CM Chandrababu: తప్పు చేసినవారిని వదలను
ABN , Publish Date - Sep 26 , 2025 | 04:01 AM
అసెంబ్లీ స్పీకర్, డిప్యూటీ స్పీకర్., సీఎం, డిప్యూటీ సీఎం.. ఇక్కడున్న చాలా మందిమి గత ప్రభుత్వ బాధితులమే. ఎప్పుడూ తప్పు చేయని నాపై 17 కేసులు పెట్టారు.
నాది కక్ష రాజకీయమైతే అధికారంలోకి రాగానే జైల్లో వేసేవాడిని
ప్రజాస్వామ్యంపైనే నాడు వైసీపీ దాడి.. స్పీకర్, డిప్యూటీ స్పీకర్, డిప్యూటీ సీఎం.. అంతా బాధితులమే.. ఏ తప్పూ చేయని నాపై 17 కేసులు: సీఎం
జైల్లోనూ డ్రోన్లతో నిరంతర నిఘా పెట్టారు
రాజధాని మహిళల నుంచి నేతలదాకా కేసులు
ఆ అరాచకాలు ఇప్పటికీ జీర్ణం కావట్లేదు
అవన్నీ ప్రజలకు వివరించి చట్టపరంగా శిక్షిద్దాం: సీఎం చంద్రబాబు
శాంతిభద్రతలపై చర్చ సందర్భంగా సీఎం వెల్లడి
అమరావతి, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): ‘‘అసెంబ్లీ స్పీకర్, డిప్యూటీ స్పీకర్., సీఎం, డిప్యూటీ సీఎం.. ఇక్కడున్న చాలా మందిమి గత ప్రభుత్వ బాధితులమే. ఎప్పుడూ తప్పు చేయని నాపై 17 కేసులు పెట్టారు. జైల్లో బంధించి నా కదలికలపై నిఘాకోసం డ్రోన్లు ఎగురవేశారు. నేను కక్షపూరిత రాజకీయాలు చేస్తే అధికారంలోకి వచ్చిన మొదటిరోజే అరెస్టులు చేయించేవాళ్లం. నాకు ప్రజలు, రాష్ట్రం పట్ల బాధ్యత ఉంది’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. గురువారం అసెంబ్లీలో రాష్ట్ర శాంతి భద్రతలపై చర్చలో ఆయన మాట్లాడారు. ‘‘నాగరిక ప్రపంచంలో శాంతి భద్రతలే కీలకం. గత ఐదేళ్ల అరాచకాలు ఇప్పటికీ జీర్ణం కావట్లేదు. అన్నీ చర్చించి ఆధారాలతో సహా చట్టపరంగా చర్యలు తీసుకుందాం. వాళ్లు (వైసీపీ నేతలు) చేసిన తప్పు మనం చేస్తే రాష్ట్రానికి న్యాయం జరగదు. తప్పు చేసిన ఎవరినీ వదిలిపెట్టను’’ అని ముఖ్యమంత్రి తెలిపారు. ఆనాటి వైసీపీ అరాచకాలను ఆయన గుర్తుచేశారు. ‘‘ప్రాజెక్టుల పరిశీలనలో ఉంటే వచ్చి.. అరెస్టు చేస్తున్నామన్నారు. కేసు ఏంటని అడిగితే చెప్పరు. ముందు జీపు ఎక్కండి అంటారు. అంగళ్లులో నాతో పాటు రామ్‌ప్రసాద్‌రెడ్డి, కిశోర్ కుమార్ అనే ఇద్దరు టీడీపీ కార్యకర్తలపై దాడి చేసి ఎదురు కేసులు పెట్టారు.
ఈ వయసులో అయ్యన్నపాత్రుడిపై అత్యాచారం కేసు పెట్టారు. జేసీ ప్రభాకర్‌రెడ్డి, చింతమనేని ప్రభాకర్, దేవినేని ఉమా, కొల్లు రవీంద్ర, అచ్చెన్నాయుడు, బీసీ జనార్దన్‌రెడ్డి, పులివర్తి నాని.. ఆఖరికి ఎంతో సౌమ్యుడైన నిమ్మల రామానాయుడుపైనా పదుల సంఖ్యలో కేసులు పెట్టారు. విశాఖలో పవన్ కల్యాణ్, యువగళంలో లోకేశ్... ఎవ్వరినీ వదలకుండా వేధించారు. మిమ్మల్ని కాపాడుకోవడానికి ఆ రోజు (రఘురామకృష్ణంరాజు అరెస్టు) రాత్రంతా నిద్ర లేకుండా అన్ని కోర్టుల్లోని లాయర్లతో సమన్వయం చేసుకొంటూ గడిపాం. అమరావతికి భూములిచ్చిన రైతులను వేధించి కేసులు పెట్టారు. న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు.. అనే కార్యక్రమానికి వెళుతున్న మహిళలు కన్నీళ్లు పెట్టుకుని రోడ్లపైనే భోజనాలు చేసే దారుణ స్థితి కల్పించారు. అప్పటి అరాచకాలన్నీ చెప్పాలంటే రోజులు సరిపోవు. మీ ఆవేశంలో అర్థముంది.. మీ ఆవేదన పట్ల సానుభూతి ఉంది. నేనూ బాధితుడినే. కాకపోతే నాది కక్ష రాజకీయం కాదు. అందుకే 23 క్లైమోర్‌లతో పేల్చినా.. బయట పడి 23వసారి తిరుమలేశుడికి పట్టువస్త్రాలు సమర్పించాను’’ అని చంద్రబాబు వివరించారు. మావోయిస్టుల హింసకు తాను వ్యతిరేకం తప్ప వారితో ఎలాంటి ఇబ్బందీ లేదన్న చంద్రబాబు, తనకు రాష్ట్ర భవిష్యత్తు తప్ప ప్రాణాలు ముఖ్యం కాదని వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఇంకా ఏమన్నారంటే..
నేర ప్రవృత్తిని కట్టడి చేద్దాం.
‘‘రాష్ట్రంలో నేర ప్రవృత్తి ఉన్న ప్రతి ఒక్కరినీ కట్టడి చేసి వీలైనంత మేరకు నేరాలు తగ్గించేందుకు అందరం కృషి చేద్దాం. హింసకు పాల్పడితే సొంత మనుషులైనా ఉపేక్షించబోను. గతంలో భూమా నాగిరెడ్డి, బైరెడ్డి రాజశేఖర్ రెడ్డిని కూడా ఫ్యాక్షన్ గొడవల్లో అరెస్టు చేయించాను. అప్పట్లో పోలీసు వ్యవస్థ సమర్ధవంతంగా పనిచేసేది. గత ఐదేళ్లలో భ్రష్టు పట్టించారు. నేరస్థులకు అండగా ఉండే రాజకీయ నాయకుల్ని చూశాను తప్ప నేరస్థులే రాజకీయ ముసుగు వేసుకుని అరాచకాలకు పాల్పడం వైసీపీ హయాంలోనే చూశాను.’’
బాధితులకు న్యాయం చేస్తాం..
‘‘వైసీపీ అరాచకాలకు బలైన వారి కుటుంబసభ్యులకు న్యాయం చేస్తాం. టీడీపీ కార్యకర్త తోట చంద్రయ్య, సోదరిని రక్షించుకునే క్రమంలో ఆహుతైన అమరేంద్ర గౌడ్, వైసీపీ ఎమ్మెల్సీ డ్రైవర్ సుబ్రమణ్యం, దళిత డాక్టర్ సుధాకర్, పల్నాడులో జల్లయ్య హత్య కేసు, వైసీపీ నేత అదే జిల్లాలో గిరిజన మహిళను ట్రాక్టర్‌తో తొక్కించిన ఘటన, కడపలో వెటర్నరీ డాక్టర్ హత్య తదితర కేసులపై సీబీఐ దర్యాప్తు చేస్తోంది. బాధ్యులకు కోర్టుల్లో శిక్షలు పడేలా ఆధారాలు సేకరిస్తోంది’’ అని చంద్రబాబు తెలిపారు.
చట్టాన్ని బలోపేతం చేస్తాం..
‘‘మారుతున్న కాలానికి అనుగుణంగా సైబర్ నేరాలు, ఆర్థిక మోసాలు పెరుగుతున్నాయి. వాటి కట్టడికి పోలీసుశాఖ సైబర్ కమెండోలను సిద్ధం చేస్తోంది. డిజిటల్ అరెస్టులు, ఈడీ, సీబీఐ అనగానే విద్యావంతులే కోట్ల రూపాయలు సైబర్ నేరగాళ్లకు సమర్పించుకొంటున్నారు. ఇది బాధాకరం. ఫేక్ ప్రచారాలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. ఇతర దేశాల్లో టీమ్‌లు ఏర్పాటు చేసుకుని తప్పుడువార్తలు సృష్టించి సోషల్ మీడియాలో వదులుతున్నారు. వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ పైశాచికానందం పొందుతున్నారు. త్వరలో చట్టాన్ని మరింత బలోపేతం చేసి ఇలాంటి వారిని శిక్షిస్తాం. రాజధానికి భూములిచ్చిన ఆడబిడ్డల్ని వ్యభిచారులనడం కన్నా దారుణం ఏముంటుంది? మా ప్రభుత్వం అధికారంలోకొచ్చే నాటికి రాష్ట్రమంతా గంజాయి, మత్తు విస్తరించింది. ఈగల్ వింగ్ ఏర్పాటు చేసి గంజాయి జీరో సాగులోకి తీసుకొచ్చే క్రమంలో దాదాపు విజయం సాధించాం.’’