IT Firms Launch Operations: విశాఖకు ఐటీ జోష్
ABN , Publish Date - Dec 11 , 2025 | 03:46 AM
విశాఖపట్నానికి ఐటీ జోష్ వస్తోంది. దిగ్గజ సంస్థల్లో టీసీఎస్ కంటే ముందే కాగ్నిజెంట్ తన కార్యకలాపాలను ప్రారంభిస్తోంది. భూమి కేటాయించి కొద్దినెలలే అయినా శాశ్వత భవనాల నిర్మాణానికి భూమి పూజ....
రేపు కాగ్నిజెంట్ కార్యకలాపాలు ప్రారంభం
కాగ్నిజెంట్ శాశ్వత కార్యాలయం, టెక్ తమ్మిన, సత్వ, ఇమ్మాజినోటివ్, ఫ్లూయెంట్ గ్రిడ్ ఐటీ కంపెనీలకు భూమి పూజ
హాజరుకానున్న సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్
విశాఖపట్నం, డిసెంబరు 10(ఆంధ్రజ్యోతి): విశాఖపట్నానికి ఐటీ జోష్ వస్తోంది. దిగ్గజ సంస్థల్లో టీసీఎస్ కంటే ముందే కాగ్నిజెంట్ తన కార్యకలాపాలను ప్రారంభిస్తోంది. భూమి కేటాయించి కొద్దినెలలే అయినా శాశ్వత భవనాల నిర్మాణానికి భూమి పూజ, తాత్కాలిక కార్యాలయం ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. శుక్రవారం ఈ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. దీనికి సీఎం చంద్రబాబు, ఐటీ మంత్రి లోకేశ్ హాజరవుతున్నారు. ముందుగా మంత్రి లోకేశ్ విశాఖపట్నం చేరుకుని శుక్రవారం ఉదయం 9.30 గంటలకు రుషికొండ ఐటీ పార్క్‌లోని హిల్-2పై మహతి ఫిన్‌టెక్ భవనంలో కాగ్నిజెంట్ తాత్కాలిక కార్యాలయం ప్రారంభిస్తారు. తరువాత హిల్-3కి చేరుకొని శ్రీటెక్ తమ్మిన సంస్థకు భూమిపూజ చేస్తారు. అక్కడే నాన్‌రెల్ టెక్నాలజీస్, ఏసీఎన్ ఇన్ఫోటెక్ భూమిపూజ శిలాఫలకాలను ఆవిష్కరిస్తారు. అక్కడి నుంచి 2.9 కి.మీ. దూరానున్న హిల్-4కు చేరుకొని సత్వాస్ వాంటేజ్ వైజాగ్ క్యాంపస్‌కు శంకుస్థాపన చేస్తారు. అక్కడి నుంచి మరో 5.4 కి.మీ. దూరంలోని కాపులుప్పాడ వెళతారు. అక్కడ ఇమ్మాజినోటివ్, ఫ్లూయెంట్ గ్రిడ్ ఐటీ కంపెనీలకు కూడా శంకుస్థాపనలు చేస్తారు. మదర్‌సన్ టెక్నాలజీస్, క్వార్క్స్ టెక్నోసాఫ్ట్ సంస్థల శిలాఫలకాలు ఆవిష్కరిస్తారు. ఈ కార్యక్రమం అనంతరం అర కిలోమీటరు దూరానున్న కాగ్నిజెంట్ స్థలానికి ఉదయం 11 గంటలకు చేరుకుంటారు. అదే సమయానికి అక్కడకు సీఎం చంద్రబాబు వస్తారు. ఇరువురూ కలిసి కాగ్నిజెంట్ శాశ్వత కార్యాలయాల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు. అదే ప్రాంగణంలో 8 ఐటీ సంస్థలకు చెందిన ప్రతినిధులతో ఇరువురూ సమావేశమవుతారు.
ఇవీ సంస్థలు, వాటి కార్యకలాపాలు
కాగ్నిజెంట్‌కు కాపులుప్పాడలో 22.19 ఎకరాలు కేటాయించారు. అందులో రూ.1,600 కోట్ల పెట్టుబడితో ఏఐ టెక్నాలజీ సెంటర్‌ను సంస్థ అభివృద్ధి చేస్తుంది. మొత్తం 8 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది. ఈ ప్రాంగణం 2029 నాటికి అందుబాటులోకి వస్తుంది.
రుషికొండ హిల్-2పై శ్రీటెక్ తమ్మిన ఏఐ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటు చేస్తుంది. ఈ సంస్థ 2 వేల మందికి ఉపాధి కల్పిస్తుంది.
ఐటీ పార్క్ హిల్-4పై సత్వ డెవలపర్స్ ఐటీ స్పేస్, డేటా సెంటర్.. వాంటేజ్ వైజాగ్ క్యాంపస్ ఏర్పాటు చేస్తుంది. సంస్థకు ఎకరా రూ.1.5 కోట్లు చొప్పున 30 ఎకరాలు ఇచ్చారు. రూ.1,500 కోట్ల పెట్టుబడితో 25 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనుంది. ఇది బెంగళూరుకు చెందిన రియల్ ఎస్టేట్ కంపెనీ.
కాపులుప్పాడలో ఇమ్మాజినోటివ్, ఫ్లూయెంట్‌గ్రిడ్, మదర్‌సన్ టెక్నాలజీస్, క్వార్క్స్ టెక్నోసాఫ్ట్ సంస్థలు ఏర్పాటవుతాయి. విశాఖకు చెందిన ఫ్లూయెంట్‌గ్రిడ్‌కు కాపులుప్పాడలో 3.3 ఎకరాలు కేటాయించారు.
మదర్‌సన్ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్‌కు కాపులుప్పాడ ఐటీ పార్కులో 3.55 ఎకరాలు కేటాయించారు. అందులో ఐటీ ఆర్‌అండ్‌డి సెంటర్, జీసీసీ ఏర్పాటు చేస్తారు. 700 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి.
ఇమ్మాజినోటివ్ సంస్థకు 4.05 ఎకరాలు కేటాయించారు. అందులో రూ.140 కోట్లతో ఆ సంస్థ జీసీసీ ఏర్పాటు చేస్తుంది.