CM Chandrababu Urges Students to Serve Public Interest: సమాజ హితం కోసమే ప్రజాప్రతినిధులు
ABN , Publish Date - Nov 27 , 2025 | 05:48 AM
వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఎవ్వరూ సభకు రాకూడదు. సమాజ హితం కోసం ప్రజాప్రతినిధులుగా చట్టసభలకు రావాలి. అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు..
వ్యక్తిగత ప్రయోజనాలకు చట్టసభలు వేదిక కాకూడదు
చాయ్‌వాలా ప్రధాని అయ్యారంటే.. అది రాజ్యాంగం గొప్పతనం
మాక్ అసెంబ్లీలో విద్యార్థులు అదరగొట్టారు: సీఎం చంద్రబాబు
అమరావతి, నవంబరు 26(ఆంధ్రజ్యోతి): ‘వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఎవ్వరూ సభకు రాకూడదు. సమాజ హితం కోసం ప్రజాప్రతినిధులుగా చట్టసభలకు రావాలి.’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. అసెంబ్లీ ప్రాంగణంలో బుధవారం నిర్వహించిన మాక్ అసెంబ్లీకి ఆయన హాజరయ్యారు. మాక్ అసెంబ్లీలో విద్యార్థులు అదరగొట్టారని ప్రశంసించారు. ఈ కార్యక్రమాన్ని సమర్థంగా నిర్వహించిన పిల్లలను చూస్తుంటే ముచ్చటేస్తోందన్నారు. ‘‘అసెంబ్లీ ఆదర్శంగా ఉండాలని నేను ఎప్పుడూ కోరుకుంటాను. విద్యార్థుల్లో బాధ్యత, చైతన్యం రావడానికి సంవిధాన్ దివస్ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నాం. మన కోసం మనం రాజ్యాంగాన్ని రాసుకున్నాం. 28 ఏళ్లకే నేను ఎమ్మెల్యే అయ్యాను. యూనివర్సిటీలో చదువుకునేటప్పుడు ప్రజాప్రతినిధి అవ్వాలని కోరుకున్నాను. మా వైస్ చాన్సలర్ పిలిచి లెక్చరర్‌గా చేరాలని అడిగితే.. ఎమ్మెల్యే అవుతానని చెప్పాను. 1978లో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచి కనబడతానని చెప్పి, గెలిచి చూపించాను. నిర్దేశించుకున్న లక్ష్యం కోసం నిరంతరం శ్రమించాలి. ప్రతి ఒక్కరికీ సంక్షోభాలు వస్తాయి. వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలి. సరైన నిర్ణయం తీసుకుని ముందుకెళ్లాలి. అందువల్లే నేను 9 సార్లు ఎమ్మెల్యే అయ్యాను. 30ఏళ్లకే మంత్రి, 40 ఏళ్లకు సీఎం అయ్యాను. స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఏడుసార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీ అయ్యారు. నా కంటే చిన్న వయసులోనే మీరు మాక్ అసెంబ్లీకి వచ్చి సమర్థంగా నిర్వహించారు. ఒక చాయ్‌వాలా దేశానికి ప్రధాని అయ్యారు. ఆయన ఈ దేశం దిశ మార్చారంటే అది రాజ్యాంగం మనకు ఇచ్చిన గొప్ప వరం. దేశంలో ఏ ఒక్కరూ రాజ్యాంగం కంటే గొప్పవారు కాదు. సోషల్ మీడియాలో మహిళల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా పోస్టులు పెడుతున్నారు. దీనికి అడ్డుకట్టపడాలి’ అని చంద్రబాబు పేర్కొన్నారు.