Share News

Helicopter Glitch: సీఎం హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం

ABN , Publish Date - Jun 17 , 2025 | 03:56 AM

అది ముఖ్యమంత్రి జిల్లా పర్యటనలకు ఉపయోగించే హెలికాప్టర్‌. సీఎం చంద్రబాబు దీన్ని తరచూ వాడుతుంటారు. సోమవారం రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి పియూష్‌ గోయల్‌కు కూడా అధికారులు ఈ హెలికాప్టర్‌నే కేటాయించారు.

Helicopter Glitch: సీఎం హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం

  • కేంద్ర మంత్రి పర్యటనకు అదే చాపర్‌

  • కృష్ణపట్నం పర్యటన రద్దు చేసుకున్న గోయల్‌

  • సాంకేతిక సమస్యలపై సమగ్ర నివేదిక కోరిన డీజీపీ

అమరావతి, తిరుపతి, జూన్‌ 16 (ఆంధ్రజ్యోతి): అది ముఖ్యమంత్రి జిల్లా పర్యటనలకు ఉపయోగించే హెలికాప్టర్‌. సీఎం చంద్రబాబు దీన్ని తరచూ వాడుతుంటారు. సోమవారం రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి పియూష్‌ గోయల్‌కు కూడా అధికారులు ఈ హెలికాప్టర్‌నే కేటాయించారు. తిరుపతి నుంచి కృష్ణపట్నం పోర్టుకు వెళ్లేందుకు దీన్ని అందుబాటులో ఉంచారు. మంత్రి పియూష్‌ గోయల్‌ హెలికాప్టర్‌ ఎక్కాక దీనిలో సాంకేతిక లోపాన్ని గుర్తించిన సిబ్బంది ఈ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన కృష్ణపట్నం పోర్టు పర్యటనను రద్దు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో హెలికాప్టర్‌లో తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతున్న అంశాన్ని సీరియ్‌సగా తీసుకున్న డీజీపీ హరీశ్‌ కుమార్‌ గుప్తా దీనిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ మహేశ్‌ చంద్ర లడ్డాను ఆదేశించారు. హెలికాప్టర్‌ను నిపుణులతో పరిశీలించి, అసలు దీన్ని వినియోగించవచ్చా లేదా అనే అంశంపై సమగ్ర నివేదిక ఇవ్వాలని కోరారు. వీఐపీలు ప్రయాణించే హెలికాప్టర్‌లో తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తడంపై రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు.

ఏరియల్‌ సర్వే కూడా రద్దు: తిరుపతి జిల్లాలో కేంద్ర మంత్రి పియూష్‌ గోయల్‌ చేపట్టాల్సిన ఏరియల్‌ సర్వే కూడా హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్య వల్ల రద్దయింది. 2 రోజుల పర్యటన నిమిత్తం పియూష్‌ గోయల్‌ ఆదివారం రాత్రి తిరుపతి చేరుకున్నారు. సోమవారం ఉదయం తిరుమల వెళ్లి శ్రీవారి ని దర్శించుకున్నారు. అనంతరం ఆయన రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్‌, జిల్లా కలెక్టర్‌ వెంకటేశ్వర్‌తో కలసి రేణిగుంట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో బయల్దేరి జిల్లా పరిధిలోని గూడూరు నియోజకవర్గం కోట, చిల్లకూరు మండలాల్లో జరుగుతున్న క్రిస్‌ సిటీ అభివృద్ధి పనులను ఏరియల్‌ సర్వే ద్వారా పరిశీలించాల్సి ఉంది. అయితే హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఈ కార్యక్రమం కూడా రద్దయింది.

Updated Date - Jun 17 , 2025 | 03:57 AM