Carnal Incident: కాకినాడ ఘటనపై సీఎం సీరియస్
ABN , Publish Date - Jul 12 , 2025 | 05:33 AM
కాకినాడ జీజీహెచ్‌లో లైంగిక వేధింపుల వ్యవహారంపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. దీంతో కాకినాడ జిల్లా యంత్రాంగం వేగంగా కదలడంతో నిందితులపై వెంటనే చర్యలు తీసుకున్నారు.
జీజీహెచ్‌లో విద్యార్థినులపై సిబ్బంది లైంగిక వేధింపులు
చర్యలకు కలెక్టర్, ఎస్పీలకు చంద్రబాబు ఆదేశాలు
నలుగురు నిందితుల సస్పెన్షన్, అరెస్ట్
జీజీహెచ్(కాకినాడ) జూలై 11(ఆంధ్రజ్యోతి): కాకినాడ జీజీహెచ్‌లో లైంగిక వేధింపుల వ్యవహారంపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. దీంతో కాకినాడ జిల్లా యంత్రాంగం వేగంగా కదలడంతో నిందితులపై వెంటనే చర్యలు తీసుకున్నారు. కాకినాడ రంగరాయ వైద్యకళాశాలకు అనుబంధంగా ఉన్న జీజీహెచ్‌లోని బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, పాథాలజీ ల్యాబ్‌ల్లో పనిచేస్తున్న ల్యాబ్ అటెండెంట్ కళ్యాణ్ చక్రవర్తి, మైక్రోబయాలజీ టెక్నీషియన్ జిమ్మిరాజు, బయోకెమిస్ట్రీ ఎల్‌టీ గోపాలకృష్ణ, పాథాలజీ ఎల్‌టీ ప్రసాద్ కలిసి ఒకేషనల్, బీఎస్సీ ఎంఎల్‌టీ చదువుతున్న పారా మెడికల్ విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. శరీర భాగాలను తాకడం, ఫొటోలు తీసి వాట్సా్‌ప్‌లో పంపి, రూమ్‌కు రమ్మనడం.. ఇలా పలు రకాలుగా వేధిస్తున్నారు. వారి వేధింపులను తట్టుకోలేక 50మంది విద్యార్థినులు మెయిల్ ద్వారా ఈనెల 9న కళాశాల ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేశారు. ఆయన వెంటనే అంతర్గత ఫిర్యాదుల కమిటీ విచారణకు ఆదేశించారు. ఈ ఘటనలపై శుక్రవారం ‘ఆంధ్రజ్యోతి’, ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’లోనూ కథనాలు వచ్చాయి. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించి కాకినాడ జిల్లా యంత్రాంగానికి వెంటనే చర్యలు చేపట్టాలని, క్రిమినల్ కేసులు పెట్టాలని ఆదేశించారు. దీంతో కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్‌మోహన్, ఎస్పీ జి.బిందుమాధవ్ నిందితులపై వెనువెంటనే చర్యలకు దిగారు. నిందితులు నలుగురినీ శుక్రవారం సస్పెండ్ చేయడమే కాకుండా పోలీసులు అరెస్ట్ చేశారు.