Share News

CM Directs Agreement with KIMS: బిడ్‌ వేసిన సంస్థతో ఒప్పందం

ABN , Publish Date - Dec 25 , 2025 | 04:25 AM

పేదలకు నాణ్యమైన వైద్య విద్యను, వైద్యాన్ని అందించే విషయంలో ఎక్కడా రాజీపడేది, వెనక్కి తగ్గేది లేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు....

CM Directs Agreement with KIMS: బిడ్‌ వేసిన సంస్థతో ఒప్పందం

  • ఆదోని మెడికల్‌ కాలేజీ నిర్మాణానికి ముందుకొచ్చిన ‘కిమ్స్‌’కు ఆమోదం

  • మిగిలిన బిడ్డర్లతోనూ సంప్రదింపులు

  • వైద్య విద్య నాణ్యతలో రాజీ లేదు

  • పీపీపీలో పేదలకు నాణ్యమైన వైద్యం

  • జిల్లా మొత్తం ‘కుప్పం సంజీవని’ అమలు

  • ఆరోగ్య శాఖకు చంద్రబాబు ఆదేశం

అమరావతి, డిసెంబరు 24(ఆంధ్రజ్యోతి): పేదలకు నాణ్యమైన వైద్య విద్యను, వైద్యాన్ని అందించే విషయంలో ఎక్కడా రాజీపడేది, వెనక్కి తగ్గేది లేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్రంలో పబ్లిక్‌-ప్రైవేట్‌-పార్టనర్‌షి్‌ప(పీపీపీ) విధానంలో చేపట్టిన మెడికల్‌ కాలేజీల నిర్మాణానికి కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా వయబులిటీ గ్యాప్‌ ఫండ్‌(వీజీఎఫ్‌) సహా ఇతర ప్రోత్సాహకాలు ఇవ్వాలని సూచించారు. ఆదోని మెడికల్‌ కాలేజీ నిర్మాణానికి ముందుకు వచ్చిన కిమ్స్‌ సంస్థతో ఒప్పందం చేసుకోవాలన్నారు. కాలేజీ నిర్మాణం చేపట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. అలాగే మిగిలిన కాలేజీలకు సంబంధించిన టెండర్ల ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు బిడ్డర్లతో సంప్రదింపులు జరపాలని ఆదేశించారు. బుధవారం సచివాయంలో వైద్య ఆరోగ్య శాఖపై ముఖ్యమంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా పీపీపీ విధానంలో మెడికల్‌ కాలేజీల నిర్మాణం ప్రస్తావనకు వచ్చింది. దేశ వ్యాప్తంగా పీపీపీ విధానం అమల్లో ఉందని, పేద వర్గాలకు నాణ్యమైన, కార్పొరేట్‌ వైద్యం అందించే విషయంలో పీపీపీ విధానంలో ముందకువెళ్లాలని అధికారులకు చంద్రబాబు సూచించారు. పీపీపీ విధానంలో మెడికల్‌ కాలేజీలను మందుకు తీసుకువెళ్లేందుకు అవసరమైన కార్యాచరణతో పని చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు స్పందిస్తూ.. పీపీపీ ప్రాజెక్టుల అమలును ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం, ఆర్థిక వ్యవహారాల విభాగం, ఆర్థిక శాఖ ద్వారా పలు విధానపరమైన అంశాలకు సహకరించేందుకు ఆర్థిక సహాయ పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. ఈ క్రమంలో అమలులో ఉన్న వీజీఎఫ్‌ ఆర్థిక చేయూతను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరో సగం భరించాలని కేంద్రం సూచించిందని వెల్లడించారు. దీనిలో భాగంగా వైద్య రంగంలో వీజీఎఫ్‌ కింద ఇచ్చే 60 శాతం ఆర్థిక మద్దతులో చెరో 30 శాతం చొప్పున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత తీసుకుంటాయన్నారు. వీజీఎఫ్‌ ద్వారా అరుణాచల్‌ప్రదేశ్‌, జార్ఖండ్‌, ఉత్తరప్రదేశ్‌ వంటి రాష్ట్రాల్లో ఆసుపత్రులు, వైద్య కళాశాలలు నిర్మించేందుకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల విభాగం ఇప్పటికే అనుమతులు ఇచ్చిందని చెప్పారు. పీపీపీ విధానం ద్వారా వైద్య కళాశాలలు, ఆసుపత్రులు, కీలక ఆరోగ్య మౌలిక వసతుల అభివృద్ధి వేగవంతం అవుతుందని, ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందబాటులోకి వస్తాయని కేంద్రం అభిప్రాయపడినట్లు అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తొలి విడతలో చేపట్టిన ఆదోని, మదనపల్లె, పులివెందుల, మార్కాపురం మెడికల్‌ కాలేజీలకు సంబంధించిన టెండర్ల ప్రక్రియను అధికారులు సీఎంకు వివరించారు.


చిత్తూరు వ్యాప్తంగా..

కుప్పంలో పైలెట్‌ ప్రాజెక్టుగా చేపట్టిన ‘సంజీవని ప్రాజెక్టు’ అమలుపైనా సీఎం చంద్రబాబు అధికారులతో చర్చించారు. త్వరలో చిత్తూరు జిల్లా వ్యాప్తంగా సంజీవని ప్రాజెక్టును అమలు చేసేలా అధికారులు ఎలాంటి కసరత్తు చేస్తున్నారని ఆరా తీశారు. కుప్పంలో ఎదురైన అవరోధాలను అధిగమిస్తూ, చిత్తూరు జిల్లా వ్యాప్తంగా సంజీవని ప్రాజెక్టును అమలు చేయాలని ఆదేశించారు. ప్రతి ఒక్కరికి డిజిటల్‌ హెల్త్‌ రికార్డులు ఇచ్చేలా రూపొందించిన ఈ ప్రాజెక్టును ఎప్పటికప్పుడు ఆధునీకరించాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఈ సమీక్షలో ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌, సెక్రటరీ సౌరభ్‌ గౌర్‌, ఏపీఎంఎ్‌సఐడీసీ ఎండీ గిరిషా తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 25 , 2025 | 04:25 AM