Share News

EX Vice President Venkaiah Naidu: భాషావ్యాప్తి జరగాలి

ABN , Publish Date - Aug 30 , 2025 | 04:30 AM

రాష్ట్రంలో తెలుగు భాషావ్యాప్తి జరగాలని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. సృజనాత్మక మార్గంలో సమష్ఠి కృషి జరిపినప్పుడే భాషాభివృద్ధికి బాటలుపడతాయని ఆయన పేర్కొన్నారు.

EX Vice President Venkaiah Naidu: భాషావ్యాప్తి జరగాలి

  • సృజనాత్మక పద్ధతిలో సమష్టి కృషి అవసరం

  • అప్పుడే తెలుగు భాషాభివృద్ధికి బాటలు

  • గిడుగు సభలో వెంకయ్యనాయుడు సూచన

నెల్లూరు (సాంస్కృతికం) ఆగస్టు 29(ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో తెలుగు భాషావ్యాప్తి జరగాలని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. సృజనాత్మక మార్గంలో సమష్ఠి కృషి జరిపినప్పుడే భాషాభివృద్ధికి బాటలుపడతాయని ఆయన పేర్కొన్నారు. శుక్రవారం నెల్లూరు పురమందిరంలో సేవ అనే సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘తెలుగు భాష ఉత్సవాలు, గిడుగు రామ్మూర్తి జయంతి వేడుకల’కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బడిలో నేర్పించే తెలుగుతోపాటు బతుకును నిలబెట్టే తెలుగును కూడా విద్యార్థులకు నేర్పించాలని వెంకయ్యనాయుడు సూచించారు. భాష ఆధునీకరణ అంటే మూలాలు మరవడం కాదని, మరింత సమగ్రంగా భవిష్యత్‌ను నిర్మించుకోవడమని వివరించారు. విజ్ఞానం అందరికీ అందాలని ఆకాక్షించి, వ్యావహారిక భాషోద్యమానికి శ్రీకారం చుట్టిన గిడుగు స్ఫూర్తితో తెలుగు భాషను పరిరక్షించుకోవాలని సూచించారు. ‘‘మాతృభాషను ప్రేమించడం, సోదరభాషను గౌరవించడం, అవసరాన్ని బట్టి పరభాషను అభ్యసించడం అత్యంత ఆవశ్యకం. ఆటపాటలతో తెలుగును విద్యార్థులకు నేర్పించాలి.’’ అని కోరారు. తెలుగు నాట తెలుగు భాష పరిరక్షణ గురించి మాట్లాడుకునే పరిస్థితి రావడం విచారకరమన్నారు. ఉన్నత విద్యలోనూ మాతృభాషల వాడకం పెరగాలని ఆయన ఆకాంక్షించారు. ప్రజల భాష, పరిపాలనా భాష ఒక్కటే కావాలని సూచించారు. న్యాయస్థాన కార్యకలాపాలు, తీర్పులు మాతృభాషలో అందించేందుకు ప్రయత్నాలు జరగాలన్నారు. కంప్యూటర్లలో తెలుగు భాష వినియోగాన్ని పెంచడం ద్వారా నేటి యువతలో ఆసక్తిని పెంచవచ్చునని సూచించారు. అందమైన తెలుగు పద్యాల వినియోగానికి భాషాప్రియులు చొరవ తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పద్మశ్రీ గ్రహీత ఆచార్య కొలకలూరి ఇనాక్‌, ప్రసార భారతి విశ్రాంత అదనపు డైరెక్టర్‌ జనరల్‌ రేవూరు అనంత పద్మనాభరావు, సేవా సంస్థ అధ్యక్షుడు కంచర్ల సుబ్బానాయుడు, పలువురు భాషాభిమానులు, తెలుగు సాహితీవేత్తలు, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - Aug 30 , 2025 | 04:30 AM