Weather: ఉత్తరాంధ్ర గజగజ
ABN , Publish Date - Nov 14 , 2025 | 05:55 AM
వాయవ్య భారతం నుంచి మధ్యభారతం మీదుగా శీతలగాలులు వీస్తుండడంతో ఉత్తరాంధ్రలో చలి తీవ్రత పెరిగింది. దక్షిణ కోస్తా, రాయలసీమల్లోని పలు ప్రాంతాల్లోనూ చలి పెరిగింది.
జి.మాడుగులలో 7.6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత
విశాఖపట్నం, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): వాయవ్య భారతం నుంచి మధ్యభారతం మీదుగా శీతలగాలులు వీస్తుండడంతో ఉత్తరాంధ్రలో చలి తీవ్రత పెరిగింది. దక్షిణ కోస్తా, రాయలసీమల్లోని పలు ప్రాంతాల్లోనూ చలి పెరిగింది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో గురువారం తెల్లవారుజాము నుంచి దట్టంగా మంచు కురవడంతోపాటు చలి తీవ్రత కొనసాగింది. శీతాకాలంలో మొదటిసారిగా అల్లూరి జిల్లాలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు బాగా పడిపోయాయి. జి.మాడుగులలో 7.6, ముంచంగిపుట్టు మండలం కిలగడలో 7.8, డుంబ్రిగుడలో 9.4 డిగ్రీలు, మైదాన ప్రాంతంలోని కళింగపట్నంలో 16.5, జంగమహేశ్వరపురంలో 17.5, విశాఖ ఎయిర్‌పోర్టులో 19 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా.. నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిశాయి. రానున్న రెండు, మూడు రోజులపాటు మధ్యభారతం, ఉత్తరకోస్తా, తెలంగాణ సరిహద్దునున్న కోస్తా ప్రాంతాల్లో చలి తీవ్రత కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఇంకా తగ్గే అవకాశం ఉందని పేర్కొంది. దక్షిణ కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని, రాష్ట్రంలో మిగిలిన చోట్ల పొడి వాతావరణం కొనసాగుతుందని పేర్కొంది.