CM Chandrababu: ఆదివాసీల రక్షణకు నాదీ హామీ
ABN , Publish Date - Aug 10 , 2025 | 03:38 AM
కొండ కోనల్లో నివసించే ఆదివాసీలు అభివృద్ధి చెందినప్పుడే రాష్ట్ర సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
మళ్లీ జన్మ ఉంటే ఏజెన్సీలోనే పుడతా: సీఎం
ఆదివాసీ బాగుంటేనే రాష్ట్రంలో వెలుగులు
ఏజెన్సీలో గిరిజనుల పోస్టులు గిరిజనులకే
నేను తెచ్చిన జీవో నం.3కు జగన్ తూట్లు
దాని పునరుద్ధరణకు కూటమి కృషి
గంజాయి అడ్డాగా ఆనాడు ఏజెన్సీ
గిరిజన ప్రాంతాల్లో 5 మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులు.. లక్ష ఎకరాల్లో కాఫీ తోటలు
అరకు, లంబసింగి, మారేడుమిల్లిలో పర్యాటక క్లస్టర్లు
ఈ నెలాఖరుకు టీచర్ల నియామకం
సూపర్ సిక్స్.. సూపర్ హిట్ కొట్టాం
ఆదివాసీ దినోత్సవంలో చంద్రబాబు వెల్లడి
పాడేరు మండలంలో సాగిన సీఎం పర్యటన
‘‘గిరిజనుల పోస్టులు గిరిజనులకే అనే స్ఫూర్తితో ఏజెన్సీలో జీవో నంబరు 3ను తెచ్చాను. ఆ జీవోను కోర్టులో కొట్టివేయించేలా చేసింది మీ నాయకుడు (జగన్) కాదా?. కనీసం కౌంటర్ కూడా వేయలేదు. ఏజెన్సీని గంజాయి అడ్డాగా మార్చారు. గిరిజనుల హక్కుల్ని కాపాడే విధానం ఇదేనా?. ఎంతవరకైనా పోరాడి ఆ జీవోను మళ్లీ పునరుద్ధరిస్తాం. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. ఆదివాసీ హక్కుల పరిరక్షణ బాధ్యతను నేను తీసుకుంటా.’
- తన పర్యటనను అడ్డుకోవాలని పిలుపునిచ్చిన వైసీపీ నేతలను ఉద్దేశించి సీఎం చంద్రబాబు
పాడేరు, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): కొండ కోనల్లో నివసించే ఆదివాసీలు అభివృద్ధి చెందినప్పుడే రాష్ట్ర సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఏజెన్సీ దేవుడు సృష్టించిన అద్భుతమని, మళ్లీ జన్మ అంటూ ఉంటే తాను ఏజెన్సీలో పుడతానన్నారు.అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం లగిశపల్లిలో శనివారం నిర్వహించిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో సీఎం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా గిరిజనులను ఉద్దేశించి ప్రసంగించారు. గిరిజన అభివృద్ధిపై తనకు శ్రద్ధ, స్పష్టత ఉన్నాయని,గిరిజనుల సంక్షేమంతో పాటు వారి హక్కుల పరిరక్షణ బాధ్యత కూడా తీసుకుంటానన్నారు. ఏజెన్సీలో ఉద్యోగాలు స్థానిక గిరిజనులకు ఇవ్వాలని నాడు జీవో నంబరు 3ను తాము తీసుకువస్తే, ఆ తరువాత వచ్చిన ప్రభుత్వాలు వాటిని రద్దు చేశాయన్నారు.

ఈ సందర్భంగా తన పర్యటనను అడ్డుకోవాలని పిలుపునిచ్చిన వైసీపీ నేతలను ఉద్దేశించి చంద్రబాబు తీవ్ర స్వరం వినిపించారు.గతంలో రెండుసార్లు పాడేరు రావాలని ఏర్పాట్లు చేసుకోగా, వాతావరణం అనుకూలించలేదన్నారు. ఇప్పుడు ఒకేరోజు రెండు శుభకార్యాలు..ఒకటి ఆదివాసీ ప్రపంచ దినోత్సవం, మరొకటి రక్షా బంధనం చేసుకునేలా దేవుడు అవకాశం కల్పించాడన్నారు.గిరిజనుల్లో మాణిక్యాలు ఉన్నారని, 25 వేల మంది గిరిజన విద్యార్థులు విశాఖలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సం దర్భంగా 108 సూర్య నమస్కారాలు, 108 నిమిషాలు పాటి నిర్వహించి గిన్నిస్ బుక్ రికార్డు సృష్టించారని గుర్తుచేశారు.పులివెందులలో సొంత బాబాయ్‌ని గొడ్డలితో ఘోరంగా న రికి చంపేశారని, దానిని గుండెపోటుగా సాక్షి టీవీలో ప్రసా రం చేస్తే నాడు సీఎంగా ఉన్న తాను నిజమేనని నమ్మానన్నారు. అది అప్పటి కాలమని, ఇప్పుడు సీబీఎన్ మారిపోయాడని,రాజకీయ ముసుగులో హత్యలు, దారుణాలు చేస్తే చూస్తూ ఊరుకోనన్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..
ఏజెన్సీకి ‘వందనం’..
‘‘ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చాం.వాటిని ఏడాది కాలంలోనే అమలుచేసి హిట్ కొట్టాం. పక్కనే ఉన్న ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో పెన్షన్లు వేయి, రెండు వేల రూపాయలే ఇస్తున్నారు.ఏపీలో మాత్రం రూ.4 వేలు ఇస్తున్నాం. గిరిజనుల పెన్షన్ల కోసమే ఏడాదికి రూ.1,595 కోట్లు వెచ్చిస్తున్నాం.తల్లికి వందనం పథకం ఏజెన్సీ గిరిజనులకు ఎక్కువ లబ్ధిని చేకూర్చింది. ఇక్కడ ఒక్కో కుటుంబంలో ముగ్గురు, అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నారు. వారిలో చదువుకున్న అందరికీ రూ.15 వేలు చొప్పున ఇచ్చాం.(పలువురి పేర్లు చదివారు.) 4,86,803 మంది పిల్లలకు రూ.643 కోట్లు ఇచ్చాం.ఏజెన్సీలో 373 నూతన భవనాల నిర్మాణానికి రూ.45 కోట్లు ఇటీవలే విడుదల చేశాం.గిరిజన విద్యార్థుల సంక్షేమానికి రూ.1,337 కోట్లు వెచ్చించాం. ఏజెన్సీ విద్యాలయాల్లో 10+2 కూ డా పెడతాం. విశాఖ,విజయవాడ, తిరుపతి నగరా ల్లో స్టడీ సర్కిళ్లు పెట్టి రూ.4.5 కోట్లు అందిస్తున్నాం. రూ.150 కోట్లతో రెసిడెన్షియల్ పాఠశాల భవనాలను వసతిగృహాలుగా మారుస్తున్నాం.’’
అరకు కాఫీకి మార్కెటింగ్
‘‘అరకు కాఫీని నేనే ప్రమోట్ చేస్తున్నాను.ప్రపంచమంతటా మార్కెటింగ్ జరిగేలా చర్యలు చేపట్టాం. పారి్‌సలో కూడా అరకు కాఫీ స్టాల్ పెట్టాం. ఇక్కడ ఏజెన్సీలోని 11 మండలాల్లో 2.58 లక్షల ఎకరాల్లో కాఫీ సాగు చేస్తుండగా అదనంగా మరో లక్ష ఎకరాల్లో కాఫీ తోటలు వేయనున్నాం. 1.8 లక్షల ఎకరాల్లో చెర్రీ కాఫీ సాగు చేపట్టి 90 వేల టన్నుల ఉత్పత్తిని గిరిజనులు సాధిస్తున్నారు. ఏజెన్సీలో గంజాయి సాగును వైసీపీ అరికట్టలేకపోయింది.దీనివల్ల దేశవ్యాప్తంగా ఈ ప్రాంతానికి చెడ్డ పేరు వచ్చింది. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహిస్తున్నాం. ఏజెన్సీ ప్రాంతాల్లో జాతీయ, రాష్ట్ర రహదారులను నిర్మించి ప్రపంచంతో అనుసంధానం చేస్తున్నాం.ఈ ఏడాదిలోనే రూ.200 కోట్లతో 269 కిలోమీటర్ల రోడ్డు నిర్మించి 203గ్రామాలకు సౌకర్యం సమకూర్చాం.’’
డోలీలకు చెక్..
‘‘గిరిజన ప్రాంతాల్లో సరైన వైద్యం అందుబాటులో లేక రోగులను డోలీల ద్వారా తీసుకువెళుతున్నారు. ఈ సమస్య నివారణకు ఐదు ప్రాంతాల్లో (సీతంపేట, పార్వతీపురం,రంపచోడవరం,కేఆర్‌పురం, శ్రీశైలం) మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులను నిర్మిస్తున్నాం. వీటిని త్వరలోనే పూర్తిచేసి అందుబాటులోకి తెస్తాం.కొందరు డాక్టర్లు ఏజెన్సీకి రావడం లేదు. వారికి ఇన్సెంటివ్‌లు ఇచ్చి రప్పిస్తాం. పోస్టులన్నీ భర్తీ చేస్తాం.ఏజెన్సీలో సికిల్ సెల్ రోగులు 1,487 మంది ఉండగా వారికి నెలకు రూ.10 వేలు చొప్పున పెన్షన్ ఇస్తున్నాం. గర్భిణులకు పోషకాహారం ఇస్తున్నాం.76 బర్త్ వెయింటింగ్ హాళ్లను బలోపేతం చేశాం. మరో 35 కొత్త భవనాలు నిర్మిస్తున్నాం.’’
ఉచితంగా రూఫ్ టాప్ సోలార్
‘‘రాష్ట్రంలో గిరిజన జనాభా 28.32 లక్షలు, కుటుంబాలు 8.41 లక్షలు. వారిలో 4.82 లక్షల కుటుంబాలకు నెలకు 200 యూనిట్ల విద్యుత్ ఉచితంగా ఇస్తున్నాం. త్వరలో వారందరికీ రూఫ్ టాప్ సోలారు యూనిట్లు ఉచితంగా ఇస్తాం. పెట్రోల్ ఖర్చు లేకుండా ఎలక్ట్రిక్ వాహనాలు కూడా చార్జింగ్ చేసుకొని రయ్ రయ్ మంటూ తిరగవచ్చు.’’

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం
‘‘ఈ నెల 15వ తేదీ నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులోకి తెస్తున్నాం. ఏజెన్సీలో 7 అన్న క్యాంటీన్లు పెడతాం. సంతకు వచ్చే గిరిజనులు అక్కడ రూ.5కే భోజనం చేయవచ్చు. ఈ నెలాఖరుకు డీఎ్‌ససీ ద్వారా టీచర్లను నియమిస్తాం. రాష్ట్రానికి ఇప్పటివరకూ పది లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు చేశాం. వాటి ద్వారా 9 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి.. కొత్త ప్రాజెక్టు ఒకటి ప్రారంభించి 5 వేల మంది గిరిజన మహిళలకు ఏడాదికి లక్ష చొప్పున ఆదాయం వచ్చేలా చేస్తాం. సమాజంలో పేదలను పైకి తీసుకురావడానికి ఆర్థికంగా స్థితిమంతులైన వారు సాయం చేయాలనే తలంపుతో పీ-4 పథకం అమలు చేస్తున్నాం.’’ అని చంద్రబాబు తెలిపారు.