Share News

కలెక్టర్‌ గారూ.. దవాఖానాపై దృష్టి పెట్టండి

ABN , Publish Date - Sep 17 , 2025 | 11:56 PM

కొత్త వచ్చిన కలెక్టర్‌ గారూ.. కర్నూలు సర్వజన వైద్యశాలపై దృష్టి పెట్టాలని రోగులు కోరుతున్నారు.

   కలెక్టర్‌ గారూ..  దవాఖానాపై దృష్టి పెట్టండి
మధ్యాహ్నం 3 గంటల సమయంలో స్కానింగ్‌ టోకెన కోసం గొడవ పడుతున్న రోగులు

స్కానింగ్‌ టోకెన్ల కోసం పడిగాపులు

నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులు

ఇబ్బందులు పడ్డ రోగులు

200 మందికి గానూ 84 టోకెన్లు మాత్రమే పంపిణీ

కర్నూలు హాస్పిటల్‌, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): కొత్త వచ్చిన కలెక్టర్‌ గారూ.. కర్నూలు సర్వజన వైద్యశాలపై దృష్టి పెట్టాలని రోగులు కోరుతున్నారు. ఎంతో ఆశతో మెరుగైన వైద్యం అందుతుందనే రోగులకు కష్టాలు తప్పడం లేదు. నిత్యం పాట్లు పడుతూ వైద్యం చేయించుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో అధికారులు, రేడియాలజి వైద్యుల నిర్లక్ష్యంతో అల్ర్టాసౌండ్‌ పరీక్షల కోసం రోగులు పడిగాపులు కాశారు.

గంటల తరబడి

స్కానింగ్‌ పరీక్షల టోకెన్ల కోసం బుధవారం మధ్యాహ్నం 12గంటల ఓపీ రోగులు కౌంటర్‌ వద్దకువచ్చారు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా మూడు గంటలు అక్కడే వేచి ఉన్నారు. మధ్యాహ్నం 3గంటల సమయంలో ఓ స్టాఫ్‌ నర్సు అక్కడికి చేరుకుంది. 200 మందికి పైగా అప్పటికే వేచి ఉండగా వారిలో కేవలం 84 మందికి స్కానింగ్‌ టోకెన్లు ఇచ్చి చేతులు దులుపుకుంది.

కన్నెత్తి చూడని అధికారులు

200 మందిలో 84 మందికి టోకెన్లు అందగా మిగతా పేద రోగులందరూ ఇంటి బాట పట్టారు. మిగిలినవారు గురువారం రావాలని చెప్పడంతో రోగులు వెనుదిరిగారు. దీంతో రోగులు సిబ్బందితో గొడవపడ్డారు. ఈ రచ్చరచ్చగా ఉన్నా కూడా ఇటు రేడియా లజి వైద్యులుగాని, అధికారులు గానీ అటు వైపు కన్నెత్తి కూడా చూడలేదు. దీంతో రోగులు మండిపడుతున్నారు. ఆసుపత్రిలో కొందరు అధికారులు రౌండ్స్‌ చేయకుండా తమ గదులకు పరిమితమయ్యారని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. కొత్తగా వచ్చిన కలెక్టర్‌ న్యూడయోగ్నస్టిక్‌ బ్లాక్‌లో నెలకొన్న స్కానింగ్‌ పరీక్షలు పేదవారికి అందేలా చర్యలు తీసుకోవాలని రోగులు కోరుతున్నారు.

Updated Date - Sep 17 , 2025 | 11:56 PM