AP CM Chandrababu: ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టండి
ABN , Publish Date - Sep 29 , 2025 | 03:05 AM
తీవ్ర జ్వరంతో కొద్దిరోజులుగా బాధపడుతున్న ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు పరామర్శించారు.
త్వరగా కోలుకుని రండి.. పవన్ కల్యాణ్‌కు చంద్రబాబు పరామర్శ
‘ఆటోడ్రైవర్ల సేవలో’పై చర్చ.. స్త్రీశక్తిలాగే ఈ పథకానికీ జనం మన్ననలు
డిప్యూటీ సీఎం ఆశాభావం.. ప్రధాని రాష్ట్ర పర్యటనపైనా ఇరువురి చర్చ
అమరావతి/హైదరాబాద్, సెప్టెంబరు 28(ఆంధ్రజ్యోతి): తీవ్ర జ్వరంతో కొద్దిరోజులుగా బాధపడుతున్న ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు పరామర్శించారు. ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. జ్వరం నుంచి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆదివారం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో జనసేనాని నివాసానికి సీఎం వెళ్లారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం జ్వర తీవ్రత తగ్గిందని, దగ్గు ఎడతెరిపి లేకుండా వస్తోందని పవన్ చెప్పారు. పరీక్షలు చేసి క్రానిక్ బ్రాంకైటిస్ మూలంగా దగ్గు వస్తున్నట్లు వైద్యులు చెప్పారని, దగ్గు కారణంగా గొంతు నొప్పి కూడా ఉందన్నారు. అక్టోబరు 4న ‘ఆటో డ్రైవర్ల సేవలో’ పథకం ప్రారంభించనున్న నేపథ్యంలో ఆ అంశంపై డిప్యూటీ సీఎంతో చంద్రబాబు చర్చించారు. స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీని విజయవంతంగా అమలు చేయగలిగామని, తద్వారా మహిళలకు ఆర్థిక వెసులుబాటు కలుగుతోందని సీఎం అన్నారు. ఈ పథకం కారణంగా ఆటో డ్రైవర్లకు ఇబ్బంది కలుగకూడదన్న ఉద్దేశంతో వారికి కూడా ఏటా రూ.15 వేల చొప్పున ఆర్థిక భరోసా కల్పించే నిర్ణయాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు.
ఆటో డ్రైవర్ల కోసం చంద్రబాబు చేసిన ఆలోచన గొప్పదని, స్త్రీశక్తిలాగే ఈ పథకం కూడా అందరి మన్ననలు పొందుతుందని పవన్ విశ్వాసం వ్యక్తంచేశారు. జీఎస్‌టీ 2.0 సంస్కరణల్లో భాగంగా రాష్ట్రంలో చేపట్టనున్న జీఎస్‌టీ ఉత్సవ్ కార్యక్రమం నిర్వహణపై ఇద్దరూ చర్చించారు. అక్టోబరు 16న ప్రధాని మోదీ శ్రీశైలం రానున్న సందర్భంగా రోడ్‌షో నిర్వహణ విజయవంతం చేసే ప్రణాళికపైనా మాట్లాడుకున్నారు. వీటిపాటు డీఎస్సీ అంశం కూడా ఇద్దరి మధ్య చర్చకు వచ్చింది. మెగా డీఎస్సీని విజయవంతంగా నిర్వహించి, ఒకే సారి 15,941 మందికి ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇవ్వడాన్ని పవన్ ప్రస్తావించారు. ఉద్యోగాలకు ఎంపికైన వారికి నియామక పత్రాలు అందించే కార్యక్రమాన్ని నిర్వహించి యువతలో మనోధైర్యాన్ని, స్ఫూర్తిని నింపారని సీఎంను ప్రశంసించారు.