Share News

Guntur: సీఎం ప్రోగ్రాంకు దూరంగా ఉండండి

ABN , Publish Date - Nov 08 , 2025 | 06:11 AM

ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఇన్‌చార్జి వీసీ శారదా జయలక్ష్మికి అధికారులు ఝలక్‌ ఇచ్చారు.

Guntur: సీఎం ప్రోగ్రాంకు దూరంగా ఉండండి

  • ఎన్జీ రంగా వర్సిటీ వీసీ, రిజిస్ట్రార్‌కు షాక్‌

గుంటూరు సిటీ, నవంబరు 7(ఆంధ్రజ్యోతి): ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఇన్‌చార్జి వీసీ శారదా జయలక్ష్మికి అధికారులు ఝలక్‌ ఇచ్చారు. ఎన్జీ రంగా 125వ జయంతి వేడుకలకు సీఎం చంద్రబాబు శుక్రవారం యూనివర్సిటీకి వచ్చిన సమయంలో ఆ కార్యక్రమానికి దూరంగా ఉండాలని ఆదేశించారు. దీంతో వీసీ అనుకూల వర్గం పూర్తిగా డీలా పడింది. మధ్యాహ్నం వరకు ఆమె వర్సిటీలోనే ఉన్నారు. ఆ సమయంలో కొందరు జిల్లా అధికారులు ఇన్‌చార్జి వీసీకి, రిజిస్ర్టార్‌కు ఫోన్‌చేసి సీఎం ఉన్నంతసేపూ ఆ కార్యక్రమానికి దూరంగా ఉండాలని చెప్పారు. అధికారుల సూచనతో వారిద్దరూ వర్సిటీ నుంచి వెళ్లిపోయారు. శారదా జయలక్ష్మిని వైసీపీ ప్రభుత్వం ఇన్‌చార్జి వీసీగా నియమించింది. అప్పటి నుంచి ఆమె అనేక అక్రమాలకు తెరలేపారన్న ఆరోపణలు ఉన్నాయి. వాటిపై వర్సిటీ అధికారులు కొందరు గవర్నర్‌కు ఫిర్యాదు చేయడంతో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. దీంతో వారిపై కోపం పెంచుకున్న ఇన్‌చార్జి వీసీ అప్పటి వరకు విధుల్లో ఉన్న రిజిస్ర్టార్‌తో పాటు మరికొందరు అధికారులను రాత్రికి రాత్రి మార్చివేశారు. తనపై ఫిర్యాదు చేసిన గిరిజన ప్రొఫెసర్‌పై ఒక కమిటీ వేసి వేధింపులకు గురిచేశారు. దీంతో బాధితుడు గుండెనొప్పి వచ్చి ఆస్పత్రిలో చేరారు. తనను వేధించిన వీసీ, రిజిస్ర్టార్‌, కమిటీ సభ్యులపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారాలను ప్రభుత్వం సీరియ్‌సగా తీసుకుంది. ఈ నేపథ్యంలోనే సీఎం కార్యక్రమానికి వీసీని, రిజిస్ర్టార్‌ను దూరంగా ఉండాలని జిల్లా అధికారులు ఆదేశించినట్లు సమాచారం.

Updated Date - Nov 08 , 2025 | 06:13 AM