Share News

Housing Aid For Poor Families: పేదింటికి కూటమి వరం!

ABN , Publish Date - Sep 17 , 2025 | 04:31 AM

రాష్ట్రంలోని అర్హులైన పేదలందరికీ నాణ్యమైన ఇళ్లు కట్టిస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీ అమలుకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది...

Housing Aid For Poor Families: పేదింటికి కూటమి వరం!

  • పేదింటికి కూటమి వరంఒక్కో ఇంటికి రూ.2.5 లక్షల రాయితీ

  • పేదల ఇళ్ల యూనిట్‌ వ్యయం పెంపు

  • పీఎంఏవై 2.0 అమలుకు గ్రీన్‌సిగ్నల్‌

అమరావతి, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని అర్హులైన పేదలందరికీ నాణ్యమైన ఇళ్లు కట్టిస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీ అమలుకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గత వైసీపీ ప్రభుత్వం పేదల ఇళ్ల యూనిట్‌ వ్యయాన్ని రూ.1.80 లక్షలకు కుదించడంతో ఆ ఐదేళ్లూ పేదల ఇళ్ల నిర్మాణ కార్యక్రమం ముందుకు సాగలేదు. పేదల సొంతింటి కల కలగానే మిగిలిపోయింది. దీంతో గత ప్రభుత్వం హయాంలో అసంపూర్తిగా నిలిచిపోయిన ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసి లబ్ధిదారులకు అందించేందుకు చర్యలు చేపట్టాలని గృహనిర్మాణశాఖ అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఇదే సమయంలో కేంద్రం తాజాగా ప్రారంభించిన ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన (పీఎంఏవై-అర్బన్‌) 2.0 పథకాన్ని సద్వినియోగం చేసుకుంటూ.. రాష్ట్రంలో కొత్తగా మంజూరు చేసే ఇళ్లకు యూనిట్‌ వ్యయాన్ని రూ.2.50 లక్షలకు పెంచారు.

ఇందులో కేంద్ర రాయితీ వాటా గతంలో మాదిరిగానే రూ.1.50 లక్షలు కాగా.. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కింద మరో లక్ష రూపాయలు జత చేసింది. దీనికి అదనంగా ఉపాధి హామీ పథకం కింద లబ్ధిదారులకు 90 రోజులకు రూ.39 వేల కన్వర్జెన్స్‌ నిధులు జమ కానున్నాయి. దీంతో దాదాపుగా లబ్ధిదారులకు రూ.2.90 లక్షల వరకు ప్రభుత్వ రాయితీగా లభించనుంది. ఇంటిని పూర్తి చేయడానికి ఇంకా అవసరమయ్యే నిధులను లబ్ధిదారులు భరించాల్సి ఉంటుంది. రాష్ట్రంలో పీఎంఏవై-అర్బన్‌ 2.0 అమలుకు రాష్ట్ర ప్రభుత్వం.. కేంద్రంతో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) చేసుకుంది. దీంతో కేంద్ర ప్రభుత్వం పీఎంఏవై 2.0 పథకం కింద రాష్ట్రానికి తొలివిడతగా 40,410 ఇళ్లు మంజూరు మంజూరు చేసింది. మొత్తం రూ.1010.25 కోట్లతో ఈ ప్రాజెక్టు అమలుకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2029 నాటికి రాష్ట్రంలో అర్హులైన ప్రతి పేద కుటుంబానికీ నాణ్యమైన పక్కా ఇల్లు కట్టించి ఇచ్చే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.

Updated Date - Sep 17 , 2025 | 09:51 AM