CM Stresses Water Conservation: ప్రతి నీటి బొట్టునూ సంరక్షించాలి
ABN , Publish Date - Aug 15 , 2025 | 05:09 AM
ప్రతి నీటి బొట్టునూ సంరక్షించాలని, నీటి వనరుల సంరక్షణతోనే భూగర్భ జల మట్టాలు పెరుగుతాయని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు..
నీటి వనరులతో భూగర్భ జలాలు పెరుగుతాయి
జల నిర్వహణపై జిల్లాలవారీగా రేటింగ్ ఇస్తాం: సీఎం
అమరావతి, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): ప్రతి నీటి బొట్టునూ సంరక్షించాలని, నీటి వనరుల సంరక్షణతోనే భూగర్భ జల మట్టాలు పెరుగుతాయని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. నీటి సంరక్షణలో సాగునీటి సంఘాల భాగస్వామ్యం ఉండాలని స్పష్టం చేశారు. సాగునీటి శాఖలో ఇంజనీరింగ్ వ్యవస్థను పటిష్ఠపరుస్తామని ప్రకటించారు. నీటిని ఒడిసి పట్టి ప్రాజెక్టులు నింపాలని అధికారులను ఆదేశించారు. వెలగపూడి సచివాలయం నుంచి సాగునీటి సంఘాలు, జిల్లా కలెక్టర్లు, అధికారులతో సీఎం చంద్రబాబు గురువారం వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. పాలకొల్లు నుంచి మంత్రి నిమ్మల రామానాయుడు వర్చువల్‌గా పాల్గొన్నారు. సమర్థ నీటి నిర్వహణతో రాష్ట్రంలోని ప్రాజెక్టుల్లో నీటిని నిల్వ చేసుకోగలిగామని సీఎం పేర్కొన్నారు. ఈ సందర్భంగా జల వనరుల శాఖను అభినందించారు. రిజర్వాయర్లు, బ్యారేజీల్లో మొత్తంగా 82.29 శాతం మేర నింపుకోగలిగామని సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు. ఇకపై వెలుగోడు, ఉత్తరాంధ్ర, గాలేరు నగరి సుజల స్రవంతి ప్రాజెక్టులపై దృష్టి సారించి పూర్తి చేయాలని జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్‌ను ఆదేశించారు. సాగునీటి కాలువలను సంరక్షించుకోవాలని సూచించారు. ఇందుకోసమే సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్యపై దృష్టి సారించామని సీఎం వెల్లడించారు.
చిన్న తరహా చెరువుల ద్వారా నీటి నిల్వ
ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నా.. రాష్ట్రంలో 17శాతం వర్షపాతం లోటు ఉందని చంద్రబాబు చెప్పారు. ఈ పరిస్థితుల్లో నీటిని సంరక్షించుకోవడంపై దృష్టి సారించాలన్నారు. మొత్తంగా 38 చిన్నతరహా చెరువుల ద్వారా భారీగా నీటి నిల్వలను పెంచుకోవచ్చని సీఎం చెప్పారు. నీటి నిర్వహణపై జిల్లాల వారీగా రేటింగ్ ఇస్తామని ప్రకటించారు. సాగునీటి యాజమాన్య సంఘాలకు ఆయకట్టు ప్రాంతాలే కాకుండా క్యాచ్‌మెంట్ ఏరియాల్లోనూ బాధ్యతలు అప్పగిస్తామన్నారు. రానున్న 16 రోజుల్లోగా చెరువులు, కాలువలు, చెక్‌డ్యామ్‌ల మరమ్మతులు పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. భూగర్భజలాల పెంపుతో అద్భుత ఫలితాలు వస్తాయని, భూగర్భాన్నే ఒక జలాశయంగా మార్చుకోవాలన్నా రు. రాష్ట్రంలో 40 లక్షల ఎకరాల్లో బోరుబావుల మీద ఆధారపడి పంటలు పండిస్తున్నారని అన్నారు. వర్షాకాలం తర్వాత కూడా 8 మీటర్లకు తగ్గకుండా భూగర్భజలాలు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.