Share News

CM Chandrababu Naidu: పంటలకు ప్రత్యేక క్యాలెండర్‌

ABN , Publish Date - Dec 24 , 2025 | 04:44 AM

రైతులకు ప్రయోజనకరంగా ఉండేలా ఖరీఫ్‌, రబీ సీజన్ల పంటలకు ప్రత్యేక క్యాలెండర్‌ను రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవసాయ, ఉద్యానశాఖల అధికారులను ఆదేశించారు

CM Chandrababu Naidu: పంటలకు ప్రత్యేక క్యాలెండర్‌

  • రైతులకు ప్రయోజనకరంగా రూపొందించండి

  • దానికి అనుగుణంగా ఖరీఫ్‌, రబీ పంటల సాగు, మార్కెటింగ్‌ జరిగేలా చర్యలు తీసుకోవాలి

  • గడువులోగా ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలి: సీఎం చంద్రబాబు ఆదేశాలు

అమరావతి, డిసెంబరు 23(ఆంధ్రజ్యోతి): రైతులకు ప్రయోజనకరంగా ఉండేలా ఖరీఫ్‌, రబీ సీజన్ల పంటలకు ప్రత్యేక క్యాలెండర్‌ను రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవసాయ, ఉద్యానశాఖల అధికారులను ఆదేశించారు. ఆ క్యాలెండర్‌కు అనుగుణంగా పంటల సాగు, మార్కెటింగ్‌ జరిగేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. మంగళవారం సచివాలయంలో ధాన్యం కొనుగోళ్లు, వివిధ పంట ఉత్పత్తుల మార్కెటింగ్‌పై సీఎం సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ మంత్రి కె.అచ్చెన్నాయుడు, పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్‌లు వర్చువల్‌గా పాల్గొన్నారు. ఆయా సీజన్లలో ఎలాంటి పంటలు వేయాలి, రైతులకు ఏది ప్రయోజనం అనే అంశాలపై అవగాహన కల్పించాలని సీఎం చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు. పంట ఉత్పత్తుల నాణ్యతను పెంచడంతోపాటు కోత సమయంలోనూ తగిన సూచనలు ఇవ్వాలన్నారు. కోల్డ్‌చైన్‌ ద్వారా దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లకు మన పంట ఉత్పత్తులను తరలించడంతోపాటు వాటి ప్రాసెసింగ్‌పై దృష్టి సారించాలని చెప్పారు. దేశవ్యాప్తంగా వివిధ మార్కెట్లకు పంట ఉత్పత్తులను తరలించేందుకు రైలు రవాణా వంటి సౌకర్యాలు కల్పించాలన్నారు.

రైతులకు చెల్లింపుల్లో ఇబ్బందులు ఉండొద్దు

రాష్ట్రంలోని ఆయా జిల్లాల్లో కొనసాగుతున్న ధాన్యం కొనుగోళ్లను నిర్దేశిత గడువులోగా పూర్తిచేయాలని సీఎం ఆదేశించారు. రాష్ట్రస్థాయి బ్యాంకర్లతో మాట్లాడి రైతులకు చెల్లింపుల్లో ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోళ్లలో రైసు మిల్లర్లు అక్రమాలకు పాల్పడకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎదురవుతున్న బ్యాంకు గ్యారంటీ సమస్యలను పరిష్కరించడంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా మిల్లర్లు ఒకే తరహా బ్యాంక్‌ గ్యారంటీలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్పీడ్‌ ఆఫ్‌ డెలివరింగ్‌ గవర్నెన్సు విధానం మేరకు తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. సమీక్ష సమావేశం నుంచే రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కన్వీనర్‌తో ముఖ్యమంత్రి మాట్లాడి తగిన ఆదేశాలు జారీచేశారు.

మామిడి రైతులకు అండగా ఉన్నాం

మామిడి రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.184 కోట్లను రాయితీగా చెల్లిందని ముఖ్యమంత్రి తెలిపారు. ఏ రాష్ట్రంలో లేనివిధంగా కేజీకి రూ.4 చొప్పున అదనపు ధర చెల్లిస్తున్నామని చెప్పారు. పల్ప్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు రైతుల పట్ల ఉదారంగా వ్యవహరించాలన్నారు. కొందరు ఉద్దేశపూర్వకంగా రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నట్టు తన దృష్టికి వచ్చిందని, అలాంటి వారి పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని హెచ్చరించారు. రైతుల ఇబ్బందులను పది రోజుల్లో పరిష్కరించాలని సంబంధిత జిల్లా కలెక్టర్లను సీఎం ఆదేశించారు. మామిడి రైతులకు అండగా ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇస్తోందన్నారు. జనవరిలో ఉద్యాన ఉత్పత్తుల ప్రదర్శన నిర్వహించాలని వ్యవసాయశాఖ అధికారులను ఆదేశించారు.

Updated Date - Dec 24 , 2025 | 04:44 AM