Share News

AP Govt: పూర్వోదయతో ఉషోదయం

ABN , Publish Date - Dec 10 , 2025 | 04:06 AM

పూర్వోదయ పథకం కింద కేంద్రం ఇచ్చే నిధుల ఆధారంగా రాష్ట్రంలోని మూడు ప్రాంతాల అభివృద్ధికి సత్వరం ప్రతిపాదనలు రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు...

AP Govt: పూర్వోదయతో ఉషోదయం

  • మూడు ప్రాంతాల అభివృద్ధికి కార్యాచరణ

  • సీమలో 20 లక్షల ఎకరాల్లో ఉద్యాన సాగు

  • ఉత్తరాంధ్రలో ప్రకృతి సేద్యంపై ప్రధాన దృష్టి

  • సాగునీరు, మౌలిక ప్రాజెక్టుల కోసం కేంద్ర ప్రభుత్వ నిధుల వినియోగం

  • త్వరలోనే నల్లమల సాగర్‌ పనులు

  • ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు

అమరావతి, డిసెంబరు 9(ఆంధ్రజ్యోతి): పూర్వోదయ పథకం కింద కేంద్రం ఇచ్చే నిధుల ఆధారంగా రాష్ట్రంలోని మూడు ప్రాంతాల అభివృద్ధికి సత్వరం ప్రతిపాదనలు రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సాగునీటి ప్రాజెక్టులు, ఉద్యాన పంటల విస్తరణ, గ్రామీణ రహదారులు వంటి మౌలిక వసతుల కల్పనకు ఈ పథకం నిధులను వినియోగించాలన్నారు. మంగళవారం సచివాలయంలో పూర్వోదయ పథకం ప్రతిపాదనలపై సీఎం సమీక్షించారు. ‘‘ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లో 82 క్లస్టర్లు ఉద్యాన పంటల కేంద్రంగా అభివృద్ధి, 20లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు విస్తరించేలా చర్యలు చేపట్టాలి. పూర్వోదయలో భాగంగా రూ.40వేల కోట్ల విలువైన ప్రాజెక్టులను చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలి. ఇందులో రూ.20వేలకోట్లు సాగునీటి ప్రాజెక్టులకు, మిగతా రూ.20వేల కోట్లతో మౌలిక వసతుల ప్రాజెక్టులను చేపట్టాలి. అందుకు అనుగుణంగా కార్యాచరణ ఉండాలి. ఇందులో రూ.ఐదు వేల కోట్లతో ప్రత్యేకంగా గ్రామీణ రహదారులు నిర్మించాలి. వాటికి జాతీయ, రాష్ట్ర రహదారులను అనుసంధానం చేయాలి. అలాగే ప్రకాశం, రాయలసీమ పరిధిలో మొత్తం 23 మేజర్‌, మీడియం ప్రాజెక్టులను, 1,021 చెరువులను పూర్తి చేసి, ఉద్యాన పంటలకు నీరు అందించేలా కార్యాచరణ చేపట్టాలి’’ అని సీఎం నిర్దేశించారు. కాగా, పోలవరం-నల్లమల సాగర్‌ ప్రాజెక్టుల అనుసంధానంపై కూడా అధికారులతో సీఎం చంద్రబాబు చర్చించారు. ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే నెల్లూరు,ప్రకాశం జిల్లాల్లో కొత్తగా ఏడు లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించే అవకాశం ఉంటుందని అధికారులు చెప్పారు. మరో ఆరు లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ, 60 లక్షల మందికి తాగునీరు అందుతుందని వివరించారు. పారిశ్రామిక అవసరాలకు 20 టీఎంసీల నీరు కేటాయించే వీలుంటుందని చెప్పగా, ఇందుకు సంబంధించి త్వరలోనే పనులు మొదలు పెట్టాలని సీఎం ఆదేశించారు. ఈ సమీక్షలో మంత్రులు పయ్యావుల కేశవ్‌, నిమ్మల రామానాయుడు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


వృద్ధి రేటును పెంచేదెలా?

రాష్ట్రంలో వృద్ధి రేటు పెంపునకు రానున్న నాలుగు నెలల్లో తీసుకోవాల్సిన చర్యలు, అమలు చేయాల్సిన ప్రణాళికపై సచివాలయంలో బుధవారం మంత్రులు, కార్యదర్శులు, హెచ్‌ఓడీలతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించనున్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో మొదటి రెండు త్రైమాసికాల్లో సాధించిన ఆర్థిక ఫలితాలపై చర్చించి, మూడు, నాలుగు త్రైమాసికాల్లో సాధించాల్సిన లక్ష్యాలపై అధికారులకు దిశానిర్దేశం చేస్తారు. పథకాలు, పౌర సేవలపై ప్రజల్లోని సంతృప్త స్థాయిని అంచనా వేయడంతోపాటు ఫైళ్ల క్లియరెన్స్‌, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక, అవేర్‌, డేటాలేక్‌, ఐటీ అప్లికేషన్లపై అధికారులు ప్రజంటేషన్‌ ఇస్తారు. ప్రజల నుంచి వచ్చే అర్జీలు, ఫిర్యాదుల పరిష్కారంపై హెచ్‌ఓడీలకు సీఎం సూచనలు ఇస్తారు. కేంద్ర ప్రాయోజిత పథకాలు, రాష్ట్రంలో అమలుచేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, వాటి ఫలితాలపై, గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న రుణాలు, వాటి రీస్ట్రక్చరింగ్‌ అంశాలపై శాఖల వారీగా సమీక్ష నిర్వహిస్తారు.

Updated Date - Dec 10 , 2025 | 04:08 AM