CM Chandrababu: గూగుల్ భూసేకరణకు ఎవరు అడ్డుపడినా ఉపేక్షించవద్దు
ABN , Publish Date - Oct 02 , 2025 | 03:50 AM
జిల్లాలోని ఆనందపురం మండలం తర్లువాడ వద్ద గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు అవసరమైన భూ సేకరణకు ఎవరైనా అడ్డంకులు సృష్టిస్తే ఉపేక్షించవద్దని, కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.....
విశాఖ కలెక్టర్‌కు చంద్రబాబు ఆదేశం
రైతులకు తెలియకుండా వారి పేర్లతో కోర్టులో కేసులు వేశారు: గంటా
విశాఖపట్నం, అక్టోబరు 1(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ఆనందపురం మండలం తర్లువాడ వద్ద గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు అవసరమైన భూ సేకరణకు ఎవరైనా అడ్డంకులు సృష్టిస్తే ఉపేక్షించవద్దని, కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. విజయనగరం జిల్లా పర్యటన కోసం బుధవారం విశాఖపట్నం విమానాశ్రయంలో దిగిన ఆయన్ను మాజీ మంత్రి, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కలిసి భూ సమస్యను వివరించారు. రైతులను కొందరు ఉసిగొల్పి కోర్టు కేసులు వేయిస్తున్నారన్నారు. రైతులకు తెలియకుండా వారి పేర్లతో కేసులు వేశారని.. అందులో చనిపోయిన వ్యక్తి పేరు కూడా ఉందని చెప్పడంతో సీఎం ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇలాంటి వ్యవహారాలకు ఎవరు మద్దతు ఇచ్చినా ఊరుకోవద్దని, వారిపై చర్యలు తీసుకోవాలని అక్కడే ఉన్న కలెక్టర్ హరేంధిర ప్రసాద్‌ను ఆదేశించారు. భూములిచ్చిన రైతులకు ఉద్యోగ అవకాశాలు, ఉపాధికి షాపింగ్ కాంప్లెక్స్, ఇళ్ల నిర్మాణానికి మూడు సెంట్ల స్థలం ఇప్పించాలని గంటా కోరారు. సీఎం స్పందిస్తూ.. భూ సేకరణకు ఒకసారి పరిహారాన్ని ప్రకటించిన తర్వాత దానిని పెంచడం ఎక్కడా లేదని.. కేవలం ఇక్కడ రైతుల విన్నపాన్ని పరిగణనలోకి తీసుకుని పెంచామన్నారు. భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు.