ఉల్లి రైతుల కష్టాలపై స్పందించిన సీఎం
ABN , Publish Date - Aug 29 , 2025 | 11:37 PM
ఉమ్మడి జిల్లాలో ఉల్లి రైతుల కష్టాలపై ‘ఆంధ్రజ్యోతి’లో వస్తున్న కథనాలపై సీఎం చంద్రబాబు స్పందించారు.
అమరావతిలో ఉన్నతాధికారులతో సమీక్ష
కర్నూలు అగ్రికల్చర్, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి జిల్లాలో ఉల్లి రైతుల కష్టాలపై ‘ఆంధ్రజ్యోతి’లో వస్తున్న కథనాలపై సీఎం చంద్రబాబు స్పందించారు. తక్షణమే ఉల్లి రైతును ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలని కీలక నిర్ణయం తీసుకున్నారు. క్వింటం ఉల్లిని రూ.1,200కు చెల్లించి ఆదుకోవాలని అధికారులను ఆదేశించారు. ఉల్లి రైతుల పరిస్థితి, ఉల్లి ధరలు, నిల్వలు ఉమ్మడి జిల్లాలో ఏ విదంగా ఉన్నాయో అనే అంశంపై సీఎం చంద్రబాబు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకు ఉల్లి పంటకు సంబంధించిన క్రయ విక్రయాలపై చర్చించారు. ఉల్లి పంట దెబ్బతిన్న కారణంగా మహారాష్ట్రలో ఉల్లి పంట ఎక్కువగా ఉన్నందు వలన ధరల విషయంలో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రత్యేక కార్యదర్శి రాజశేఖర్, మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ విజయ సునీత ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. రానున్న పది రోజుల్లో 5వేల మెట్రిక్ టన్నుల ఉల్లి పంట కర్నూలు యార్డుకు వచ్చే అవకాశం ఉందని సీఎంకు వారు వివరించినట్లు జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారులు తెలిపారు. శనివారం నుంచి కర్నూలు మార్కెట్ యార్డులో రైతులతో క్వింటం ఉల్లిని రూ.1200కు కొనుగోలు చేయాలని సీఎం ఆదేశించారు.