Share News

Naravaripalle: స్వగ్రామంలో సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Oct 08 , 2025 | 06:00 AM

సీఎం చంద్రబాబు మంగళవారం తన స్వగ్రామమైన తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లె వచ్చారు. తన సోదరుడు, మాజీ ఎమ్మెల్యే రామ్మూర్తి నాయుడి సంవత్సరీకం పూజల్లో పాల్గొన్నారు.

 Naravaripalle: స్వగ్రామంలో సీఎం చంద్రబాబు

  • సోదరుడి సంవత్సరీక పూజల్లో పాల్గొని నివాళి

  • ప్రజల నుంచి వినతుల స్వీకరణ.. సమస్యల పరిష్కారానికి ఆదేశాలు

తిరుపతి, అక్టోబరు 7(ఆంధ్రజ్యోతి): సీఎం చంద్రబాబు మంగళవారం తన స్వగ్రామమైన తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లె వచ్చారు. తన సోదరుడు, మాజీ ఎమ్మెల్యే రామ్మూర్తి నాయుడి సంవత్సరీకం పూజల్లో పాల్గొన్నారు. ఉదయం 11.30కు చంద్రగిరి మండలం ఎ.రంగంపేట హెలిపాడ్‌కు చేరుకున్న చంద్రబాబు.. అక్కడి నుంచి రోడ్డుమార్గాన నారావారిపల్లె వచ్చారు. ఇంట్లో పూజలు పూర్తయ్యాక సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేశ్‌, సోదరుడి సతీమణి ఇందిర, వారి కుమారులు రోహిత్‌, గిరీశ్‌తో కలసి స్మృతివనంలోని రామ్మూర్తినాయుడు సమాధిని సందర్శించి, నివాళులు అర్పించారు. అనంతరం ఇంటికి చేరుకుని, అక్కడికి వచ్చిన నాయకులు, కార్యకర్తలు, ప్రజలతో మాట్లాడారు. మధ్యాహ్నం 2.15కు లోకేశ్‌తో కలసి హెలికాప్టర్‌లో ఉండవల్లికి తిరుగు ప్రయాణమయ్యారు.


మానసిక వికలాంగురాలి గోడు విని.. చలించిన సీఎం

సోదరుడి సంవత్సరీకంలో పాల్గొనేందుకు స్వగ్రామానికి వచ్చిన సీఎం చంద్రబాబు.. కేవలం మూడు గంటలు మాత్రమే ఇక్కడ గడిపారు. పూజా కార్యక్రమాల్లో బిజీగా ఉన్నా.. మధ్యలో అరగంటకుపైగా ప్రజల కోసం కేటాయించారు. తనను కలిసేందుకు వచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలను పలకరిస్తూనే జనం నుంచి వినతులు స్వీకరించారు. బాధిత జనం చెప్పింది ఓపికగా విని, తదుపరి చర్యల కోసం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తిరుగు ప్రయాణంలో వైకల్యంతో బాధపడుతున్న పదేళ్ల చిన్నారిని చూసి కాన్వాయ్‌ ఆపించి మరీ పలకరించారు. నాయుడుపేటకు చెందిన మానసిక వికలాంగురాలు ప్రత్యూష వివరాలు తెలుసుకున్నారు. తల్లిదండ్రులు లేని ఆ చిన్నారి పెద్దనాన్న సంరక్షణలో ఉందని, 90 శాతం వైకల్యంతో ఉన్నా.. పూర్తి పెన్షన్‌ అందడం లేదని తెలుసుకున్న సీఎం.. ప్రస్తుతం ఇస్తున్న రూ.6 వేలు కాకుండా రూ.15 వేలు పెన్షన్‌ అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ను ఆదేశించారు. ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు పులివర్తి నానీ, ఆరణి శ్రీనివాసులు, గాలి భానుప్రకాష్‌, విజయశ్రీ, బొజ్జల సుధీర్‌రెడ్డి, థామస్‌, మురళీమోహన్‌, ఆదిమూలం, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Oct 08 , 2025 | 06:01 AM