CM Chandrababu Naidu: ప్రపంచ స్థాయికి క్వాంటమ్ వ్యాలీ
ABN , Publish Date - Dec 30 , 2025 | 05:04 AM
క్వాంటమ్ కంప్యూటింగ్‌లో అమరావతిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యమని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు దిశగా శరవేగంగా అడుగులు పడుతున్నాయని....
రాజధానిలో అంతర్జాతీయ కాన్ఫరెన్సులు
జనవరిలో క్వాంటమ్ కంప్యూటర్ పని ప్రారంభం
ప్రతి కోస్తా జిల్లాలో ఓడరేవు ప్రభుత్వ లక్ష్యం
2025లో సంతృప్తికరంగా ప్రభుత్వ పాలన
మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబు
అమరావతి, డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి): క్వాంటమ్ కంప్యూటింగ్‌లో అమరావతిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యమని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు దిశగా శరవేగంగా అడుగులు పడుతున్నాయని, నూతన సంవత్సరం తొలి నెలలోనే అమరావతిలో క్వాంటమ్ కంప్యూటర్ పనిచేయడం ప్రారంభిస్తుందని మంత్రివర్గ సహచరులకు వివరించారు. సోమవారం సచివాలయంలో జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఎజెండా అంశాలపై చర్చ తర్వాత సీఎం చంద్రబాబు పలు అంశాలపై మాట్లాడారు. ఐక్యరాజ్యసమితి 2025ను ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్వాంటమ్ సైన్స్ అండ్ టెక్నాలజీగా ప్రకటించిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. 2026లో అంతర్జాతీయ క్వాంటమ్ కంప్యూటింగ్ కాన్ఫరెన్సులకు, క్వాంటమ్ ఫెయిర్‌లకు అమరావతి వేదికగా నిలుస్తుందని, ఆ దిశగా రాజధానిని సన్నద్ధం చేస్తామని అన్నారు. ఇక రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పనకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రులకు స్పష్టం చేశారు. ఓడరేవులకు అనుకూలమైన మన రాష్ట్రంలో ప్రతి కోస్తా జిల్లాకు ఒక పోర్టు ఉండాలని ప్రభుత్వం కసరత్తు చేస్తోందన్నారు. ప్రస్తుతానికి పశ్చిమగోదావరి మినహా మిగిలిన అన్ని జిల్లాల్లో పోర్టులు ఏర్పాటు జరుగుతోందన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో పోర్టు ఏర్పాటుకు ఉన్న సమస్యలు ఏమిటో పరిశీలించాలని మంత్రి రామానాయుడిని, సీనియర్ ఐఏఎస్ అధికారి కృష్ణబాబును సీఎం ఆదేశించారు. అదే సమయంలో విమనాశ్రయాల అభివృద్ధి కూడా ఊపందుకోవాలని సూచించారు. కుప్పం, దగదర్తితో పాటు మరో రెండు ప్రాంతాల్లో విమానాశ్రయాల పనులు ఎంత వరకు వచ్చాయని అధికారులను అడిగి తెలుసుకున్నారు. దొనకొండ, బొబ్బిలి, నాగార్జునసాగర్ ప్రాంతాల్లో ఎయిర్ స్ట్రిప్స్ ఉన్నాయని, వాటిని కూడా అభివృద్ధి చేయాలన్నారు.
జిల్లాల మార్పులు చేర్పులపై..
రాయచోటిని జిల్లా కేంద్రంగా తీసి, మదనపల్లెను పెట్టాల్సిన అంశంపైనా క్యాబినెట్‌లో సుదీర్ఘ చర్చ నడిచింది. రాజంపేట వాసులు కడపలో, రైల్వే కోడూరు వాసులు తిరుపతిలో కలుస్తామని అనడంతో రాయచోటి ఒక్కటే మిగిలిపోయిందని, మరోవైపు రాయచోటి జిల్లా కేంద్రంగా ఉండాల్సిందేనని మంత్రి మండిపల్లి గట్టిగా అడుగుతున్నా ఏం చేయలేని పరిస్థితి ఏర్పడిందని సీఎం వ్యాఖ్యానించారు. ఒక్క నియోజకవర్గాన్ని జిల్లా కేంద్రంగా చేయలేం కదా అని సీఎం అన్నారు. అదే సమయంలో.. నెల్లూరు జిల్లాలో కొన్ని మార్పులను మంత్రి నారాయణ ప్రస్తావించారు. రెవెన్యూ డివిజన్ పరిధి ఒకలా.. పోలీసు సబ్ డివిజన్ పరిధి మరోలా ఉందని కాస్త మార్పులు చేర్పులు చేస్తే రెండింటి పరిధి ఒకేలా ఉండేలా చూడొచ్చని నారాయణ సూచించారు. ఇలాంటి అంశాలను మరోసారి చూద్దామని సీఎం పేర్కొన్నారు. ఆదోనిని రెండు మండలాల నుంచి మూడు మండలాలుగా చేయాలన్న డిమాండ్‌పైనా క్యాబినెట్‌లో చర్చ జరిగింది. అయితే ప్రస్తుతానికి రెండు మండలాలుగా కొనసాగించడానికి నిర్ణయించారు. అలాగే ఆదోని 1, 2 అని కాకుండా రెండు మండలాలకు రెండు పేర్లు ఉంటే బాగుంటుందని పయ్యావుల సూచించారు. అన్నీ చిన్న చిన్న పల్లెలే ఉండటం వల్ల ఏ పేరు పెట్టాలన్నది నిర్ణయించడం కష్టమైందని, అందుకే అలా చేశామని అధికారులు చెప్పారు.
అధికారుల ఆలస్యంపై సీఎం అసహనం
మంత్రి మండలి సమావేశానికి అధికారులందరూ నిర్ణీత సమయానికి హాజరవ్వాల్సిందేనని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. మున్సిపల్ అంశాలపై చర్చ సమయంలో సంబంధిత అధికారులు లేకపోవడంపై సీఎం అసహనం వ్యక్తం చేశారు. మున్సిపల్ సబ్జెక్ట్ ఆలస్యంగా వస్తుందనే ఉద్దేశంతో హాజరుకాకపోవడాన్ని తప్పుబట్టారు. ఇక పోలవరం మండలం లేకుండా పోలవరం జిల్లా ఏమిటని మంత్రి కందుల దుర్గేశ్ ప్రస్తావించడంతో.. నిర్వాసితులు ఉన్నారన్న ఉద్దేశంతో జిల్లాకు ఆ పేరు పెట్టాల్సి వచ్చిందని సీఎం వివరించారు. ఎన్టీఆర్ ఊరు లేకుండా ఎన్టీఆర్ జిల్లా అని పేరు పెట్టారు కదా, జిల్లాలకు ప్రముఖుల పేర్లను పెట్టడం అనేది వారిని గౌరవించుకోవడమే తప్ప లోతుగా ఆలోచన చేయాల్సిన అవసరం లేదని సీఎం అన్నారు.
2026 మరింత కలిసొస్తుంది
ఈ ఏడాదిలో ప్రభుత్వ పరంగా చాలా బాగా చేశామన్న సంతృప్తి ఉందని సీఎం అన్నారు. ప్రజలకు ఉపయోగపడే 23 పాలసీలను తీసుకొచ్చామని, సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ సమపాళ్లలో ముందుకు తీసుకెళ్లగలిగామని చెప్పారు. 2026 మరింత కలిసివస్తుందన్న నమ్మకం ఉందన్నారు. 2025లో ప్రభుత్వం సాధించిన విజయాలను మంత్రులకు సీఎం వివరించారు.
తల్లికి వందనం కింద 67.27 లక్షల మంది విద్యార్థులకు రూ.10,090 కోట్లు సాయం చేశాం
స్త్రీశక్తి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాలను ఆగస్టు 15న ప్రారంభిస్తే ఇప్పటి వరకు 3.25 కోట్ల ప్రయాణాలను మహిళలు ఉచితంగా చేశారు.
అన్నదాత సుఖీభవ కింద 46 లక్షల మంది రైతులకు రూ. 6,310 కోట్లు వారి ఖాతాల్లో జమ చేశాం.
దీపం-2 పథకాన్ని అమలు చేస్తున్నాం.
ఎన్టీఆర్ భరోసా పింఛన్లు కింద ఇప్పటి వరకు రూ.50 వేల కోట్ల పంపిణీ చేశాం.
మెగా డీఎస్సీ, కానిస్టేబుళ్ల నియామకాలు చేపట్టాం.
గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది విద్యుత్తుశాఖలో ట్రూడౌన్ విధానాన్ని తీసుకొచ్చాం.
వినియోగదారులపై విద్యుత్తు బిల్లుల భారాన్ని సుమారు రూ. 1,000 కోట్లమేర తగ్గించగలిగాం.