Minister Nimmala Ramanaidu: సీఎంలు మాట్లాడుకుంటే మేలు!
ABN , Publish Date - Nov 29 , 2025 | 04:39 AM
కర్ణాటక సరిహద్దులో మంత్రాలయానికి సమీపాన బ్రిడ్జ్ కమ్ బ్యారేజీల నిర్మాణంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయమే ఫైనల్ అని జల వనరుల మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు...
మంత్రాలయం వద్ద బ్యారేజీల నిర్మాణంపై కర్ణాటక మంత్రికి నిమ్మల స్పష్టీకరణ
అమరావతి, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): కర్ణాటక సరిహద్దులో మంత్రాలయానికి సమీపాన బ్రిడ్జ్ కమ్ బ్యారేజీల నిర్మాణంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయమే ఫైనల్ అని జల వనరుల మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. సున్నితమైన అంశమైనందున ఈ వ్యవహారంలో ఉభయ రాష్ట్రాల సీఎంలు మాట్లాడుకుంటే మంచిదని సూచించారు. కర్ణాటక చిన్నతరహా నీటివనరుల మంత్రి ఎన్‌ఎ్‌స బోస్‌రాజ్ శుక్రవారం వెలగపూడి సచివాలయంలో నిమ్మలతో సమావేశమయ్యారు. ఆంధ్ర-కర్ణాటక సరిహద్దులో చిలకలపర్వి- కుంబళూరు మధ్య, చిన్నమంచాల- మంత్రాలయం మద్య రెండు బ్రిడ్జి కమ్ బ్యారేజీల నిర్మాణానికి ఆమోదం తెలపాలని కోరారు. సాగునీటి ప్రాజెక్టులు, నదీ జలాల వాడకంపై ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటారని నిమ్మల ఆయనకు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రుల స్థాయిలో సంప్రదింపులు జరపడం మంచిదన్నారు. అదేవిధంగా తుంగభద్ర డ్యాం గేట్ల మార్పిడి కోసం ఆంధ్రప్రదేశ్ తరఫున రూ.54 కోట్లు కేటాయించామని, వాటిలో ఇప్పటికే 29 కోట్లు విడుదల చేశామని తెలిపారు.