Share News

CM Chandrababu: పుట్టిన ఊరి రుణం తీర్చుకోవాలి..

ABN , Publish Date - Oct 25 , 2025 | 04:45 AM

జన్మభూమి.. కర్మభూమి.. ఈ రెండింటినీ ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. ఏ దేశంలో ఉంటే ఆ దేశ కట్టుబాట్లను, రాజ్యాంగాలను గౌరవించాలి

CM Chandrababu: పుట్టిన ఊరి రుణం తీర్చుకోవాలి..

  • అందరం కలిసి పుట్టిన ఊరి రుణం తీర్చుకోవాలి

  • గల్ఫ్‌లోని తెలుగు ప్రవాసులకు చంద్రబాబు పిలుపు

  • నాడు మైక్రోసాఫ్ట్‌ హైదరాబాద్‌కు గేమ్‌ చేంజర్‌

  • అలాగే నేడు గూగుల్‌ విశాఖకు, ఏపీకి

  • తెలుగుజాతికి ప్రపంచంలో తిరుగులేదు

  • ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా..తెలుగువారు ఉండాలన్నది నా కోరిక

  • వారిని గ్లోబల్‌ సిటిజన్స్‌గా చూడాలనుకున్నాకానీ గ్లోబల్‌ లీడర్స్‌గా ఎదుగుతున్నారు

  • ‘స్వర్ణాంధ్ర’ లక్ష్యానికి సహకరించండి: సీఎం

ప్రపంచంలో ఎక్కడున్నా అందరినీ మెప్పించడంలో తెలుగువారు ముందుంటారు. దుబాయ్‌ పాలకులను సైతం మెప్పించి ఇక్కడ హిందూ దేవాలయాన్ని కట్టడమే దానికి నిదర్శనం.

- సీఎం చంద్రబాబు

అమరావతి, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): ‘జన్మభూమి.. కర్మభూమి.. ఈ రెండింటినీ ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. ఏ దేశంలో ఉంటే ఆ దేశ కట్టుబాట్లను, రాజ్యాంగాలను గౌరవించాలి. అదే సమయంలో అందరం కలిసి జన్మభూమి రుణం తీర్చుకోవాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపిచ్చారు. యూఏఈ పర్యటనలో భాగంగా చివరి రోజు శుక్రవారం దుబాయ్‌లోని లీమెరిడియన్‌ హోటల్‌లో జరిగిన ప్రవాస తెలుగు ప్రజల సభలో సీఎం ప్రసంగించారు. ప్రపంచంలో ఎక్కడకు వెళ్లినా అక్కడ తెలుగువారు ఉండాలన్నది తన కోరికగా పేర్కొన్నారు. తెలుగువారిని గ్లోబల్‌ సిటిజన్స్‌గా చూడాలనుకున్నానని, కానీ వారు నేడు గ్లోబల్‌ లీడర్స్‌గా ఎదుగుతుండడం గర్వంగా ఉందన్నారు. 2047 నాటికి హెల్తీ.. వెల్తీ.. హ్యాపీ స్వర్ణాంధ్రప్రదేశ్‌ తన లక్ష్యమని.. దానికి అందరూ సహకరించాలని కోరారు. ఇంకా చంద్రబాబు ఏమన్నారంటే..


అత్యంత ప్రభావవంతమైన జాతి..

నేను 30 ఏళ్లుగా దుబాయ్‌ వస్తున్నా.. ఇప్పుడు మీలో చూస్తున్న ఉత్సాహాన్ని గతంలో ఎప్పుడూ చూడలేదు. 1995లో నేను సీఎం అయినప్పుడు తెలుగువారందరికీ ఒకే మాట చెప్పేవాడిని.. మీ పిల్లలకు ఆస్తులివ్వడం కన్నా మంచి చదువు చెప్పించండని చెప్పేవాడిని. ప్రపంచాన్ని జయించగల సత్తా తెలుగువారిది. హైదరాబాద్‌కు మైక్రోసా్‌ఫ్టను తీసుకొచ్చాను అందులో ఉద్యోగం చేయడానికి వెళ్లిన సత్య నాదెళ్ల నేడు అదే సంస్థకు సీఈవోగా ఉన్నారు. ఆయన ఏడాది జీతం రూ.850 కోట్లు. తెలుగుజాతికి తిరుగులేదన్నది నా ప్రగాఢ విశ్వాసం. ప్రపంచంలో నంబర్‌ వన్‌గా జాతిగా.. అత్యంత ప్రభావవంతమైన జాతిగా నిలుస్తుందనడంలో సందేహమే లేదు. 2024 ఎన్నికల్లో మీరంతా వచ్చి కూటమి విజయానికి సొంత డబ్బులు ఖర్చు పెట్టి మరీ పనిచేశారు. మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా రాష్ట్ర పునర్నిర్మాణానికి నేను, పవన్‌ కల్యాణ్‌.. ప్రధాని మోదీ నేతృత్వంలో పనిచేస్తున్నాం.

అప్పుడు మైక్రోసాఫ్ట్‌.. ఇప్పుడు గూగుల్‌

హైదరాబాద్‌ 25 సంవత్సరాల క్రితం ఎలా ఉంది.. ఇప్పుడెలా అభివృద్ధి చెందింది..? దానికి కారణం టీడీపీ. అప్పుడు హైదరాబాద్‌ గేమ్‌ చేంజర్‌గా మైక్రోసాఫ్ట్‌.. ఐటీ ప్రమోషన్‌ పనిచేశాయి. ఇప్పుడు గూగుల్‌, కృత్రిమ మేధ (ఏఐ).. విశాఖ, ఏపీకి గేమ్‌ చేంజర్‌గా నిలవనున్నాయి. విశాఖలో గూగుల్‌ 15 బిలియన్‌ డాలర్ల పెట్టుబడి పెడుతోంది. త్వరలోనే ఏపీ దశదిశ మారనుంది. ఒక రైతుకూలీ బిడ్డ ఐటీ ప్రొఫెషనల్‌ అయ్యాడంటే ఆ ఘనత టీడీపీది. క్వాంటమ్‌ వ్యాలీ ఉండే ఏకైక దేశం భారతదేశం.. అది కూడా ఆంధ్రప్రదేశ్‌. ఎప్పటికప్పుడు ఆలోచనలు మారుతూ ఉండాలి. అప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుంది. అబూధాబీ ఒకప్పుడు ఆయిల్‌ ఎకానమీపై ఆధారపడి ఉండేది.. ఇప్పుడు నాలెడ్జ్‌ ఎకానమీగా, పర్యాటక రంగం వైపు అడుగులు వేస్తోంది. 1.50 లక్షల హోటల్‌ గదుల సామర్థ్యంతో ఆతిథ్య రంగాన్ని తయారు చేసుకోవడంతో దుబాయ్‌కి పెద్ద ఎత్తున ఆదాయం వస్తోంది.


ఐటీతో విప్లవాత్మక మార్పులు

గతంలోలా హార్డ్‌ వర్క్‌ చేయాల్సిన పనిలేదు.. స్మార్ట్‌ వర్క్‌ చేసే రోజుల్లో ఉన్నాం. ఏపీలో ఐటీని ఉపయోగించుకుని విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నాం. 16 నెలల్లోనే 750 సేవలను వాట్సా్‌పలో తీసుకొచ్చాం. అమరావతిలో క్వాంటమ్‌ వ్యాలీ వచ్చే జనవరి నుంచి పనిచేయనుంది. తిరుపతి సమీపంలో స్పేస్‌ సిటీ పెట్టి శాటిలైట్‌ సర్వీసులను ప్రపంచానికి అందజేసేందుకు సిద్ధమవుతున్నాం. కర్నూలు జిల్లా ఓర్వకల్లులో డ్రోన్‌ సిటీ ఏర్పాటు చేస్తున్నాం. భవిష్యత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలను తయారుచేసి దుబాయ్‌కి కూడా అందించే పరిస్థితికి వస్తాం. గ్రీన్‌ ఎనర్జీని ప్రోత్సహిస్తున్నాం. రాబోయే 10 ఏళ్లలో వినూత్న మార్పులు రాబోతున్నాయి. దేశంలోని ప్రతి పౌరుడి డేటాతో డేటాలేక్‌ రూపొందిస్తున్నాం. ఎడారిగా ఉండే దుబాయ్‌నే ఇక్కడి పాలకులు స్వర్గంలా చేశారంటే అన్ని ఉన్న భారతదేశం ఏ స్థాయిలో అభివృద్ధి చెందాలో ఆలోచించండి.

అనూహ్య స్పందన..

తెలుగు ప్రవాసుల సభకు అనూహ్య స్పందన లభించింది. గల్ఫ్‌ నలుమూలల నుంచి భారీ సంఖ్యలో వారు తరలివచ్చారు. కువైట్‌, ఒమాన్‌, బహ్రెయిన్‌, ఖతార్‌ దేశాల నుంచి పెద్ద ఎత్తున తెలుగువారు తరలి రావడంతో సమావేశ మందిరం కిటకిటలాడింది. కార్యక్రమానికి హాజరైన తెలుగువారందరితోనూ చంద్రబాబు ఓపిగ్గా ఫొటోలు దిగారు. మంత్రులు టీజీ భరత్‌, బీసీ జనార్దన్‌రెడ్డి, ఏపీఎన్నార్టీ చైర్మన్‌ వేమూరి రవి తదితరులు పాల్గొన్నారు.


రాష్ట్రానికి త్వరలోయూఏఈ ప్రత్యేక బృందం

సీఎంకు ఆ దేశ విదేశీ వాణిజ్య మంత్రి హామీ

యూఏఈ విదేశీ వాణిజ్య మంత్రి థానీ బిన్‌ అహ్మద్‌తోనూ చంద్రబాబు బృందం సమావేశమైంది. వాణిజ్యం, పెట్టుబడులు, ఆర్థిక సహకారంపై చర్చించారు. ఫుడ్‌ ప్రాసెసింగ్‌, పునరుత్పాదక ఇంధనం, పెట్రో కెమికల్స్‌, రియల్‌ ఎస్టేట్‌ వంటి రంగాల్లో భాగస్వామ్యంతోపాటు అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు థానీ ఆసక్తి చూపించారు. పెట్టుబడి అవకాశాలను పరిశీలించేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తామని.. త్వరలో రాష్ట్రాన్ని సంందర్శిస్తుందని హామీ ఇచ్చారు. దుబాయ్‌ వర్చువల్‌ అసెట్స్‌ రెగ్యులేటరీ అథారిటీ(వీఏఆర్‌ఏ) మేనేజింగ్‌ డైరెక్టర్‌ దీపారాజా కార్బన్‌తో, క్రౌన్‌ ఎల్‌ఎన్జీ సీఈవో స్వపన్‌ కటారియా, ట్రైస్టార్‌ గ్రూప్‌ సీఈవో యూజిన్‌ మేయిన్‌, ఆస్టర్‌ గ్రూప్‌ వ్యవస్థాపకుడు డాక్టర్‌ ఆజాద్‌ మూపెన్‌తోనూ చంద్రబాబు సమావేశాలు నిర్వహించారు. ఏపీలో అంతర్జాతీయ స్థాయి వైద్య సదుపాయాల కల్పనకు పెట్టుబడులు పెట్టేందుకు ఆస్టర్‌ గ్రూప్‌ సానుకూలంగా స్పందించింది.

ఏఐలో కొత్త ఆవిష్కరణలపై.. కలిసి పనిచేద్దాం!

యూఏఈ-ఆంధ్ర అంగీకారం

కృత్రిమ మేధ(ఏఐ)లో కొత్త ఆవిష్కరణలు, స్టార్ట్‌పలను ప్రోత్సహించేలా ఏపీలోని రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌-దుబాయ్‌ సిలికాన్‌ ఒయాసి్‌స(డీఎ్‌సవో) మధ్య కొత్త భాగస్వామ్యాలకు యూఏఈ అంగీకారం తెలిపింది. సీఎం చంద్రబాబు శుక్రవారం దుబాయ్‌లో యూఏఈ ఆర్థిక వ్యవహారాలు, పర్యాటక మంత్రి అబ్దుల్లా బిన్‌ తౌక్‌ అల్‌ మర్రీతో సమావేశమయ్యారు. దుబాయ్‌ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న టెక్నాలజీ పార్కు, దుబాయ్‌ సిలికాన్‌ ఒయాసి్‌సలో అమలు చేస్తున్న విధానాలపై చర్చించారు. ఏఐ ద్వారా పాలన, పౌర సేవలను మరింత మెరుగ్గా అందించడం.. పౌరసేవలు, పాలనా అంశాల్లోని అత్యుత్తుమ విధానాలను ఆర్టీజీఎస్‌ ద్వారా ఇచ్చిపుచ్చుకోవడం, యూఏఈ-ఏపీ వాణిజ్య బంఽధం బలోపేతంపై సీఎం చర్చించారు. లాజిస్టిక్స్‌, రవాణా, మౌలిక రంగాల్లో పెట్టుబడులు, నూతన భాగస్వామ్యాల ఏర్పాటుపైనా చర్చించారు.

Updated Date - Oct 25 , 2025 | 06:27 AM