Share News

CM Chandrababu Naidu: కేంద్ర నిధుల్ని ఖర్చు చేయలేరా?

ABN , Publish Date - Dec 11 , 2025 | 04:01 AM

స్పర్స్‌, ఎస్‌ఎన్‌ఏ (సింగిల్‌ నోడల్‌ ఏజెన్సీ) ఖాతాల్లోని రూ.1,220 కోట్ల నిధులను ఈ నెల చివరి నాటికి ఖర్చు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు...

CM Chandrababu Naidu: కేంద్ర నిధుల్ని ఖర్చు చేయలేరా?

  • మురిగిపోయే పరిస్థితి రానీయొద్దు

  • డెడ్‌లైన్‌ పూర్తవ్వగానే శాఖలకు ఫోన్‌ చేస్తాం..

  • అప్పటికీ వాడకపోతే మీ జీతాల నుంచి కట్‌చేస్తా

  • కార్యదర్శులను హెచ్చరించిన చంద్రబాబు

అమరావతి, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి): ‘స్పర్స్‌’, ఎస్‌ఎన్‌ఏ (సింగిల్‌ నోడల్‌ ఏజెన్సీ) ఖాతాల్లోని రూ.1,220 కోట్ల నిధులను ఈ నెల చివరి నాటికి ఖర్చు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. కేంద్ర ప్రాయోజిత పథకాలపై (సీఎ్‌సఎస్‌) బుధవారం నిర్వహించిన సమీక్షలో భాగంగా ఆయన ఈ ఆదేశాలు జారీ చేశారు. వివిధ శాఖలు స్పర్స్‌లో ఉన్న రూ.955 కోట్లను, ఎస్‌ఎన్‌ఏలో ఉన్న రూ.265 కోట్లను వెంటనే ఖర్చు చేయాల్సి ఉందని, లేదంటే కేంద్రం ఈ నిధులు వెనక్కి ఇవ్వమని అడుగుతుందంటూ ఏపీ రెసిడెన్సియల్‌ కమిషనర్‌ ప్రవీణ్‌కుమార్‌, ఆర్థిక శాఖ కార్యదర్శి రోనాల్డ్‌ రోస్‌....సీఎం చంద్రబాబుకు నివేదించారు. దీనిపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘శాఖల్లో నిధులు ఖర్చు చేయకపోవడం ఏమిటి? ఇది సరికాదు.ఈ నెలాఖరులోగా మొత్తం రూ.1,220 కోట్ల నిధులు ఖర్చు చేసేయాల్సిందే’’ అంటూ వారికి సృష్టం చేశారు. దీనిపై తక్షణం సమీక్ష జరపాల్సిందిగా అదే సమావేశంలో సీఎస్‌ విజయానంద్‌ను ఆదేశించారు. ‘‘ఖర్చు చేయని శాఖకు ఆ రోజు ( డిసెంబరు చివరిరోజు) ఫోన్‌ చేస్తాం. మీరు (కార్యదర్శులను ఉద్దేశించి) ఖర్చు చేయకపోతే మీ జీతం నుంచి చెల్లించాల్సి వస్తుంది. పథకాల వారీగా సంబంధిత మంత్రి, కార్యదర్శి, హెచ్‌వోడీలకు ఈ నిధుల విషయమై ఆర్థిక శాఖ సమాచారం అందించాలి.’’ అని సీఎం నిర్దేశించారు.

రియల్‌ టైమ్‌లో జనగణన

ఎప్పుడో పదేళ్లకోసారి జనాభా లెక్కలు అనేది పాత పద్ధతి అని, టెక్నాలజీ పెరిగిన నేపథ్యంలో ఎప్పటికప్పుడు జనాభా లెక్కలు అప్‌డేట్‌ కావాలని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు. జనగణన రియల్‌టైమ్‌లో ఉండాలని స్పష్టంచేశారు. వచ్చే మార్చి నాటికి రాష్ట్రంలో జనగణన పూర్తిచేసి రికార్డులు అప్‌డేట్‌ చేయాలని, ఆ తర్వాత జాతీయ స్థాయిలో జరిగే జనగణన లెక్కలతో సరిపోల్చుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు. చంద్రబాబు ఇంకా ఏమన్నారంటే...

అందుకే గూగుల్‌ వచ్చింది..

‘‘మనం టెక్నాలజీ వినియోగంలో అప్‌డేట్‌గా ఉన్నాం. గ్రీన్‌ ఎనర్జీతో ఇంధన వినియోగంలో వ్యయం తగ్గించాం. ఈ కారణాలతోనే విశాఖకు 15 బిలియన్‌ డాలర్ల విలువైన గూగుల్‌ డేటా సెంటర్‌ వచ్చింది. ఏపీ ఒక్కటే త్రైమాసికం జీఎ్‌సడీపీ అంచనా వేస్తోంది. ఇకపై నెలవారీగా జీఎ్‌సడీపీ లెక్కలు తీయాలి. అంతిమంగా ప్రజలకు సుపరిపాలన అందివ్వాలి.’’


ప్రజలు ఎందుకు రావాలి?

‘‘ఇకపై ఫైళ్లు అన్నీ అనుసంధానం చేస్తాం. ప్రజలు ఆఫీసుల చుట్టూ ఎందుకు తిరగాలి? ఉదాహరణకు ఒక రిజిస్ర్టేషన్‌ జరిగిన తర్వాత మళ్లీ ఆ డాక్యుమెంట్ల కోసం ప్రజలు ఆఫీసుకు రాకూడదు. పోస్ట్‌ ద్వారా మనమే వాటిని ఇంటికి పంపాలి. గ్రామ, వార్డు సచివాలయాల పేరు కూడా మారుస్తాం. మంచి పేరు పెడతాం. ఆ వ్యవస్థను ఇప్పటికే గాడిన పెట్టాం.’’

రుణ భారం పెరిగింది

‘‘రుణం భారంగా మారింది. మొత్తం రుణాలు రీషెడ్యూలు చేస్తున్నాం. వైసీపీ వల్ల ఏపీ బ్రాండ్‌ దెబ్బతింది. అభివృద్ధి ఆగింది. ఆదాయం తగ్గింది. దీంతో అప్పులు ఇచ్చేవారు వడ్డీ రేట్లు పెంచారు. క్రెడిట్‌ ర్యాంకింగ్‌ బాగుంటే తక్కువ వడ్డీ రేట్లకు రుణాలు వస్తాయి. సంక్షేమంతో పాటు అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చాం. కానీ ఆర్థిక శాఖ ఎప్పుడూ డబ్బుల్లేవంటుంది. దాన్ని అధిగమించి ముందుకెళ్లాలి.’’

విశ్వసనీయతకు మా నాన్న ఒక ఉదాహరణ

‘‘గత ప్రభుత్వం వల్ల ఏపీ బ్రాండ్‌ దెబ్బతింది. ఒక వ్యక్తి ప్రవర్తన వల్ల పరపతి పెరుగుతుంది. నా చిన్నప్పుడు మా ఊర్లో వారంతా వారి డబ్బు తీసుకొచ్చి మా నాన్న వద్ద దాచి పెట్టుకునేవారు. వారికి అవసరమైనప్పుడు తిరిగి తీసుకెళ్లేవారు. విశ్వసనీయతకు ఇదొక ఉదాహరణ. విశాఖపట్నం భాగస్వామ్య సదస్సు ద్వారా రాష్ర్టానికి రూ.13.26లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 45 రోజుల్లో ఆ పనులు ప్రారంభిస్తాం.’’

అందరి పనితీరు నా వద్ద ఉంది

‘‘అధికారులు నన్ను పొరపాటుగా అనుకోవద్దు. నాతో సహా అందరి పనితీరు సమాచారం నా దగ్గర ఉంది. సరైనవారు సరైన స్థానాల్లో ఉండాలి. ఉంటే సరిపోదు. సరైన ఫలితాలూ సాధించాలి. నేను తొలిసారి సీఎం అయ్యేనాటికి అనేక సమస్యలుండేవి. ముఖ్యంగా అనంతపురంలో నీరు ఉండేది కాదు. ఆంధ్రా ప్రాంతం నుంచి గడ్డి, తాగునీరు పశువులకు పంపేవాళ్లం. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది.’’


నెగిటివ్‌కు అలవాటు పడ్డారు

‘‘కొందరు అధికారులు ప్రతికూల ఆలోచనలు చేయడానికి అలవాటు పడ్డారు. దేవదాయశాఖ, రెవెన్యూ శాఖలు ఇప్పటికీ పుంజుకోలేదు. టీటీడీ పనితీరు మెరుగుపడుతున్నా దేవదాయశాఖ పనితీరు సరిగా లేదు. జనవరి 15వ తేదీ డెడ్‌లైన్‌. అన్ని శాఖలు వారి సేవలు ఆన్‌లైన్‌ చేయాలి.’’

అనర్హులకు రాకూడదు... అర్హులకు ఆగకూడదు

‘‘సంక్షేమం అర్హులకే అందాలి. గతంలో కొన్ని చోట్ల దివ్యాంగులు కాకపోయినా వారికి పీహెచ్‌ కోటా పెన్షన్లు ఇచ్చారు. అనర్హులకు సంక్షేమ పథకాలు వెళ్లకూడదు. అలాగే అర్హులకు ఆగకూడదు.’’

మన్యం కలెక్టర్‌ ఆలోచన బాగుంది

‘‘కొన్నిసార్లు చిన్న పనులు మంచి ఫలితాలనిస్తాయి. పార్వతీపురం మన్యం కలెక్టర్‌ ‘ముస్తాబు’ అనే కార్యక్రమం గిరిజన పాఠశాలల్లో అమలుచేస్తున్నారు. ప్రతి పాఠశాలకు అద్దం, దువ్వెన ఇచ్చారు. ప్రతి తరగతికి ఇద్దరు లీడర్లు ఉంటారు. వారు విద్యార్థులను తల దువ్వుకున్నారా? ముఖం కడుక్కున్నారా? యూనిఫాం, షూ శుభ్రంగా ఉన్నాయా? అని పరిశీలించి బాగుంటేనే తరగతి గదిలోకి అనుమతిస్తున్నారు. లేకపోతే వారే అవన్నీ సరిచేస్తున్నారు. ఇందులో రూపాయి ఖర్చు లేదు. కలెక్టర్‌ పెట్టిన కార్యక్రమం బాగుంది.’’

ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్న టాప్‌-10 శాఖలు ఇవే...

రెవెన్యూ, పోలీసు, పురపాలక శాఖ, పంచాయతీరాజ్‌, పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌, పౌరసరఫరాలు, గృహనిర్మాణ కార్పొరేషన్‌, పాఠశాల విద్య, సెర్ప్‌

సుస్థిరాభివృద్ధి సాధన లక్ష్యాలలో...

ఏ+ కేటగిరి (90శాతం పైన): విద్యుత్‌, మౌలిక సదుపాయాలు, వ్యవసాయం, పౌర సరఫరాలు, మహిళా శిశు సంక్షేమాభివృద్ధి

ఏ కేటగిరీ (75 శాతం పైన): వైద్య ఆరోగ్యం, రెవెన్యూ, సెకండరీ ఎడ్యుకేషన్‌, ప్రణాళిక శాఖ, ఆర్థిక శాఖ, పర్యావరణ అటవీ శాఖ, పట్టణాభివృద్ధి శాఖ.

బి కేటగిరీ (60 శాతం పైన): ఉన్నత విద్య 74, పంచాయతీరాజ్‌, హోంశాఖ

సి కేటగిరీ: పరిశ్రమలు, సచివాలయాల శాఖ

ప్రజలకు నచ్చినవి

ప్రజలకు నచ్చిన వాటిలో సుపరిపాలన టాప్‌లో ఉంది. మంచి రోడ్లు, మెరుగైన అభివృద్ధి, ధరల నియంత్రణ, మెరుగైన ఆర్థిక వృద్ధి, అవినీతి నియంత్రణ, తాగునీటి సరఫరా, వైద్యం, పెట్టుబడులు, రాజధాని, ఆలయాల్లో పనితీరు, విద్య, పోలవరం, ఉపాధి కల్పన... ప్రజలకు నచ్చాయి.

నచ్చనివి...

బియ్యం ధరల పెరుగుదల, రైతుల అసంతృప్తి, అభివృద్ధి లేమి, రోడ్లు, నిరుద్యోగం, తాగునీటి సమస్యలు, పరిపాలనలో లోపాలు, అవినీతి పెరగడం, బలహీనమైన ఆర్థిక వృద్ధి ప్రజలకు నచ్చలేదు.

Updated Date - Dec 11 , 2025 | 04:01 AM