Share News

CM Chandrababu: స్పీడ్‌ పెంచండి

ABN , Publish Date - Nov 08 , 2025 | 04:29 AM

రాష్ట్రంలో పెట్టుబడుల జోరు పెంచడానికి వెంటనే అనుమతులు ఇవ్వడంతో పాటు ప్రోత్సాహకాలు, మౌలిక సదుపాయాల కల్పనలో వేగాన్ని పెంచాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు.

CM Chandrababu: స్పీడ్‌ పెంచండి

  • పెట్టుబడుల ప్రతిపాదనలకు తక్షణ ఆమోదం

  • భూములు తీసుకుని పరిశ్రమలు పెట్టకపోతే అనుమతులు రద్దు

  • రాష్ట్రంలో 3 మెగాసిటీల అభివృద్ధి

  • అనకాపల్లి-విజయనగరం వరకూ విశాఖ మెగా సిటీ

  • ఎస్‌ఐపీబీ సమావేశంలో చంద్రబాబు ఆదేశాలు

అమరావతి, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పెట్టుబడుల జోరు పెంచడానికి వెంటనే అనుమతులు ఇవ్వడంతో పాటు ప్రోత్సాహకాలు, మౌలిక సదుపాయాల కల్పనలో వేగాన్ని పెంచాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. విద్యుత్తు, రహదారులు, నీరు వంటి మౌలిక సదుపాయాలను త్వరితగతిన సమకూర్చాలన్నారు. శుక్రవారం వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన రాష్ట్రస్థాయి పెట్టుబడుల మండలి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. పరిశ్రమలు పెడతామంటూ గత ప్రభుత్వంలో భూములు పొంది, ఇప్పటికీ ఉత్పత్తులు చేపట్టని పరిశ్రమలకు అనుమతులు రద్దు చేయాలని ఆదేశించారు. పరిశ్రమల స్థాపనకు ల్యాండ్‌ బ్యాంకు ఏర్పాటు చేయాలని సూచించారు. ‘‘రాష్ట్రంలో వివిధ రంగాల్లో పెట్టుబడులు వచ్చేలా చూడటం అధికారుల బాధ్యత. పెట్టుబడిదారుల నుంచి ప్రతిపాదనలు తీసుకుని సమయం వృథా కాకుండా తక్షణం ఆమోదం తెలియజేయాలి. క్షేత్రస్థాయిలో పరిశ్రమల స్థాపనకు కావాల్సిన అనుమతులు త్వరితగతిన వచ్చేలా శ్రద్ధ పెట్టాలి. ప్రభుత్వం ఆమోదం పొందిన పరిశ్రమలు, ప్రాజెక్టులు గ్రౌండ్‌ అయ్యేలా చూసే బాధ్యతను అధికారులు తీసుకోవాలి. పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్తల నుంచి ఫిర్యాదులు రాకుండా చూడాలి. గత పాలకులు పరిశ్రమలకు భూములు కేటాయించినా, ఇప్పటికీ ఉత్పత్తులు ప్రారంభం కాని పరిశ్రమల సమాచారం ఇవ్వండి. భూములు తీసుకుని ప్రగతి దిశగా సాగని పరిశ్రమలకు అనుమతులు రద్దు చేయండి. ఎలకా్ట్రనిక్స్‌ పార్క్‌ ఏర్పాటుపై అధికారులు దృష్టిసారించాలి. భవిష్యత్తులో ఎలకా్ట్రనిక్స్‌ రంగంలో విస్తృతమైన అవకాశాలు ఉన్నాయి.


చిప్‌, సెమీ కండక్టర్‌, డ్రోన్‌ వంటి పరిశ్రమలను ప్రోత్సహించాలి. రాష్ట్రంలో సుమారు 15 పారిశ్రామిక జోన్లు ఏర్పాటు చేసుకుని క్లస్టర్‌ వారీ విధానంలో పారిశ్రామిక విధానాన్ని రూపొందించండి. వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టే పరిశ్రమలకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ప్రోత్సాహకాలు ఇస్తున్నాయి. ఇలాంటి వాటి గురించి ప్రమోట్‌ చేయాలి. కేంద్రం ఇచ్చే ప్రోత్సాహకాలు కొంచెం ఆలస్యమైనా రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో ఇవ్వా లి. దీనివల్ల పెట్టుబడులు చేజారవు. కేంద్రం నుం చి రావాల్సిన ప్రోత్సాహకాలపై సంప్రదింపులు జరుపుదా ం. పరిశ్రమలకు విద్యుత్తు సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా కేంద్ర తీసుకుంటున్న చర్యలు అమలయ్యేలా చూడాలి’’ అని చంద్రబాబు ఆదేశించారు.


మెగా సిటీలు, మాస్టర్‌ ప్లాన్‌లు

రాష్ట్రంలో మూడు మెగాసిటీలు అభివృద్ధి చేయాలని అధికారులకు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. అనకాపల్లి నుంచి విజయనగరం వరకూ విశాఖ మెగా సిటీగా అభివృద్ధి చేయాలని సూచించారు. తిరుపతి, అమరావతి నగరాలను మెగా సిటీలుగా అభివృద్ధి చేయాలని ఆదేశించారు. అమరావతికి ఇప్పటికే మాస్టర్‌ప్లాన్‌ ఉందని.. విశాఖ, తిరుపతికి మాస్టర్‌ ప్లాన్‌ను తయారు చేయాలని సూచించారు. ఈ మెగా సిటీల్లో టూరిజం, ఐటీ సహా వివిధ పరిశ్రమలకు సానుకూలంగా ఉండేలా చూడాలన్నారు. టూరిజం, ఐటీ, పరిశ్రమలు, మునిసిపల్‌ శాఖలు ఈ మేరకు సమన్వయం చేసుకుని ఈ మెగా సిటీలు అభివృద్ధి జరిగేలా చూడాలన్నారు. మెగా సిటీలకు టౌన్‌షి్‌పలు అభివృద్ధి చేయాలని స్పష్టం చేశారు. గూగుల్‌ డేటా సెంటర్‌ వల్ల విశాఖకు మరిన్ని కంపెనీలు, పరిశ్రమలు రానున్నాయని వెల్లడించారు. భవిష్యత్తులో విశాఖకు వచ్చే కంపెనీలు, పరిశ్రమలకు భూ లభ్యత ఉండేలా చూసుకోవాలన్నారు. టూరిజం అభివృద్ధికి ఆతిథ్య రంగాన్ని ప్రోత్సహించాలని సూచించారు. రాష్ట్రంలో మూడు ఎకనామిక్‌ కారిడార్లు ఏర్పాటవుతున్నాయని చెప్పారు. ఈ మూడు కారిడార్లకు ముగ్గురు సీనియర్‌ అధికారులను నియమిస్తామన్నారు. బీచ్‌ టూరిజాన్ని మరింత అభివృద్ధి చేయాలన్నారు.


ఘనంగా పెట్టుబడుల సదస్సు

ఈ నెల 14, 15 తేదీల్లో విశాఖలో జరగనున్న అంతర్జాతీయ భాగస్వామ్య పెట్టుబడుల సదస్సును విజయవంతం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. తనతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌, ఐటీ శాఖ మంత్రి లోకేశ్‌, వివిధ శాఖల మంత్రులు ఆయా జిల్లాల్లో పరిశ్రమలకు శంకుస్థాపనలు చేస్తారని తెలిపారు. ఇటీవల తాను జరిపిన విదేశీ పర్యటనల్లో వివిధ సంస్థలను రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించానని చెప్పారు. విశాఖలో జరగనున్న భాగస్వామ్య సదస్సులో పాల్గొనాలని ప్రత్యేకంగా కోరానని చెప్పారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు పలు దేశాల పారిశ్రామికవేత్తలు సుముఖంగా ఉన్నారని తెలిపారు. ఈ సమావేశంలో మంత్రులు లోకేశ్‌, అచ్చెన్నాయుడు, భరత్‌, నారాయణ, వాసంశెట్టి సుభాష్‌, బీసీ జనార్దనరెడ్డి, గొట్టిపాటి రవికుమార్‌, అనగాని సత్యప్రసాద్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 08 , 2025 | 04:30 AM