Share News

CM Chandrababu Naidu: పార్టీ అండ లేకుండా నెగ్గగలరా

ABN , Publish Date - Nov 01 , 2025 | 03:22 AM

పార్టీ సిద్ధాంతాలపై అవగాహన లేని వారికి టికెట్లు ఇస్తే ఎలా ఉంటుందో తిరువూరులో పరిస్థితిని చూస్తే అర్థమవుతుంది. పార్టీ లేకపోతే వారి పరిస్థితేంటో తెలుసుకోకుండా...

CM Chandrababu Naidu: పార్టీ అండ లేకుండా  నెగ్గగలరా

  • చాలా మంది ఎమ్మెల్యేలు వ్యక్తిగత ఇమేజ్‌తో గెలిచామనుకుంటున్నారు

  • అలాంటివాళ్లు నిరభ్యంతరంగా బయటికి వెళ్లి పోటీ చేయొచ్చు: సీఎం

  • సిద్ధాంతాలపై అవగాహన లేనివారికి టికెట్లిస్తే తిరువూరులాంటి పరిస్థితులే ఎదురవుతాయి

  • ఆ ఇద్దరినీ క్రమశిక్షణ కమిటీ ముందుకు పిలవండి

  • విడివిడిగా వివరణ తీసుకుని నాకు నివేదిక ఇవ్వండి

  • లండన్‌ నుంచి వచ్చాక ఇద్దరితో మాట్లాడతా

  • విభేదాలు కొలిక్కిరాకుంటే కఠిన చర్యలే

  • తిరువూరు పంచాయితీపై సీఎం సీరియస్‌

  • ఇక వారంలో ఒక రోజు కార్యాలయానికి వస్తా

  • లండన్‌ నుంచి రాగానే పార్టీ కమిటీలు వేస్తా

  • పార్టీ ఆఫీసులో 4 గంటలు.. నేతలతో సుదీర్ఘ చర్చ

అమరావతి, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి): ‘పార్టీ సిద్ధాంతాలపై అవగాహన లేని వారికి టికెట్లు ఇస్తే ఎలా ఉంటుందో తిరువూరులో పరిస్థితిని చూస్తే అర్థమవుతుంది. పార్టీ లేకపోతే వారి పరిస్థితేంటో తెలుసుకోకుండా.. పార్టీ లైన్‌ దాటి ప్రవర్తించేవారిపై కఠిన చర్యలు తీసుకోవలసిందే’ అని టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు స్పష్టంచేశారు. చాలా మంది ఎమ్మెల్యేలు తమ వ్యక్తిగత ఇమేజ్‌తో గెలిచామని అనుకుంటున్నారని.. ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తున్నారని ఆక్షేపించారు. అలాంటి వారు నిరభ్యంతరంగా బయటకు వెళ్లి వ్యక్తిగతంగా పోటీ చేసి గెలవొచ్చన్నారు. పార్టీ అండ లేకపోతే వారి పరిస్థితేంటో అప్పుడు అర్థమవుతుందని చెప్పారు. శుక్రవారం టీడీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన చంద్రబాబు సుమారు 4 గంటలు అక్కడే గడిపారు. పార్టీ నేతలతో వివిధ అంశాలపై చర్చించారు. ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరు నియోజకవర్గ వివాదంపై ఈ సందర్భంగా తీవ్రంగా స్పందించారు. ఈ వ్యవహారంలో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, విజయవాడ కేశినేని శివనాథ్‌ (చిన్ని)ని పిలిపించాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావును ఆదేశించారు. క్రమశిక్షణ కమిటీ ముందుకు విడివిడిగా రప్పించి వివరణ తీసుకోవాలని.. దానిపై తనకు నివేదిక ఇవ్వాలన్నారు. విదేశీ పర్యటన ముగించుకుని వచ్చాక ఇద్దరితోనూ మాట్లాడతానని, విభేదాలు కొలిక్కిరాకుంటే కఠిన చర్యలకు వెనుకాడనని తేల్చిచెప్పారు. ఎవరైనా సరే పార్టీ టికెట్‌ ఇచ్చిన తర్వాత పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేయాలని, పార్టీ లైన్‌ దాటితే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజు.. భగవద్గీతపై వ్యాఖ్యలు చేశారంటూ జరుగుతున్న ప్రచారంపైనా సీఎం స్పందించారు. ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు ఆచితూచి మాట్లాడాలని.. వారు మాట్లాడే మాటలు రాష్ట్రం మొత్తం ప్రభావం చూపుతాయని చెప్పారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఇప్పటికే గాడిలో పెట్టామని.. ఆటోపైలట్‌ మోడ్‌లో పెట్టామన్నారు. గ్రామ సచివాలయాల పేరును స్వర్ణాంధ్ర సెంటర్లు లేదా స్వర్ణాంధ్ర కేంద్రాలుగా మార్పు చేస్తే ఎలా ఉంటుందనే అంశంపైనా నాయకులతో సీఎం చర్చించారు. చంద్రబాబు ఇంకా ఏమన్నారంటే..


సుశిక్షిత శ్రేణులను తయారుచేయాలి..

పార్టీ శ్రేణులను సుశిక్షితులుగా తయారు చేయడంపై దృష్టి సారించాలి. రాజకీయాల్లోకి రావడం అంటే కేవలం డబ్బు సంపాదన కోసమేనన్న ఆలోచనను తుడిచివేయాలి. ఆర్థిక స్థిరత్వం కోసం వేరేమార్గం చూసుకోవాలి. ప్రజాసేవకే రాజకీయాల్లోకి రావాలి. ఈ దిశగా క్యాడర్‌కు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలి. మద్యం వ్యాపారంలో ఎక్కువ మంది రాజకీయ నాయకులు ఉంటున్నారు. దానిద్వారా సంపాదించిన డబ్బు ఉండదు. గత ప్రభుత్వ హయాంలో మద్యం కుంభకోణం కేసు దానికి ఉదాహరణ. ఇక వారంలో ఒకరోజు పార్టీ కార్యాలయానికి కేటాయిస్తా. ప్రభుత్వపరంగా.. పార్టీ పరంగా రెండింటికీ సమయం కేటాయిస్తా. కార్యాలయానికి వస్తే సొంతింటికి వచ్చిన అనుభూతి కలుగుతుంది.

జగన్‌కు అది అలవాటే!

జగన్‌కు బురదజల్లడం అలవాటే. కోడికత్తి డ్రామా, వివేకా హత్య, గులకరాయి డ్రామా.. ఇవన్నీ తానేచేసి మనపై బురదజల్లాడు. తుఫాన్‌పై ఇప్పుడు విమర్శలు చేస్తున్నాడు. ప్రజలను మోసం చేసి మభ్యపెట్టి రాజకీయం చేద్దామన్న ఆలోచనే తప్ప.. వారికి మంచి చేసి రాజకీయం చేద్దామన్న ఆలోచన జగన్‌కు లేదు. సోషల్‌ మీడియాలో వైసీపీ ఫేక్‌ ప్రచారాలకు.. వాస్తవాలతో దీటుగా సమాధానమివ్వాల్సిందే. దీనికోసం సంబంధిత నిపుణులను నియమించుకోవాలి. సోషల్‌ మీడియాలో సమర్థంగా పనిచేయకపోతే వైసీపీ చేసే దుష్ప్రచారాలనే ప్రజలు వాస్తవాలని నమ్మే ప్రమాదముంది. తుఫాన్‌ను దీటుగా ఎదుర్కోవడానికి ప్రభుత్వం చేసిన కృషిని మన పార్టీ నేతలు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లలేకపోయారు. లండన్‌ పర్యటన ముగించుకుని వచ్చాక జిల్లా పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర కమిటీని ప్రకటిస్తా. (పల్లాతో) జాబితాలు సిద్ధంగా ఉన్నాయి.. లండన్‌ నుంచి వచ్చిన తర్వాత నా వద్దకు వస్తే ఓ గంట కూర్చుని జాబితాలు ఖరారు చేద్దాం.

ప్రజలను కలిసే తీరిక కూడా లేదా?

కొంతమంది ఎమ్మెల్యేలు సీఎంఆర్‌ఎఫ్‌ మంజూరు లేఖలు ఇవ్వడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. నియోజకవర్గ ప్రజలను కలిసే తీరిక కూడా వారికి లేదా? వారి జాబితా ఇవ్వండి. వారితో నేనే మాట్లాడతా. ఎమ్మెల్యేలందరూ ఆదివారం(2న) తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలి. నష్టం అంచనాలను సరిగా వేస్తున్నారా.. పరిహారం సరిగా అందిందా లేదా వంటి విషయాలపై ప్రజలతో మాట్లాడి ఫీడ్‌బ్యాక్‌ తీసుకోవాలి.

Updated Date - Nov 01 , 2025 | 03:25 AM