AP CM Chandrababu: నిర్లక్ష్యంగా ఉంటే కఠినంగా ఉంటా
ABN , Publish Date - Nov 09 , 2025 | 05:19 AM
పార్టీ కార్యక్రమాలతో సంబంధం లేనట్లు నిర్లక్ష్యంగా వ్యవహరించే నాయకుల విషయంలో తానూ కఠినంగా ఉండాల్సి ఉంటుందని టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు హెచ్చరించారు.
పార్టీ కార్యక్రమాల పట్ల నిర్లక్ష్యాన్ని సహించను
ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులకు సీఎం హెచ్చరిక
‘నిర్లక్ష్యం’ జాబితాలో 48 మంది ఎమ్మెల్యేలు!
ప్రతిష్ఠాత్మకంగా పింఛన్ల పంపిణీ నిర్వహిస్తున్నాం
స్వయంగా ప్రతినెలా నేనూ హాజరవుతున్నా.. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు వెళ్లకపోతే ఎలా?
సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు మురిగిపోతున్నా పంచరా?
పార్టీ నేతల తీరుపై టీడీపీ అధినేత అసంతృప్తి
అమరావతి, నవంబరు 8 (ఆంధ్రజ్యోతి): పార్టీ కార్యక్రమాలతో సంబంధం లేనట్లు నిర్లక్ష్యంగా వ్యవహరించే నాయకుల విషయంలో తానూ కఠినంగా ఉండాల్సి ఉంటుందని టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు హెచ్చరించారు. ఎన్ని కార్యక్రమాలు ఉన్నా పక్కన పెట్టి ప్రతి నెలా 1వ తేదీన ‘పేదల సేవలో’ పేరుతో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో స్వయంగా తాను పాల్గొంటున్నానని, కానీ కొందరు ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులకు మాత్రం ఈ కార్యక్రమంలో పాల్గొనే తీరిక కూడా దొరకడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఏడాదికి రూ.34 వేల కోట్లతో పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోందన్నారు. శనివారం టీడీపీ కేంద్ర కార్యాలయానికి చంద్రబాబు వచ్చారు. ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరించిన అనంతరం పార్టీ బ్యాక్ ఆఫీసు సిబ్బంది, ప్రోగ్రాం కమిటీ సభ్యులతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పార్టీ కార్యక్రమాల అమలు, ప్రజాప్రతినిధుల పాత్ర, పార్టీ నేతల వ్యవహారశైలిపై సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. కొందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల వ్యవహారశైలిపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలు ఎంతో బాధ్యతగా మనల్ని గెలిపించినప్పుడు వారిని పట్టించుకోకుండా హైదరాబాద్, బెంగళూరుల్లో కూ ర్చుని వ్యాపారాలు చక్కబెట్టుకోవడం ఏమిటన్నారు.
కొందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు పేర్లు ప్రస్తావించి మరీ ఎవరేం చేస్తున్నారో అన్నీ తనకు తెలుసని, ఇకపై కఠినంగానే ఉంటానని స్పష్టం చేశా రు. పింఛన్ల పంపిణీ, సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన 48 మంది ఎమ్మెల్యేల జాబితాను బ్యాక్ ఆఫీసు సిబ్బంది సీఎం ముందు ఉంచారు. వారందరి నుంచి వివరణ తీసుకుని తన కు తెలియజేయాలని సీఎం ఆదేశించారు. పార్టీ ప్రతిష్ఠాత్మకంగా భావించే కార్యక్రమంలో కూడా ఎమ్మెల్యేలు పాల్గొనకపోతే ఎలా అని చంద్రబాబు ప్రశ్నించారు. పార్టీ కార్యకలాపాలు, ప్రజాసమస్యల పరిష్కారం, నాయకుల బాధ్యతలపై సీఎం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు.
చెక్కుల పంపిణీలో నిర్లక్ష్యం వద్దు
పింఛన్ల పంపిణీతో పాటు సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ, కార్యకర్తల బీమా చెక్కుల పంపిణీ కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు తప్పనిసరిగా పాల్గొనాలని సీఎం ఆదేశించారు. ఈ కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు ప్రజలు, కార్యకర్తలతో మాట్లాడాలని, వారి నుంచి ప్రభుత్వ పనితీరు, ఇతర సమస్యలపై ఫీడ్ బ్యాక్ తీసుకోవాలని సూచించారు. ప్రజాసేవలో నేతలు నిబద్ధతతో వ్యవహరించాలని, క్షేత్రస్థాయిలో ఉంటూ ప్రభుత్వ కార్యక్రమాలకు తప్పనిసరిగా హాజరవ్వాలని స్పష్టం చేశారు. కొన్ని నియోజకవర్గాల్లో సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు గడువు ముగిసిపోయినా పంపిణీ చేయకుండా ఉంచేస్తున్నారని, ఇలాగైతే వందల కోట్ల ప్రయోజనం వృథా అవుతుందని సీఎం వ్యాఖ్యానించారు.
సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టండి
ప్రజాసమస్యల పరిష్కారానికి ప్రతి ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొని తీరాల్సిందేనని చంద్రబాబు ఆదేశించారు. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో నిర్వహించిన గ్రీవెన్స్‌కు అనూహ్య స్పందన వచ్చిందని, ప్రజాప్రతినిధులకు ఇలాంటివే సంతృప్తిని ఇస్తాయని వ్యాఖ్యానించారు. వారంలో ఒకరోజు కచ్చితంగా అర్జీలు స్వీకరించాలని స్పష్టం చేశారు. నియోజకవర్గ స్థాయి లో పరిష్కారం కాని సమస్యలకు జిల్లా స్థాయిలో, అక్కడ పరిష్కారం కాని సమస్యలకు రాష్ట్రస్థాయిలో పరిష్కారం చూపాలని సీఎం ఆదేశించారు. ఇన్‌చార్జి మంత్రులు ఎమ్మెల్యేలు నిర్వహిస్తున్న గ్రీవెన్స్ వివరాలను తెప్పించుకుని, సమస్యల పరిష్కారాన్ని వేగవంతం చేయాలని సూచించారు. ప్రతి ఎమ్మెల్యే ప్రజల నుంచి వినతులు తీసుకోవడంతో పాటు త మకు వచ్చిన అర్జీలు పరిష్కారం అయ్యేవరకు పనిచేయాలని ఆదేశించారు. సమస్య తన వద్దకో, లోకేశ్ వద్దకో వస్తేనే పరిష్కారం అవుతుందనే భావన ఉండకూడదన్నారు. టీడీపీ ఆవిర్భావం నుంచి ఉన్న కార్యకర్తలను కాదని ఎమ్మెల్యేలు తమకు నచ్చిన కార్యకర్తలను మాత్రమే ప్రోత్సహిస్తున్నారని, వారిలో వైసీపీ నుంచి వచ్చిన వారు కూడా ఉన్నారన్న విష యం తన దృష్టికి వచ్చిందని, ఇకపై అలాంటివి పునరావృతం కాకూడదని హెచ్చరించారు. పార్టీనే నమ్ముకుని ఉన్న సీనియర్ కార్యకర్తల్ని కలుపుకొని పోవాలని, ఈ అంశంపై క్షేత్రస్థాయి నుంచి ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకుంటానని అన్నారు.
తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టండి
వైసీపీ నేతలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేతలకు సీఎం సూ చించారు. పీపీపీ విధానంలో మెడిక ల్ కాలేజీల నిర్మాణం వల్ల పేదలకు నాణ్యమైన వైద్యం అందడంతో పా టు పేద విద్యార్థులకు మెరుగైన విద్య అందుతుందన్నారు. అసత్యాలతో అడ్డుకునేందుకు వైసీపీ నేతలు కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్య క్తం చేశారు. మొంథా తుఫాను సమయంలో ప్రభుత్వం తక్షణమే స్పందించి రైతులు, ప్రజలకు అండ గా నిలబడితే జగన్ మాత్రం విషం చిమ్ముతున్నారని అన్నారు. జగన్ దుర్మార్గాలను పదే పదే ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేతలను కోరారు. బిహర్ ఎన్నికల్లో ఇప్పటికీ లాలూ జంగిల్ రాజ్ విషయమే ప్రచారాస్త్రంగా ఉందని గుర్తు చేశారు. ప్రభుత్వం గతంలో కన్నా సంక్షేమం, అభివృద్ధి ఎక్కువగా చేస్తోందని, నిధుల కొరత ఉన్నా ఎక్కడా వెనుకడుగు వేయడం లేదన్నారు.
అమరావతి బ్రాండ్ ఇమేజ్ పెరిగింది
అమరావతి బ్రాండ్ ఇమేజ్ పెరిగిందని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. హైదరాబాద్ స్థాయిలో అమరావతిలోనూ భారీ ఈవెంట్లు జరుగుతున్నాయని, ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తోందన్నారు. తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైన కంపెనీలు కొన్ని కారణాల వల్ల నెల్లూరు జిల్లా నాయుడుపేటలో రూ.6 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు రావడం శుభపరిణామమని అన్నారు. విశాఖ లో ఈ నెల 14, 15 తేదీల్లో జరిగే పెట్టుబడుల సదస్సు ఈసారి నిర్మాణాత్మకంగా జరగనుందన్నారు. క్వాంటమ్ కంప్యూటర్ సిద్ధమైందని, అనుకున్న సమయానికి అమరావతికి వచ్చేలా చూస్తున్నామని చెప్పారు. అవినీతి నిర్మూలనకు సమగ్ర చర్యలు చేపడుతున్నామని, రెవెన్యూలో సమస్యల పరిష్కారంపైనా దృష్టి సారిస్తున్నామని అన్నారు.