CM Chandrababu: అండగా ఉంటా
ABN , Publish Date - Nov 12 , 2025 | 04:53 AM
ఎంతో అనుభవం ఉన్న నాకే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతుబట్టడం లేదు.. అయినా భయం లేదు. ముందుకే సాగుతా.. అని సీఎం చంద్రబాబు అన్నారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతుబట్టడం లేదు
మైనార్టీల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: సీఎం
విజయవాడ సిటీ, నవంబరు 11(ఆంధ్రజ్యోతి): ‘‘ఎంతో అనుభవం ఉన్న నాకే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతుబట్టడం లేదు.. అయినా భయం లేదు. ముందుకే సాగుతా..’’ అని సీఎం చంద్రబాబు అన్నారు. మంగళవారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన భారతరత్న మౌ లానా అబుల్ కలాం ఆజాద్ జయంతి, మైనార్టీ సంక్షేమ దినోత్సవం, జాతీయ రెండో విద్యా దినోత్సవ కార్యక్రమాలలో ప్రసంగించారు. గత ఐదేళ్లలో కేంద్రం డబ్బులు ఇచ్చి నా రాష్ట్ర మ్యాచింగ్ గ్రాంటు ఇవ్వకుండా అప్పటి ప్రభు త్వం అభివృద్ధిని అడ్డుకుందన్నారు. ‘‘ఆర్థిక ఇబ్బందుల వల్ల కొన్ని పనులు కొంత ఆలస్యం అవుతున్నాయి. నేనుంటే క్షేమంగా ఉంటామనే నమ్మకంతో ఓట్లేశారు. కేర్‌ఫుల్‌గా డ్రైవ్ చేసే వ్యక్తిని కాబట్టి మిమ్మల్ని సురక్షితంగా ఒడ్డుకు తీసుకెళ్తానని భరోసా ఇస్తున్నా. శాశ్వతంగా మీ వాడిగా, మీకు తోడుగా ఉంటానని హామీ ఇస్తున్నా. ఆర్థిక కష్టాలు న్నా పింఛన్లు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం మనదే. సంక్షేమం, అభివృద్ధిని సమానంగా ముందుకు తీసుకెళ్తున్నా. రాత్రింబవళ్లు కష్టపడుతున్నా. సూపర్ సిక్స్‌ను సూపర్ హిట్ చేసి చూపించాను. ఏపీకి ఉన్న బ్రాండ్‌ను గత ఐదేళ్లలో భ్రష్ఠు పట్టించారు. మళ్లీ అందరిలో నమ్మకం కలిగించి పెట్టుబడిదారులను తీసుకొస్తున్నాను. ఇప్పటికే రూ.10 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయి. విశాఖ సదస్సులో మరో రూ.10లక్షల కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయి. గూగుల్ ద్వారా రూ.1.25 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయి’’ అని పేర్కొన్నారు. ఉద్యోగులకు అండగా ఉంటానని, వారు రాష్ట్రాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ముస్లిం మైనార్టీలను అన్ని రంగాల్లోనూ ముందంజలో నిలపాలన్నదే తన ధ్యేయమని తెలిపారు త్వరలో విజయవాడలోనూ హజ్ బిల్డింగ్ నిర్మిస్తామని అన్నారు. నూర్‌బాషా కార్పొరేషన్‌కు రూ.100 కోట్లు కేటాయిస్తామన్నారు.