CM Chandrababu: రాష్ట్ర ప్రయోజనాలపై రాజీలేదు!
ABN , Publish Date - Nov 27 , 2025 | 05:28 AM
రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే విషయంలో రాజీలేదని.. ఏ చిన్న అవకాశమూ పొరుగు రాష్ట్రాలకు ఇవ్వొద్దని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు...
కృష్ణా జలాలపై హక్కుల కోసం పోరు: సీఎం
అమరావతి, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే విషయంలో రాజీలేదని.. ఏ చిన్న అవకాశమూ పొరుగు రాష్ట్రాలకు ఇవ్వొద్దని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. కృష్ణా జలాల పునఃపంపిణీకి అంగీకరించేది లేదని తేల్చిచెప్పారు. నీటి హక్కుల కోసం గట్టిపోరాటం చేద్దామన్నారు. వెలగపూడి సచివాలయంలో బుధవారం జల వనరుల శాఖపై ఆయన సమీక్షించారు. మంత్రి నిమ్మల రామానాయుడు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్, సలహాదారు ఎం.వెంకటేశ్వరరావు, ఈఎన్‌సీ నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు. కృష్ణా ట్రైబ్యునల్-2 ముందు రాష్ట్రప్రభుత్వం వినిపిస్తున్న వాదనలపై సీఎం ఆరా తీశారు. అవసరమైతే సమర్థులైన న్యాయవాదులను అదనంగా నియమించుకుందామని.. పటిష్ఠ వాదనలు వినిపించాలన్నారు. ఈ అంశంపై రెండ్రోజుల్లో ప్రత్యేకంగా సమావేశమవుదామని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు ప్రగతిపైనా చర్చించారు. తొలి దశ పూర్తికావడానికి ఇంకా ఎన్ని నిధులు అవసరమని సీఎం ప్రశ్నించగా.. మరో వెయ్యి కోట్ల దాకా అవసరమవుతాయని.. ఈ నిధులు విడుదలైతే.. వచ్చే ఏడాది జూన్ దాకా చేపట్టే పనులకు నిధులు సరిపోతాయని అధికారులు తెలిపారు. నిర్వాసితులకు సహాయం, పునరావాసం నిధుల జమలో జాప్యంపై ముఖ్యమంత్రి అడిగారు. చింతలపూడి ఎత్తిపోతల పనులను పునఃప్రారంభించాలన్నారు. ఈ పథకం కోసం ఇప్పటికే రూ.4,500 కోట్లు వ్యయం చేశామని.. పర్యావరణ అనుమతులు రావడంలో జాప్యం కారణంగా పనులు నిలిచిపోయాయని, ఆ అనుమతులు సాధించాలని అధికారులకు స్పష్టంచేశారు. పోలవరం-నల్లమల సాగర్ అనుసంధాన పనులు చేపట్టేందుకు కూడా చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైతే ఢిల్లీ వెళ్లి అనుమతులు సాధించాలని సూచించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్రానికి మిగులు జలాలు ఉంటాయన్నారు.