 748 గ్రామాల్లో.. ఈ నెల 3 నుంచి మరో 720 గ్రామాల్లో శ్రీకారం.. రైతులతో నేరుగా మాట్లాడనున్న బృందాలు
సర్వే డైరెక్టరేట్ కార్యాలయం కేంద్రంగా ఏర్పాటు
జిల్లాల్లో కూడా సెంటర్లు పెట్టాలని డైరెక్టర్ ఆదేశాలు
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
భూముల రీసర్వే 2.0 ప్రక్రియను పరిశీలించి, పర్యవేక్షించేందుకు రాష్ట్ర స్థాయి కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మంగళగిరిలోని సర్వే డైరెక్టరేట్ కార్యాలయం కేంద్రంగా ఇది పనిచేయనుంది. త్వరలో జిల్లాల వారీగా కమాండ్ కంట్రోల్ సెంటర్లు ఏర్పాటు చేయాలని సర్వే డైరెక్టర్ ఆర్.కూర్మనాథ్ ఆదేశాలిచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చాక భూముల సర్వే 2.0ను ఈ జనవరి నుంచి ప్రారంభించిన సంగతి తెలిసిందే. మొత్తం 2,096 గ్రామాల్లో ఇది సాగుతోంది. తొలి దశలో జనవరిలో 628, రెండో దశ కింద జూలైలో 748 గ్రామాల్లో సర్వే చేపట్టారు. ఈ నెల 3 నుంచి మరో 720 గ్రామాల్లో సర్వే ప్రారంభించారు. మూడో దశ రీసర్వేలో క్షేత్ర స్థాయి వాస్తవాలకు ప్రాధాన్యమిస్తామని డైరెక్టర్ తెలిపారు. సమస్యలను తెలుసుకుని అప్పటికప్పుడే పరిష్కారం చూపేందుకు.. సాంకేతిక, ఇతర అంశాలపై అవగాహన కల్పించడానికి, ఉన్నత స్థాయి పర్యవేక్షణ కోసం సీసీఎల్‌ఏ జి.జయలక్ష్మి ఆదేశాలతో రాష్ట్రస్థాయి కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మరోవైపు.. భూసర్వేను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులను పంపించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత జగన్ ప్రభుత్వంలో క్షేత్రస్థాయికి వెళ్లకుండా చెట్ల కింద, ఆఫీసుల్లో కూర్చుని రీసర్వే రికార్డులు రూపొందించారన్న విమర్శలు వచ్చాయి. దీనికి తగినట్లుగానే రికార్డుల్లో తమ పేర్లు, భూమి విస్తీర్ణం, సరిహద్దులను తప్పుగా నమోదు చేశారని లక్షలాది మంది రైతులు ఫిర్యాదు చేశారు.
ఈ నేపథ్యంలో రాష్ట్ర, జిల్లాస్థాయి అధికారులతో ప్రత్యేక బృందాలు ఏర్పాటుచేసి రీసర్వే జరుగుతున్న ప్రాంతాలకు పంపించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సర్వే డైరెక్టర్ సహా జేడీ, ఆర్‌డీడీలు, డీడీలు జిల్లాలకు వెళ్లనున్నారు. గ్రామాల్లో పర్యటించి సర్వే జరుగుతున్న తీరుపై నేరుగా రైతులతోనే చర్చించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు కూర్మనాథ్ తెలిపారు. తాను కూడా క్షేత్ర స్థాయిలో పర్యటిస్తానన్నారు. రైతులు, ప్రజల నుంచి సూచనలు, సలహాలు తీసుకుంటామని.. అవసరమున్నచోట మార్పులు తీసుకొస్తామని చెప్పారు.