CM Chandrababu: ఎన్నిసార్లు చెప్పినా వినరేం
ABN , Publish Date - Aug 22 , 2025 | 05:02 AM
ఎమ్మెల్యేలు గాడి తప్పుతున్నారు. విమర్శలు.. వివాదాలకు తావులేకుండా పనిచేయాలని ఎన్నిసార్లు చెప్పినా పెడచెవిన పెడుతున్నారు. కొంత మంది ఎమ్మెల్యేల వ్యవహారశైలి కారణంగా ప్రభుత్వం..
గాడితప్పుతున్న ఎమ్మెల్యేలపై సీఎం సీరియస్
పునరావృతమైతే కఠిన చర్యలు తప్పవు!
ఆ తర్వాత బాధపడి ప్రయోజనం ఉండదు
వారిని కంట్రోల్ చేసే బాధ్యత పూర్తిగా మీదే
మీ పరిధిలోని ఎమ్మెల్యేలను హెచ్చరించండి
ఇన్‌చార్జి మంత్రులకు చంద్రబాబు ఆదేశం
చెడు వ్యాపించినంత వేగంగా మంచి జనంలోకి వెళ్లదు
మనం చేసిన మంచిపై చర్చ జరగాలి
కానీ ఎమ్మెల్యేల వివాదాలపై జరుగుతోంది
ఇది మంచి పరిణామం కాదు
రాష్ట్రంలో క్రిమినల్ మాఫియా..
ప్రభుత్వంపై బురదజల్లడమే వారి పని
ఫైళ్ల క్లియరెన్స్‌లో వేగం పెంచండి: సీఎం
అమరావతి, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): ‘ఎమ్మెల్యేలు గాడి తప్పుతున్నారు. విమర్శలు.. వివాదాలకు తావులేకుండా పనిచేయాలని ఎన్నిసార్లు చెప్పినా పెడచెవిన పెడుతున్నారు. కొంత మంది ఎమ్మెల్యేల వ్యవహారశైలి కారణంగా ప్రభుత్వం చేస్తున్న మంచి జనంలోకి వెళ్లడం లేదు. చెడు వ్యాపించినంత వేగంగా మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లలేం. పదే పదే తప్పులు పునరావృతమైతే కఠిన చర్యలు తప్పవు. ఆ తర్వాత బాధపడి ప్రయోజనం ఉండదు. ఈ విషయాన్ని ఇన్‌చార్జి మంత్రులు మీ పరిధిలోని ఎమ్మెల్యేలకు చెప్పాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టంచేశారు. గురువారం మంత్రివర్గ సమావేశం సందర్భంగా కొందరు ఎమ్మెల్యేల వ్యవహార శైలిని ఆయన ప్రస్తావించి అసహనం వ్యక్తం చేశారు. మనం ఎప్పుడు తప్పటడుగు వేస్తామా అని ప్రతిపక్షం ఎదురుచూస్తుంటుందని.. వారికి ఎలాంటి అవకాశమూ ఇవ్వకుండా వ్యవహరించాలని వ్యాఖ్యానించారు. వైసీపీ ఇటీవల చేస్తున్న దుష్ప్రచారాలను ప్రస్తావిస్తూ.. ‘రాష్ట్రంలో క్రిమినల్ మాఫియా తయారైంది. మనం మంచి చేసినా చెడుగా జనంలోకి తీసుకెళ్లడం వారి ప్రత్యేకత. ప్రభుత్వం చేసిన ఏ కార్యక్రమంపైనైనా బురదజల్లడమే ఆ మాఫియా పని. ఈ విషయంలో మనం అప్రమత్తంగా లేకుంటే చాలా నష్టపోతాం’ అని మంత్రివర్గ సహచరులను హెచ్చరించారు. మనం చేసిన మంచిపై చర్చ జరగాల్సి ఉండగా.. ఎమ్మెల్యేల వివాదాలపై జరుగుతోందని.. ఇది మంచి పరిణామం కాదని స్పష్టంచేశారు.
ఫైళ్ల క్లియరెన్స్‌పై శ్రద్ధపెట్టండి
క్యాబినెట్ భేటీలో ఫైళ్ల క్లియరెన్స్‌పై సీఎం మంత్రులతో చర్చించారు. ఒక ఫైలు క్లియర్ చేయడానికి తాను సగటున మూడ్రోజులు తీసుకుంటున్నానని తెలిపారు. ‘ఒకరోజు 10 ఫైళ్లు క్లియర్ చేయొచ్చు.. ఇంకోరోజు రెండు ఫైళ్లు మాత్రమే చేయొచ్చు. సగటు తీసుకుని ఫైళ్ల క్లియరెన్స్ ఎంత వేగంగా చేస్తున్నారో పరిగణనలోకి తీసుకున్నాం’ అని వివరించారు. పౌరసరఫరాల శాఖలో ఒక్కో ఫైలు క్లియర్ కావడానికి సగటున 33 రోజుల సమయం పడుతోందని సీఎం ప్రస్తావించగా.. తానీ విషయంలో వేగంగానే ఉన్నానని.. లెక్కల్లో ఎక్కడో తేడా ఉందని ఆ శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. చెక్ చేద్దామని సీఎం అన్నారు. ఆర్థిక, రవాణాశాఖల్లో సగటున ఫైళ్ల క్లియరెన్స్‌కు సగటున 15 రోజులు పడుతోందని చెప్పారు. కార్యదర్శుల్లో బుడితి రాజశేఖర్ అత్యంత వేగంగా సగటున 18 గంటలకో ఫైలు క్లియర్ చేస్తున్నారని సీఎం తెలిపారు. సంబంధిత సెక్రటరీలతో పోల్చి చూసుకోవాలని, వేగం పెంచాలని మంత్రులకు సూచించారు.
వాట్సాప్ గవర్నెన్స్‌పై పవన్ ఆసక్తి
ఆర్టీజీఎస్ పనితీరును వివరిస్తూ కార్యదర్శి కాటంనేని భాస్కర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వగా.. మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్‌కు స్పందన ఎలా ఉందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. చాలా బాగుందని మంత్రి లోకేశ్, భాస్కర్ సమాధానమిచ్చారు.
సీఎంను మళ్లీ కలిసిన అనంత ఎమ్మెల్యే
సీఎం చంద్రబాబును అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ మరోసారి కలిశారు. బుధవారం రాత్రి సీఎంను కలిసిన ఆయన.. గురువారం మళ్లీ సమావేశమయ్యారు. జూనియర్ ఎన్టీఆర్‌పై తాను చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చారు. నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాశ్ కూడా సీఎంను కలిశారు.
రేపు మంత్రులు,ఎమ్మెల్యేలతో సీఎం భేటీ
టీడీపీ సంస్థాగత కమిటీలపై కసరత్తు
టీడీపీ సంస్థాగత నిర్మాణంపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు దృష్టి సారించారు. శనివారం (23న) ఉండవల్లిలోని తన నివాసంలో పార్టీకి చెందిన మత్రులు, పొలిట్‌బ్యూరో సభ్యులు, కొంత మంది ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేశారు. సంస్థాగత ఎన్నికలపై ఈ సందర్భంగా చర్చిస్తారు. అసెంబ్లీ, పార్లమెంటరీ కమిటీల నియామకం ఎంత వరకు వచ్చిందన్న అంశాలతోపాటు రాష్ట్ర కమిటీ ఏర్పాటుపైనా చర్చించనున్నారు. ఈ సమావేశంలోనే స్త్రీశక్తి పథకం విజయవంతంపై జిల్లాల్లో ఏర్పాటు చేయనున్న సమావేశాలపైనా చర్చిస్తారు. సెప్టెంబరు 3న అనంతపురంలో సూపర్ సిక్స్ సూపర్ హిట్ పేరుతో ఏర్పాటు చేయనున్న బహిరంగ సభపై కూడా చర్చించనున్నారు. వాస్తవానికి ఈ సభను ఈ నెల 25న నిర్వహించాలని భావించారు.