Anti Drug Operations: మత్తు వదిలింది
ABN , Publish Date - Oct 27 , 2025 | 03:47 AM
ఏడాదిన్నర క్రితం వరకూ దేశంలో ఎక్కడ గంజాయి పట్టుబడినా ఆంధ్రప్రదేశ్ పేరే వినిపించేది. గత వైసీపీ ప్రభుత్వంలో విశాఖ మన్యంలో వేలాది ఎకరాల్లో గంజాయి సాగయ్యేది.
గంజాయిపై కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం
ఈగల్, పోలీసుల ప్రత్యేక చర్యలు
మన్యంలో గంజాయి తోటల ధ్వంసం
ప్రత్యామ్నాయ పంటల వైపు ప్రోత్సాహం
రాష్ట్రంలో గంజాయి సాగు పూర్తిగా బంద్
పొరుగు రాష్ట్రం ఒడిశాలో పెరిగిన సాగు
అక్కడి నుంచి మన్యం మీదుగా ఆంధ్రప్రదేశ్‌కు
అరకు ప్రాంతంలో స్వీటు, హార్డ్‌వేర్ వ్యాపారుల ముసుగులో రాజస్థాన్, తమిళనాడు స్మగ్లర్లు
అంతర్రాష్ట్ర స్మగ్లింగ్ గుట్టు కనుగొన్న ఈగల్
2022 నాటికి మన్యంలో సుమారు 10 వేల నుంచి 15 వేల ఎకరాల్లో గంజాయి సాగు జరుగుతుండేదని అంచనా. గత వైసీపీ ఐదేళ్ల పాలనలో రాష్ట్రం గంజాయి హబ్‌గా మారిపోయిందనే విమర్శలు వినిపించాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక గంజాయిపై ఉక్కుపాదం మోపింది. ఈగల్ బృందాలు, పోలీసుల కఠిన చర్యలతో మన్యంలో గంజాయి సాగు పూర్తిగా కనుమరుగైంది. ఇదే సమయంలో పొరుగు రాష్ట్రం ఒడిశాలో గంజాయి సాగు పెరిగింది. ఒడిశా నుంచి ఏపీ మీదుగా స్మగ్లింగ్ చేస్తున్న అంతర్రాష్ట్ర నెట్‌వర్క్‌ను ఈగల్ ఛేదించింది. అరకు ప్రాంతంలో స్వీటు షాపులు, ఐరన్‌మార్ట్ వ్యాపారాల మాటున తమిళనాడు, రాజస్థాన్ రాష్ట్రాలకు చెందిన స్మగ్లర్లు గంజాయి రవాణా చేస్తున్నట్టు గుర్తించింది. వరుస దాడులతో స్మగ్లర్లు రాష్ట్రం నుంచి పారిపోయారు.
(అమరావతి/పాడేరు-ఆంధ్రజ్యోతి)
ఏడాదిన్నర క్రితం వరకూ దేశంలో ఎక్కడ గంజాయి పట్టుబడినా ఆంధ్రప్రదేశ్ పేరే వినిపించేది. గత వైసీపీ ప్రభుత్వంలో విశాఖ మన్యంలో వేలాది ఎకరాల్లో గంజాయి సాగయ్యేది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గంజాయి కట్టడిపై ప్రత్యేక దృష్టి సారించింది. గిరిజన ప్రాంతంలో గంజాయి సాగు, రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు ఈగల్ బృందాలు, పోలీసులు పలు చర్యలు చేపట్టారు. మారుమూల ప్రాంతాల్లో గంజాయి తోటలను డ్రోన్‌ల ద్వారా గుర్తించడం, వాటిని ప్రత్యేక పోలీస్ బృందాలతో ధ్వంసం చేయడం, మరోవైపు అల్లూరి జిల్లావ్యాప్తంగా వాహనాల తనిఖీలను ముమ్మరం చేసి రవాణాకు అడ్డుకట్ట వేయడం, బాధ్యులపై కేసులు నమోదు చేయడం వంటి చర్యలు తీసుకున్నారు.
మరోవైపు గంజాయి సాగు, రవాణా వల్ల కలిగే నష్టాలపై గిరిజన రైతులు, స్థానికులు, విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. గంజాయి సాగు, రవాణా జోలికి వెళ్లేందుకు భయపడే వాతావరణాన్ని సృష్టించారు. అలాగే పోలీస్ స్టేషన్ల స్థాయిలో స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, గ్రామపెద్దలు, రైతులతో ‘పరివర్తన’ పేరిట పోలీసులు సమావేశాలు నిర్వహించారు. గంజాయి జోలికి వెళ్లవద్దని, ప్రత్యామ్నాయ పంటల సాగు చేపట్టాలని సూచించారు. గిరిజన రైతులకు సిల్వర్ ఓక్, సీతాఫలం, జీడిమామిడి, అవకాడో, మెరింగా, డ్రాగన్ ఫ్రూట్, మామిడి వంటి మొక్కలు సుమారు 3,86,772 పంపిణీ చేశారు. వాటిని నాటుకుని పెంచుకునేందుకు జాతీయ ఉపాధి హామీ పథకంలో పనిదినాలు కల్పిస్తున్నారు. మరోవైపు మైదాన ప్రాంతంలో గంజాయి రవాణాను కట్టడి చేయడానికి తనిఖీలు ముమ్మరం చేశారు.
ఐజీ నేతృత్వంలో ఈగల్
కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రవ్యాప్తంగా గంజాయి కట్టడికి ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్(ఈగల్)ను ఏర్పాటు చేసింది. ఐజీ ర్యాంకు అధికారి ఆకే రవికృష్ణ నేతృత్వంలో 459 మంది పోలీసు అధికారులు, సిబ్బందిని వివిధ వింగ్‌ల నుంచి డిప్యూటేషన్‌పై అందులో నియమించింది. రాష్ట్రంలోని 26 జిల్లాల్లోనూ ఈగల్ నార్కోటిక్ కేంద్రాలు ఏర్పాటు చేసి కార్యాచరణ మొదలు పెట్టింది. స్థానిక పోలీసులతో సమన్వయం చేసుకుని గంజాయి సాగు, రవాణా కట్టడికి చర్యలు చేపట్టింది. ఐజీ రవికృష్ణ పలుమార్లు మన్యాన్ని సందర్శించారు. ఆయన స్వయంగా గంజాయి తోటలు దహనం చేసిన సందర్భాలున్నాయి. డ్రోన్లతో పాటు శాటిలైట్ ఇమేజ్ ద్వారా ఏవోబీ మొత్తాన్ని ఈగల్ డేగ కళ్లతో పర్యవేక్షిస్తోంది. దాదాపు 97 మంది స్మగ్లర్లు జైలుపాలయ్యారు. ఈ ఏడాది సెప్టెంబరు నాటికి రాష్ట్రంలో గంజాయి సాగు జీరోకు తెచ్చేశామని పోలీసులు, ఈగల్ బృందాలు చెబుతున్నారు. ఇటీవల ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నేతృత్వంలో జరిగిన 12 రాష్ట్రాల ఏఎన్‌టీఎఫ్ సమన్వయ సమావేశంలో నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో(ఎన్‌సీబీ) శాటిలైట్ ద్వారా పరిశీలించి ఈ విషయాన్ని నిర్ధారించింది. ఇదే సమయంలో పొరుగున ఉన్న ఒడిశా రాష్ట్రంలో విచ్చలవిడిగా సాగు చేస్తున్నారు. అక్కడ దాదాపు 5 వేల ఎకరాల్లో సాగు చేస్తున్నట్టు అంచనా. అక్కడి నుంచి గంజాయిని ఆంధ్రప్రదేశ్ మీదుగా ఇతర రాష్ట్రాలకు రవాణా చేస్తున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో గంజాయి పట్టుబడుతోంది.
ఒడిశా నుంచి రవాణా
ఒడిశా సరిహద్దు మండలాలైన జీకే వీధి, జి.మాడుగుల, పెదబయలు, ముంచంగిపుట్టు ప్రాంతాల ద్వారా అల్లూరి సీతారామరాజు జిల్లాలోకి అక్రమంగా గంజాయి రవాణా అవుతున్నట్లు స్థానిక పోలీసులు, ఈగల్ బృందాల తనిఖీల్లో బయటపడింది. ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణ అధికారులతో సమీక్షించి, మూలాల్లో నుంచి సమాచార సేకరణకు ఉపక్రమించారు. అరకు ప్రాంతంలో రాజస్థాన్‌కు చెందిన వ్యక్తుల స్వీటు షాపులు, తమిళనాడుకు చెందిన వారి హార్డ్‌వేర్ షాపుల్లో ఏదో తేడా జరుగుతోందని ఇద్దరు కానిస్టేబుళ్లు సమాచారం సేకరించారు. రోజుల తరబడి స్వీటు, హార్డ్‌వేర్ షాపులపై ఆయన నిఘా పెట్టించారు. అరకులో ఒక స్వీటు షాపు ముందు ఆగిన ఇన్నోవా కారు(ఆర్‌జే50 యూఏ4616)ను గుర్తించిన కానిస్టేబుల్ దానిపై ఆన్ గవర్నమెంట్ డ్యూటీ అని ఉండటాన్ని గమనించారు. లోపల పోలీసు యూనిఫామ్ చూసి అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నతాధికారులకు సమాచారం చేరవేశారు. వెంటనే రంగంలోకి దిగిన ఈగల్ బృందాలు ఆ కారును అనుసరించాయి. విజయనగరం మీదుగా వెళుతుండటంతో జొన్నాడ టోల్ ప్లాజా దగ్గర ఆపి తనిఖీ చేయాలని అక్కడి ఈగల్ బృందాలకు సమాచారం ఇచ్చారు. అక్కడ పోలీసులు ఆపగానే అనుమానం వచ్చిన కారు డ్రైవర్ వేగంగా పారిపోయాడు. కిర్లంపూడి పోలీసులు కృష్ణవరం టోల్ ప్లాజా వద్ద బారికేడ్లతో ఆ కారును అడ్డుకున్నారు. డ్రైవర్ వేగంగా యూ టర్న్ తీసుకుని పారిపోయేందుకు ప్రయత్నించగా పోలీసులు వెంబడించారు. ఆ సమయంలో ఒక సెల్‌ఫోన్, రెండు చాక్లెట్(కిట్ కిట్) కవర్లు కింద పడ్డాయి. మారుమూల ప్రాంతంలో కారు వదిలేసి అందులో ఉన్న మహిళతో సహా డ్రైవర్ పరారయ్యాడు. కేసు నమోదు చేసిన కిర్లంపూడి పోలీసులు కారు నంబర్‌తో పాటు లభించిన సెల్ ఫోన్ నంబర్ ఆధారంగా డ్రైవర్‌ను రాజస్థాన్‌కు చెందిన శర్వన్‌లాల్ యాదవ్‌గా గుర్తించారు.
15,340 కిలోల గంజాయి స్వాధీనం
గత ఏడాది జూలై నుంచి ఈ ఏడాది సెప్టెంబరు వరకూ అల్లూరి సీతారామరాజు జిల్లావ్యాప్తంగా 246 కేసులు నమోదు చేసి 15,340 కిలోల గంజాయి, 52 లీటర్ల గంజాయి లిక్విడ్‌ను స్వాధీనం చేసుకున్నారు. 630 మందిని అరెస్టు చేశారు. అలాగే గంజాయి రవాణాకు వినియోగించిన 30 కార్లు, 140 బైక్‌లు, 32 ఆటోలు, 6 భారీ వాహనాలను సీజ్ చేశారు. గంజాయి కేసుల్లో నిందితులుగా ఉంటూ తప్పించుకు తిరుగుతున్న 195 మందిని అరెస్టు చేశారు.
వరుస దాడులతో పరారు
ఈగల్ పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేయడంతో అప్పటికే అనకాపల్లి జిల్లాలో శర్వన్‌లాల్ యాదవ్‌పై రెండు కేసులు నమోదైనట్లు తేలింది. స్వీటు షాపు తనిఖీ చేయగా చాక్లెట్ కవర్లలో ప్యాక్ చేసిన గంజాయి వందల కిలోలు దొరికింది. ఒడిశాలోని కోరాపుట్ నుంచి గంజాయి తీసుకొచ్చిన స్మగ్లర్లు.. పోలీసులు, ఈగల్ బృందాలకు చిక్కకుండా ఉండేందుకు స్వీట్లు, చాక్లెట్ కవర్ల ప్యాకింగ్‌తో కొత్త ఎత్తుగడ వేస్తున్నట్లు తెలుసుకున్నారు. రాజస్థాన్, తమిళనాడుకు చెందిన స్మగ్లర్లు గంజాయి స్మగ్లింగ్‌కు అడ్డాగా అరకు ప్రాంతంలో స్వీటు షాపులు, ఐరన్ మార్ట్‌లు పెట్టుకున్నట్లు గుర్తించారు. ఆ రెండు రాష్ట్రాలకు చెందిన 265 మందికి పైగా స్వీటు, హార్డ్ వేర్ వ్యాపారులు(గంజాయి స్మగ్లర్లు) అల్లూరి జిల్లా వదిలి పరారయ్యారు. పోలీసుల వద్ద ఉన్న సమాచారం మేరకు తమిళనాడు, రాజస్థాన్‌తో పాటు 12రాష్ట్రాలకు చెందిన 350 మందికి పైగా స్మగ్లర్లు టీ కొట్టు, కిరాణా వ్యాపారాల పేరుతో మకాం వేయడంతో పాటు సీలేరు ప్రాంతంలో కూలీలుగానూ ఉండేవారు. స్మగ్లర్లలో అల్లూరి జిల్లాకు చెందినవారు కూడా కొందరు ఉన్నారు.

పోలీసు, ఈగల్ ఉమ్మడి చర్యలు: డీజీపీ
గంజాయి సాగు కట్టడికి ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని.. పోలీసు, ఎక్సైజ్ శాఖల సమన్వయంతో ఈగల్ ప్రత్యేక ప్రణాళికతో ఉక్కుపాదం మోపుతోందని డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా తెలిపారు. బస్తర్‌లో ఆపరేషన్ కగార్ విజయం సాధించే నాటికి ఏపీలో గంజాయి వాసన లేకుండా చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. పొరుగు రాష్ట్రాల నుంచి ఏపీ మీదుగా గంజాయి సరఫరా అవుతోందని, పూర్తిగా కట్టడి చేసేందుకు ఒడిశాతో నిరంతరం సమన్వయం చేసుకుంటున్నట్లు చెప్పారు. స్మగ్లర్లపై ఎన్‌డీపీఎస్ కింద కేసులు నమోదు చేసి, ఆస్తులు జప్తు చేస్తున్నామని తెలిపారు. ఈ ఏడాదిలోనే 130 మందికి పైగా అరెస్టు చేశామని, కరుడు గట్టిన స్మగ్లర్లపై పీడీ యాక్టు నమోదు చేసినట్లు తెలిపారు. మత్తుకు అందరూ దూరంగా ఉండాలని, ఎటువంటి సమాచారం తెలిసినా పోలీసులకు చెప్పాలని డీజీపీ సూచించారు.
