CM Pushkar Singh Dhami: అభివృద్ధిలో ఏపీ పరుగులు
ABN , Publish Date - Dec 15 , 2025 | 04:19 AM
మాజీ ప్రధాని వాజపేయి నిష్కళంక నేత, అభివృద్ధి ప్రధాత అని, ఆయన రాజకీయ జీవితం భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిదాయకమని ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ అన్నారు.
మోదీ, చంద్రబాబు, పవన్ సారథ్యంలో మున్ముందుకు
ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ
మదనపల్లె, రేణిగుంటల్లో మాజీ ప్రధాని వాజపేయి విగ్రహావిష్కరణ
మదనపల్లె/తిరుపతి(విద్య)/తిరుమల, డిసెంబరు 14(ఆంధ్రజ్యోతి): మాజీ ప్రధాని వాజపేయి నిష్కళంక నేత, అభివృద్ధి ప్రధాత అని, ఆయన రాజకీయ జీవితం భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిదాయకమని ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ అన్నారు. ఆదివారం రాష్ట్రానికి వచ్చిన ఆయన అన్నమయ్య జిల్లా మదనపల్లె, తిరుపతి జిల్లా రేణిగుంట మండలం మర్రిగుంట కూడళ్లలో ఏర్పాటు చేసిన దివంగత ప్రధాని వాజపేయి విగ్రహాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశాల్లో ధామీ మాట్లాడుతూ ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సారథ్యంలో ఏపీ అన్ని విధాలా అభివృద్ధి చెందుతోందని పేర్కొన్నారు. పోలవరం, అమరావతి నిర్మాణంతో పాటు గూగుల్ డేటా సెంటర్, తదితర పరిశ్రమలు వస్తున్నాయని, ఇందుకు కేంద్రం సంపూర్ణ సహకారం అందిస్తున్నట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వంలో పేదల సంక్షేమం, అభివృద్ధి దిశగా అడుగులు పడుతున్నాయని, దీంతో పేదల జీవన ప్రమాణాల పెంపుతో పాటు వారి ఆర్థిక స్థితిగతుల్లో మార్పు వస్తుందని చెప్పారు. ‘దేవభూమి ఉత్తరాఖండ్ నుంచి విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ నడయాడిన పుణ్యభూమి మదనపల్లెకు రావడం నా అదృష్టంగా భావిస్తున్నా.. జాతీయ గీతం జనగణమనను బెంగాలీ నుంచి ఆంగ్లంలోకి అనువదించిన రవీంద్రునికి, అందుకు వేదికైన మదనపల్లెకు నమస్కారం చేస్తున్నా’ అని వ్యాఖ్యానించారు.
మాజీ సీఎం ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ దేశ అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా వాజపేయి పనిచేశారని కొనియాడారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ మాట్లాడుతూ వాజ్‌పేయి ఆశయాలకు మోదీ కార్యరూపం ఇస్తున్నారని అన్నారు. పాలన, అభివృద్ధిలో వాజపేయి స్ఫూర్తి, ప్రేరణను భవిష్యత్తు తరాలకు అందించడానికేఅటల్-మోదీ సుపరిపాలన యాత్ర చేపట్టినట్లు పేర్కొన్నారు. అటల్ హయాంలో హైవేల నిర్మాణం, ఎయిర్‌పోర్టులు, టెలికాం, పోర్టుల కనెక్టివిటీతోనే దేశం అన్నివిధాలా అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఏర్పడిందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల్లో శాసనమండలి వైస్ చైర్‌పర్సన్, రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్, 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ తదితరులు పాల్గొన్నారు.
తిరుమలలో పుష్కర్ సింగ్ ధామీ
మదనపల్లె, రేణిగుంట కార్యక్రమాల అనంతరం ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి ఆదివారం రాత్రి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం బయట ఆయన మీడియాతో మాట్లాడారు. స్వామిని దర్శించుకొని ఆనందానికి లోనయ్యానన్నారు. టీటీడీ వ్యవస్థ అద్భుతంగా ఉందని, కొన్ని లక్షల మంది భక్తులు స్వామి దర్శనానికి వస్తున్నప్పటికీ.. టీటీడీ మంచి ఏర్పాట్లు చేస్తోందని ప్రశంసించారు. భారతదేశం విశ్వ గురువుగా ఆవిర్భవించే సమయం ఆసన్నమైందని, ప్రఽధాని మోదీ నాయకత్వంలో వికసిత్ భారత్ సంకల్పాన్ని తామంతా స్వీకరించామని పేర్కొన్నారు.